ఎదురుచూసిన రైలు

 

    ఫ్లాట్ ఫారమ్ అంతా రద్దీగా, చీదరగా, అసహ్యంగా ఉంది. జనం కుప్పలు కుప్పలుగా కూర్చుని గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఈగలు గుంపులు గుంపులుగా సంతోషంతో కేరింతలు కొడుతున్నాయి. చుట్టలు, బీడీలు, సిగరెట్ల పొగలు మేఘాల్లా పైకి లేస్తున్నాయ్. వర్షం సన్నగా, బెరుగ్గా, తీరిగ్గా కురుస్తోంది. చిరంజీవి కూర్చోవడానికి సీటు కోసం వెతుకు తున్నాడు. కూర్చోవాలని కాళ్లు గొడవ పెడుతున్నాయి. ఫ్లాట్ ఫారమ్ మీద సిమెంట్ బెంచీలు ఎక్కువ లేవసలు! ఉన్నవాటి మీద జనం కూర్చున్నారు. జనం కూర్చోగా ఓ బెంచీ విరిగిపోయి కూర్చోవడానికి వీళ్ళేకుండా పడిపోయింది. 

 

    ముందుకు నడుస్తున్నాడు చిరంజీవి కూర్చోవడానికి స్థలంకోసం వెదుకుతూ. అప్పుడు లావుగా, తెల్లగా, అందంగా , దర్జాగా, ధీమాగా నడిచిన చిరంజీవి ఇప్పుడు సన్నగా, గాలికి ఎగిరిపోయేలా, బక్కగా, కర్రలా నడుస్తున్నాడు. చేతిలోని గుడ్డ సంచి అతన్ని ఓ పక్కకు గుంజేస్తోంది. గడ్డం పెరిగిపోయి, మాసిపోయి తెల్లటి గుడ్డుమీద నల్లని బోర్డర్ లా కనిపిస్తోంది.

 

    చిరంజీవి ఆగాడు. ఆగి చుట్టూ చూశాడు. చోటులేదు. ఎక్కడా లేదు. అంగుళం చోటు ఖాళీలేదు. జనం! ఎక్కడ చూసినా జనమే! ఉమ్ముతూ, సిగరెట్లు తాగుతూ, కిల్లీలు నములుతూ తింటూ, చెవులు హోరెత్తిపోతున్నాయ్.

 

    వీళ్ళందరూ ఎందుకింత గట్టిగా మాట్లాడుకుంటారు? అసలేం మాట్లాడుకుంటారు? చిరంజీవి కాళ్ళు లాగేస్తున్నాయ్. ఇక నించోలేడు. కష్టం! ఎక్కడోచోట కూలబడాలి. అసలు ఈ పాడు రైలు లేటు. ఎంతో తెలియదు. అరగంట అంటాడు ఏ.ఎస్.ఎమ్. కాదు, ముప్పావుగంట అంటాడు టికెట్ కలెక్టర్.

 

    అబద్ధం! గంట అంటారు ప్రయాణీకులు. అసలెప్పుడది వస్తుందో తెలియదెవ్వరికీ. ఒకోసారి అసలు రాదు కూడా!

 

    చుట్టూ కలియజూశాడు చిరంజీవి.

 

    కాంటీన్ పక్కగా కొంచెం స్థలం ఉందికాని, చాలా బొద్దింకలు నించుని ఉన్నాయక్కడ. కూర్చోవాలంటే వాటిని తోలాలి. ఓ ముష్టివాడొచ్చి వాటిని తోలేసి అక్కడ కూలబడ్డాడు. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది.

 

    మరికొంచెం ముందుకి నడిచాడు చిరంజీవి. అక్కడ ఓ స్తంభాన్నానుకుని నిలబడ్డాడు. సంచి కింద ఉంచాడు. చెయ్యి తిమ్మిరెక్కిపోయింది బరువుకి. రెండుసార్లు చెయ్యి విదిలించాడు. దగ్గు వచ్చింది- ఉయ్యాలలా, ఉప్పెనలా.

 

    ఒకరిద్దరు చిరంజీవి వంక తిరిగి చూశారు దగ్గుతూంటే. ఓ అర నిమిషం తరువాత తేరుకున్నాడు చిరంజీవి. కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినయ్. రుమాలు జేబులో కుక్కుకున్నాడు. ఆయాసంగా ఉంది. నీరసంగా ఉంది. గొంతు మంటగా ఉంది. కాళ్ళు విపరీతంగా, భరించలేనంతగా నొప్పి పుడుతున్నాయి. మరోసారి చుట్టూ కలియజూశాడు చిరంజీవి. చూసి ఉలిక్కిపడ్డాడు. ఎదురుగా సిమెంట్ బెంచీమీద అటువైపు తిరిగి కూర్చుంది పార్వతి. నల్లని పువ్వులచీర! పార్వతికి ఇష్టమయిన చీర- పార్వతేనా? పక్కనుంచి అలాగే కనిపిస్తోంది. కొంచెం ముందుకి వెళ్ళి చూశాడు చిరంజీవి.  

 

    పార్వతే! పార్వతే! సందేహం లేదు. తలలో ఎఱ్ఱ గులాబీలు అవును, పార్వతే! మరి ఆ పక్కన ఎవరు? భర్తా? అవును. పార్వతి చేతుల్లో నిద్రపోతూ పసివాడు- మాసాల పాపాయి!

 

    పార్వతి చిరంజీవిని చూడలేదు. భర్త ఏదో చెబుతూంటే వింటూంది. అప్పుడప్పుడు నవ్వుతోంది. నవ్వి మళ్ళీ వింటూంది. వింటూనే తనూ ఏదో అంటోంది.

 

    చిరంజీవి కళ్ళవెంబడి నీళ్లు తిరిగినయ్.

 

    పార్వతి చిరంజీవిది. ఆమె భర్త కూర్చున్న స్థలం చిరంజీవి రిజర్వ్ చేసుకొన్నది. చిరంజీవి హృదయం పార్వతిది.

 

    చిన్నప్పటినుంచి కలిసిమెలసి తిరిగిన పార్వతి.

 

    రెండేళ్ళ తరువాత- ఇప్పుడు ఇన్నాళ్లూ చూడకుండా గడిపి, కావాలని కలుసుకోకుండా దాక్కొని, అనుకోకుండా ఇప్పుడు కలుసుకుని చూస్తున్నాడు. పాపం! పార్వతి! ఆశ, నిరీక్షణ, నిస్పృహ, దిగులు, కోపం, విరక్తి ఇప్పుడు వాటి తరువాత ఇలా...   

 

    ఉరిమింది ఆకాశంలో. చీకటిలా వ్యాపిస్తున్నాయి మబ్బులు. పార్వతి ఒళ్ళోని పాపాయి ఉలిక్కిపడి ఏడుపు మొదలుపెట్టాడు. వాడిని సముదాయిస్తోంది పార్వతి. సముదాయిస్తూనే చిన్నగా నవ్వుతోంది. నవ్వు! పార్వతి అందంగా చాలామందికి అందని వరంలా తీయగా నవ్వుతుంది.

 

    పార్వతి నవ్వు చూస్తూ కూర్చోవడం చిరంజీవికి హాబీ ఒకప్పుడు.

 

    మొదటిసారిగా పార్వతి నవ్వులోని వింత అందాన్ని, తీయని అనుభూతిని చిరంజీవి గమనించిన రోజు-

 

    చిరంజీవి పరాసుపేటలోని మామిడితోటలో దొంగతనంగా మామిడి చెట్లెక్కి కాయలు కోస్తున్నాడు. పార్వతి వాటిని ఏరి పుస్తకాల సంచిలో వేసుకుంటోంది. తోటమాలి వస్తాడేమో అని నాలుగువైపులా జాగ్రత్తగా చూస్తోంది. సంచీ నిండిపోయింది. చాలన్నా వినకుండా చిరంజీవి ఇంకా మామిడికాయలు కోస్తున్నాడు. అప్పుడు తోటమాలి వస్తున్నాడని కంగారుగా అరిచింది పార్వతి. చిరంజీవి గాబరాగా చెట్టు దిగసాగాడు. కాలు జారిపోయింది. కొమ్మమీద నుంచి కిందికిపడ్డాడు. మోకాలు కొట్టుకుపోయింది చేతులమీద గీరుకుపోయింది. అప్పుడు చిరంజీవిని చూసి విరగబడి నవ్వటం మొదలుపెట్టింది పార్వతి. భుజానికి మామిడికాయల సంచీ, పొట్టి ఎఱ్ఱ గౌనూ, చేతిలో పుస్తకాలూ, చిన్న జడా నవ్వుతూన్న పార్వతిని కోపంగానూ, ఆశ్చర్యంగానూ చూశాడు చిరంజీవి.  

 

    ఆ నవ్వూ, నవ్వుతున్నప్పుడు తోడుగా కలిసి నవ్వేస్తున్న ఆ కళ్ళూ, ఆ పార్వతి రూపం, చిరంజీవి హృదయంలో శాశ్వతంగా ముద్రించుకుపోయాయ్. ఆ నవ్వులో నైర్మల్యం, ఓ వింత అందం కనుపించాయ్ చిరంజీవికి.

 

    "ఆపు! ఏమిటా నవ్వు?"

 

    పార్వతి అతికష్టం మీద ఆపుకుంది.

 

    "దెబ్బ తగిలిందా?" అంది నవ్వు ముఖంతోనే.

 

    "హు! మరేం ఫర్వాలేదులే! ఇంకోసారి ఇలా చేశావంటే నిన్నిక్కడికి తీసుకురాను!" నెత్తురు వస్తున్న చోట ఇసుక జల్లుకుంటూ అన్నాడు.

 

    ఇద్దరూ స్కూల్ కి వచ్చారు. అక్కడ వాళ్ళ జట్టు వాళ్ళందరూ కూర్చుని ఉప్పూ, కారం అద్దుకుని మామిడికాయలు తినేశారు.

 

    చిరంజీవి ఆలోచిస్తూనే ఉన్నాడప్పటినుంచీ- పార్వతి నవ్వెందుకలా తమాషాగా, వింతగా, ప్రత్యేకంగా ఉంటుంది?" అని.

 

    అప్పటినుంచే పార్వతిని నవ్విస్తూ అందులో అందాన్ని ఆనందంగా ఆస్వాదించటం అలవాటైపోయింది.

 

    వర్షం ఎక్కువయింది. చలిగాలి ఉండి ఉండి విదిలించి వీస్తోంది.

 

    పాపాయి ఏడుపు ఆపలేదు. పార్వతి సముదాయించటం మానలేదు. పాపాయిని ఎత్తుకుని లేచి నించుంది. నించొని చిరంజీవి నించున్నవైపు అడుగులు వేసింది. చిరంజీవి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. చూస్తుందేమో? చూస్తే మాట్లాడుతుందా? చూడనట్టు వెళ్ళిపోతుందా? మరోవైపు నించున్నాడు చిరంజీవి. పార్వతి దాటి ముందుకి వెళ్ళింది. ఫ్లాట్ ఫారం అంచువరకూ వెళ్ళి నించుంది. వర్షం నీళ్ళను చేయి చాచి అందుకుని పాపకు చూపిస్తోంది. పాపాయి ఏడుపు ఆపేశాడు. చిన్నగా నవ్వుతున్నాడు . వెనక్కు తిరిగింది పార్వతి. చిరంజీవి కళ్ళప్పగించి చూస్తూండిపోయాడు. తప్పించుకోవడం కుదరదు. పార్వతి నాలుగడుగులు ముందుకేసి అనాలోచితంగా తలెత్తి చిరంజీవిని చూసింది. చిరంజీవి ఆమెవంకే చూడసాగాడు. పార్వతి అక్కడే బొమ్మలా నిశ్చేష్టురాలై చిరంజీవినే చూస్తూ నించుండిపోయింది. భుజంమీద పాపాయీ, బెంచీమీద కునికిపాట్లు పడుతున్న భర్తా  ప్లాట్ ఫారం మీద జనం, మిగతా ప్రపంచం- అన్నీ మర్చిపోయింది. పార్వతి కళ్ళలో చిరంజీవి, చిరంజీవి కళ్ళలో పార్వతి వెతుకుతున్నారు. మనసులోని భావాల్నీ, హృదయంలోని బాధనీ కళ్ళతో చదవడానికి ప్రయత్నిస్తున్నారు.