కూర్చునే ఉంటే ముసలివారైపోతారు

 

 

కొంతమందిని చూడండి. ఎంత పెద్దవారైనా కూడా వయసు మీద పడినట్లే అనిపించదు. మరికొందరేమో కుర్రతనంలోనే నడివయసు మీదపడినట్లు కనిపిస్తారు. అలాంటి స్థితికి ఒకానొక కారణం తెలిసిపోయిందంటున్నారు పరిశోధకులు.


అమెరికాకు చెందిన కొందరు వైద్యులు నిరంతరం కూర్చుని ఉండే జీవనశైలికీ, ముసలితనానికీ మధ్య ఏమన్నా సంబంధం ఉందేమో అని పరిశీలించారు. ఇందుకోసం వారు 64 నుంచి 95 ఏళ్ల వయసు మధ్య ఉన్న ఓ 1500 మంది స్త్రీలను ఎన్నుకొన్నారు. వీరందరి జీవనశైలికి సంబంధించి అనేక వివరాలను సేకరించారు. వీరు రోజులో ఎంతసేపు కూర్చుని ఉంటారు, ఎలాంటి వ్యాయామం చేస్తారు వంటి గణాంకాలను నమోదు చేశారు. అంతేకాకుండా వీరి శరీర కదలికలను గమనించేందుకు నడుముకి accelerometer అనే పరికరాన్ని జోడించారు.


రోజుకి నలభై నిమిషాలన్నా శరీర శ్రమ లేకుండా కనీసం పదేసి గంటలపాటు కూర్చునే ఆడవారి డీఎన్‌ఏలో ఓ వింతమార్పుని గమనించారు పరిశోధకులు. వీరి డీఎన్‌ఏలోని telomeres అనే వ్యవస్థ త్వరగా దెబ్బతింటున్నట్లు తేలింది. ఈ telomeres మన డీఎన్‌ఏ చివరన ఓ తొడుగులా ఉండి అవి త్వరగా నిర్వీర్యం అయిపోకుండా కాపాడతాయి. మనలోని వయసు పెరిగే కొద్దీ telomeres అరిగిపోతాయి. దాంతోపాటుగానే శరీరంలో కణాలకి రక్షణ కరువై అనేక సమస్యలు మొదలవుతాయి.


వయసు మీరే కొద్దీ సహజంగా రావాల్సిన ఈ మార్పు మన బద్ధకం వల్ల త్వరగా వచ్చేస్తుందంటున్నారు. దీని వల్ల శరీరం పైకి చూడ్డానికి ఎలా ఉన్నా, అంతర్గతంగా దాదాపు ఎనిమిదేళ్లు ఎక్కువ ఆయుష్షుకి చేరుకుంటుందట. ఫలితంగా డయాబెటిస్, గుండెజబ్బులు, కేన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు దాడిచేసే ప్రమాదం ఉందంటున్నారు. పొగతాగే అలవాటు ఉన్నవారిలో కూడా ఇలా telomeres త్వరగా అరిగిపోవడాన్ని గమనించారు.


అదీ విషయం! మన నిస్తేజం వల్ల శరీరం లోలోపల ఇంత అనర్థం జరుగుతుందన్నమాట. అందుకని బద్ధకాన్ని వీడి రోజుకి కనీసం ఓ అరగంటన్నా వ్యాయామం చేయమని సూచిస్తున్నారు. అప్పుడు ఆరోగ్యమేం కర్మ వయసు కూడా పదహారేళ్ల దగ్గరే ఆగిపోతుంది.

 

- నిర్జర.