దేశానికి తిరిగివ్వాలంటే శ్రీమంతుడు కానక్కర్లేదు

 


గ్రామాలను దత్తతు తీసుకోవడం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. డబ్బున్న వ్యాపారవేత్తలు, పేరున్న సినిమా హీరోలు ఏదో ఒక గ్రామాన్ని దత్తతు తీసుకుని వార్తల్లో నిలుస్తున్నారు. కానీ ఒక సాదాసీదా వైద్యురాలు ఓ మారుమూల గ్రామాన్ని దత్తతు తీసుకుని వారి జీవితాల్లో భాగమైపోయిన్న వార్తని ఎప్పుడన్నా విన్నారా. ఆ వైద్యురాలే ‘సీమా సాదికా’

 

 

వైద్యురాలిగా

దాదాపు ఓ దశాబ్దం క్రితమే సీమా సాదికా వైద్యవృత్తిలో పట్టా పుచ్చుకున్నారు. అయితే మారుతున్న అవసరాలకు అనుగుణంగా వైద్యంలో ఏదన్నా ప్రత్యేకమైన విభాగాన్ని ఎంచుకోవాలని సీమా అనుకున్నారు. రకరకాల అవసరాలనీ, వేర్వేరు అనుభవాలనీ దృష్టిలో ఉంచుకొని చివరికి ‘యాంటీ ఏజింగ్’ విభాగంలో ముందుకు సాగేందుకు నిర్ణయించుకున్నారు. పోషకాహారం మొదలుకొని స్టెమ్‌ సెల్‌ థెరపీ వరకూ రకరకాల పద్ధతుల ద్వారా ఒక మనిషిని మరింత యవ్వనంగా చూపించే ప్రక్రియే ఈ యాంటీ ఏజింగ్‌! యాంటీ ఏజింగ్ విభాగంలో తగినంత నైపుణ్యం సాధించిన సీమా 2009లో AURA ANTI-AGING CENTREని స్థాపించారు. కొద్దిరోజుల్లోనే ఈ కేంద్రం బెంగళూరులో మంచి పేరుని తెచ్చుకుంది.

 

 

ఆలోచన రేకెత్తించిన ప్రశ్న

సీమాకి మొదటి నుంచి సామాజిక సేవ చేయడం అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఆ ఇష్టంతోనే ఆమె కర్ణాటకలోని మారుమూల గ్రామాలలో వైద్యశిబిరాలను నిర్వహించేవారు. అలా ఒకసారి ఎక్కడో వైద్యశిబిరం నిర్వహిస్తుండగా ఒకామె సీమా దగ్గరకు వచ్చింది. ‘‘మీరు ఆర్నెళ్లకి ఓసారి వైద్యశిబిరాలను నిర్వహిస్తారు. ఆ సమయంలో మాలో ఏవన్నా రోగాలు కనిపిస్తే మందూమాకూ ఇస్తారు. కానీ మీరు వెళ్లిపోయాక మా పరిస్థితి ఏంటి! అప్పుడు ఏమన్నా అనారోగ్యం వస్తే చికిత్స తీసుకునేందుకు మా దగ్గర డబ్బులు ఉండవు కదా!’’ అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నతో సీమాకి ఆలోచనలు మొదలయ్యాయి. ఏదో తాత్కాలికంగా వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తే వారి జీవితం బాగుపడదనీ... విద్య, ఉపాధి, పారిశుద్ధ్యం, పోషకాహారం వంటి ఎన్నో రంగాలలో వాళ్లు ముందుకు అడుగు వేయనిదే బతుకులు మారవనీ అర్థం అయ్యింది. ఆ ఆలోచనతోనే గత సంవత్సరం ‘నమ్మ మిత్ర’ (మన స్నేహితుడు) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటయ్యింది.

 

 

ఊరినే మార్చేశారు

నమ్మ మిత్ర సంస్థ ఆధ్వర్యంలో సీమా, కర్ణాటకలోని బనాదూర్‌ గ్రామం (ధార్వాడ్‌ జిల్లా) బాగోగులను చూడాలని నిర్ణయించుకున్నారు. గ్రామస్తులలో ఉండే కుమ్ములాటలు, అభిప్రాయబేధాలు, రాజకీయాలు... వంటి అడ్డంకులన్నింటినీ దాటుకుని ఆ గ్రామాన్ని అభివృద్ధి వైపుగా నడిపిస్తున్నారు.

- గ్రామంలో ఒక సోలార్‌ గ్రిడ్‌ని ఏర్పాటు చేసి 70 ఇళ్లకి విద్యుత్‌ సౌకర్యాన్ని అందించారు.

- E-Shala పేరుతో గ్రామంలోని 6-10 తరగతి పిల్లలు రాత్రివేళల్లో చదువుకునేలా ఒక ఉపాధ్యాయుడినీ, దృశ్యశ్రవణ పరికరాలనీ సమకూర్చారు.

- గ్రామంలో మొబైల్‌ ఫోన్‌ రిపేరింగ్‌ సెంటర్‌, కుట్టు శిక్షణా కేంద్రాలు వంటివి ఏర్పాలు చేశారు. ఊరిబడిలో కంప్యూటర్‌ ల్యాబ్‌ని ఏర్పాటుచేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

- నమ్మ మిత్ర తరఫున పనిచేసే స్వచ్ఛంద సేవకులు ఎప్పటికప్పుడు గ్రామంలోని పరిస్థితులను అంచనా వేస్తూ, అవసరమైన చోట తమ సేవలను వినియోగిస్తూ ఉంటారు.

‘నమ్మ మిత్ర’ బనాదూర్ గ్రామంలో చేస్తున్న కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇవ్వడంతో, రాష్ట్రంలోని మిగతా గ్రామాలకు కూడా ఈ సేవలను విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశానికి ఉపయోగపడాలి, గ్రామాలకు ఏమన్నా చేయాలి అన్న లక్ష్యాలు కేవలం శ్రీమంతులకే పరిమితం కాదనీ... మంచితనం, సంకల్పం ఉంటే ఎవరి పరిధిలో వారు అద్భుతాలు సాధించగలరనీ సీమా సాదికా నిరూపిస్తున్నారు.

 

- నిర్జర.