తగ్గడానికి..తిండి తగ్గించక్కర్లేదట

 

 

అందంగా కనిపించాలంటే శరీరాన్ని తగ్గించాల్సిందే అంటున్నారు నేటితరం అమ్మాయిలు. దీంతో పొద్దున్న టిఫిన్ తింటే..మధ్యాహ్నాం భోజనం కట్..ఒకవేళ మధ్యాహ్నాం హేవిగా తింటే సాయంత్రం ఖాళీ కడుపుతో పడుకోవడమే.. ఇక రాత్రంటరా..? రాత్రిపూట భోజనం తినడాన్ని ఈ తరం ఎప్పుడో మరచిపోయింది..రెండు చపాతీలు అది కూడా కుదిరితేనే.

 

ఏది ఏమైనప్పటికి నాజూకైనా శరీరాన్ని సాధించాలి. ఇది ఒక్కటే అమ్మాయిల మెయిన్ టార్గెట్. అయితే పాపం తప్పు వీరిది కాదులే..సన్నబడాలంటే నోరు కట్టేసుకోవాలనే చెబుతారు పేరు మోసిన డైటీషియన్లందరూ. కానీ బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోకుండా సంప్రదాయ భారతీయ ఆహారం తీసుకుంటే సరిపోతుందంటున్నారు బాలీవుడ్ తారల ఫేవరేట్ డైటీషియన్ రుజుత. స్థానికంగా పండిన ఆహారాన్ని తినడంతో పాటు శారీరక వ్యాయామం, కంటి నిండా కునుకు ఉంటే బరువును అదుపులో ఉంచుకోవచ్చంటున్నారామె.


ప్రతీ రోజు నెయ్యి:
ఇదివరకటి రోజుల్లో నెయ్యి లేకుండా ఏం తినేవారు కాదు..కానీ ఇప్పుడు సన్నబడాలనే మోజులో నెయ్యిని పూర్తిగా దూరం పెడుతున్నారు. అయితే ప్రతిరోజూ నిరభ్యంతరంగా నెయ్యిని తినొచ్చు అంటున్నారు రుజుత. కొన్ని పదార్థాలను ఎక్కువ నెయ్యితో, కొన్నింటిని తక్కువ నెయ్యితో కలిపి తినొచ్చు. అయితే పరిమితంగా తినటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది,  జాయింట్ల సమస్యలు దరిచేరవు.


జ్యూస్‌లు తాగకండి..పళ్లు తినండి:
వీలు కుదిరితే ఏదో ఒక పండును జ్యూస్ చేసుకోవడానికి చూస్తారు తప్ప వాటిని తృప్తిగా తిందామని ఎవ్వరూ అనుకోవడం లేదు..ఎందుకంటే ఎవరికి అంత టైం ఉండటం లేదు. కానీ నోటిలో పళ్లున్నంత కాలం జ్యూస్‌లు చేసుకుని తాగే బదులు కూరగాయలు, పళ్లను చక్కగా నమిలి తినొచ్చంటున్నారు. దీని వల్ల జ్యూస్ చేసుకునే ప్రక్రియలో మిగిలిపోయే పీచు పదార్థాలు ఇతర పోషకాలు కూడా మన శరీరంలోకి వెళతాయి.

 

వీటిని ఆహారం నుంచి నిషేధించండి:
కేక్, బిస్కెట్స్, బ్రెడ్, పాస్థా, పిజ్జా లాంటి జంక్ ఫుడ్‌ని దూరం పెట్టండి.

 

పొద్దున్నే టీ మానండి:
చాలా మందికి ఉదయాన్నే టీ తాగనిదే ఏ పని చేయబుద్ధి కాదు. అయితే ధీర్ఘకాలంలో ఇలాంటి అలవాటు చేటు చేస్తుందట. మరీ ముఖ్యంగా ఆకలేస్తే టీతో సరిపెట్టడం మానండి..అయితే మరి ఎక్కువసార్లు కాకుండా రోజులో 2-3 సార్లు తీసుకోవచ్చు.

 

ఏదో ఒకటి తినండి:
ఇదివరకటి రోజుల్లో ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే మధ్యలో వంటింట్లో లభించే ఆహార పదార్థాలు తీసుకునేవారు. దీని వల్ల పనిలో అలసట ఉండదు సరికదా..? నాజుగ్గా ఉంటారు...భోజనం సమయంలో ఎక్కువ తినరు.