హిందీ సినీనటులు గోవింద, ఛుంకీపాండే, ఫర్హా, జానీలివర్ (మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా) లను అసాసినేట్ చేసే ప్రయత్నం ఇటీవలే (ఏప్రియల్, 1990) జరిగింది. అయితే ఆలోపే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పసిగట్టి నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసి ఇంటరాగేట్ చేయగా, అసలు కథ బయటకు వచ్చింది. దాంతో అసాసినేట్ ప్రయత్నం నీరుగారిపోయింది.
    
    కిరాయి హంతకుల హిట్ లిస్టులో గోవింద పేరు ప్రధమస్థానంలో ఉంది. అతనిప్పుడు పోలీసులు, తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది రక్షణలో షూటింగ్స్ కి హాజరవుతున్నాడు. ఎప్పుడూ హుషారుగా, త్రుళ్ళుతూ కేరింతలు కొడుతూ ఉండే గోవింద ప్రాణభయంతో క్షణాలు లెక్కపెట్టుకుంటున్నాడు. ఫర్హాపరిస్థితి కూడా అంతే. ఛుంకీపాండే, జానీలివర్ లు కూడా పోలీసు ప్రొటెక్షన్, సొంత సెక్యూరిటీ సిబ్బంది లేకుండా అడుగు కూడా బయటకు వేయటం లేదు.
    
    బొంబాయి నుండి అదృశ్యమైపోయి దుబాయ్ లో ఉంటున్న మాఫియా ముఠా నాయకుడు దావూద్ ఇబ్రహీం ప్రతి ఏటా హిందీ సినీ నటీనటులను దుబాయ్ కి పిలిపించుకొని భారీగా పార్టీలిస్తుంటాడు. అతనికి అదో సరదా దావూద్ శత్రువు ఒకరు పగబట్టి వార్ని చంపించే ప్రయత్నం చేసి ఉంటారని కొందరి ఊహాగానం కేవలం అదే కారణమైతే అలా దావూద్ పార్టీకి హాజరయిన మిగతా ఆర్టిస్టుల్ని ఎందుకు వదిలేస్తారని మరో వాదన కూడా. ఏది ఏమైనా బొంబాయి చీకటి ప్రపంచపు క్రయిమ్ కారిడార్స్ లో వార్ని అసాసినేషన్ చేసేందుకు ప్రేరేపితమైన కారణాలు ఏమిటన్నది ఎవరికీ ఇంకా తెలిసి రాలేదు. గ్యాంగ్ వార్స్ ఓ ప్రక్క కిరాయి హత్యలు ఇంకో ప్రక్క, లూటీలు, దొంగతనాలు, క్రిమినల్స్, గేంబ్లింగ్, కాటన్, రమ్మీలు పబ్లిసైజ్డ్ క్రిమినల్స్, చార్లెస్ శోభారాజ్ కోసం ఎదురుచూస్తున్న థాయ్ లాండ్ ఫైరింగ్ స్క్వాడ్, థాయ్ లాండ్ లా ప్రకారం క్రిమినల్ అఫెన్ సెస్ క్రింద చార్జ్ అయినవాళ్ళు 20 యేండ్లలోపే శిక్షింపబడాలి. ఆ గడువు దాటితే శిక్షించే హక్కును థాయ్ లాండ్ చట్టం కోల్పోతుంది. థాయ్ లాండ్ చట్టపు లొసుగులు తెలుసుకున్న తెలివయిన నేరస్థుడు శోభారాజ్ 1995 వరకు ఇండియాలో ఉండే ప్రయత్నం భారీ ఎత్తున ఎక్స్ పోర్టు వ్యాపారాలు ఆరంభించి కొన్ని వేలకోట్లకు ప్రపంచ దేశాల బ్యాంకుల్ని దివాళా తీయించిన వైట్ కాలర్ క్రిమినల్ రాజేంద్ర సేధియా- గిన్నీస్ బుక్ లో ఎక్కిన ఇండియన్సులో ఇతనొకడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి కిడ్నాప్ చేయబడిన పార్లమెంట్ సభ్యుడు శ్రీ జి. వెంకటస్వామి మనుమడు వికాస్ కిడ్నాప్ చేసి నెలలు కావస్తున్నా నేరస్థుల్ని పట్టుకొనే విషయంలో మూడంగుళాలయినా ముందుకు కదల ని హైదరాబాద్ పోలీసులు వీళ్ళందరికి పోలీసు టోపీలు, లాఠీలు, అధికారాలు, పెద్ద పెద్ద జీతాలు, ఫోజులు, రాయలసీమంతా రక్తసిక్త రణరంగాలు, పట్టపగలు జీపులకు కట్టిపడేసి రోడ్లమీద అమానుషంగా అమాయకుల్ని లాగే దుష్టుల దుర్మార్గాలు, కిమ్మనలేని అసమర్ధపు పోలీసులు.
    
    బొంబాయి నగరానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉల్ హౌస్ నగర్ లో మార్చి 30, 1990నాడు కాలేజీ పరీక్షలు జరుగుతుండగా హరీష్ పటేల్ తన ఫ్రెండ్స్ తో, మారణాయుధాలతో క్లాస్ రూమ్ లోకి ప్రవేశించి సూడెంట్స్ ని, లెక్చరర్ ని బెదిరించి బయటకు పంపి ముక్కుపచ్చలారని సంగీత పాటిల్ ని నిట్టనిలువునా కిరోసిన్ పోసి కాల్చివేసిన ఘోరకృత్యం- ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో మంటలు- బొంబాయి నారిమన్ పాయింట్ ఓబరాయ్ టవర్స్ లో నిప్పులవాన- అమాయక ప్రజల కిడ్నాపుల పర్వం- టెర్రరిస్టుల ఆగడాలు- పాకిస్థాన్ నుండి వచ్చే ముష్కరుల ఆటలు- ఏమిటివన్నీ.... వీటికి అంతం లేదా? అంతం చేసేందుకు పోలీస్ వ్యవస్థను, నేరపరిశోధక శాఖల్ని ప్రక్షాళనం చేసి ఆధునికీకరించే ప్రయత్నాలే జరగవా? జరగనప్పుడు ఈ రాజకీయ నాయకులూ, పోలీసు వ్యవస్థ దేశ ప్రజల సొమ్మును దోచుకుతినే అరాచకానికి ఎప్పుడు అంతం...?
    
    ఇండియన్ పోలీసు శాఖల్లో పనిచేసే సిబ్బందిని ఎఫ్.బి.ఐ. ముందో ఇంటర్ పోల్, స్కాట్ లాండ్ యార్డు ముందో నించోబెడితే ఒక్కశాతమే ఆ ఉద్యోగాలు చేయటానికి అర్హతను కలిగి ఉంటారట....
    
    డబ్బున్న బడా స్వాములకు లొంగిపోయిన మాజీ సి.బి.ఐ. చీఫ్ కాత్రే....అర్హత లేకున్నా కాత్రేని పదవిలోకి తెచ్చిన గత ప్రభుత్వం ఆ కృతజ్ఞతతతో సి.బి.ఐ.ని దిగజార్చి ఆ పార్టీ వ్యక్తుల్ని, సానుభూతిపరుల్ని రక్షించి సొమ్ము చేసుకున్న కంత్రి కాత్రే.... వీళ్ళా నేరపరిశోధక శాఖల అత్యున్నత పీఠాలపై అధిరోహించేది. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకోవటం అన్నది మనదేశ ప్రజల దౌర్భాగ్యం.
    
    కనీసం ఇప్పటికయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మేధావులు కళ్ళు తెరచి బుర్రలో గుజ్జు, గుండెలో బలం, రక్తంలో నీతి నిజాయితీ, మనస్సులో వృత్తిపట్ల గౌరవం ఉన్నవారికే నేరపరిశోధక శాఖల్లో, పోలీసుశాఖల్లో ఉద్యోగాలివ్వాలి.
    
    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రిప్ లోంచి ఈ శాఖల్ని తప్పించి స్వతంత్ర శాఖలుగా (న్యాయ వ్యవస్థ మాదిరి) చేసి ఎఫ్.బి.ఐ. స్కాట్ లాండ్ యార్డు, ఇంటర్ పోల్ సహకారంతో నేరపరిశోధనా పద్ధతుల్ని ఆధునికీకరించాలి. ఫోరెన్ సిక్ సైన్స్ సహాయాన్ని పూర్తిగా తీసుకోవాలి.
    
    నేరస్థుల చరిత్రల్ని ఔపాసన పట్టి, ఢిల్లీ, బొంబాయిలాంటి నగరాలలో కంప్యూటర్ బ్యాంక్స్ ని ఏర్పాటు చేసి వాటిలో ఆ వివరాలను స్టోర్ చేసి ఏ రాష్ట్ర పోలీసులకు ఏ వివరాలు కావల్సి వచ్చినా నిమిషాల్లో అందించి నేరపరిశోధన శీఘ్రతరం అయ్యేలా చూడాలి. (ఎఫ్.బి.ఐ.లో 19కోట్ల మంది వేలిముద్రలు ఫైల్ చేసున్నాయి) హైప్రీక్వెన్సీ వైర్ లెస్ సెట్స్, వేగంగా వెళ్ళగల వాహనాలు, అత్యాధునిక ఫైర్ ఆర్మ్స్ పోలీసుశాఖలకు సమకూర్చాలి. కాలం చెల్లిన నేర పరిశోధనా పద్ధతులకు తిలోదకాలివ్వాలి.
    
    మందభాగ్యుల్ని, స్వార్ధపరుల్ని, అహంభావుల్ని, సోమరిపోతుల్ని తాగుబోతుల్ని, సచ్చీలత, నీతి, నిజాయితీ లేనివార్ని, చేస్తున్న వృత్తిని కన్నతల్లిగా భావించనివార్ని, కనీసం రెండు భాషలన్నా రానివాళ్ళను నేరపరిశోధక శాఖల్లోకి, పోలీసు శాఖల్లోకి తీసుకోకూడదు.
    
    క్రిమినల్ ప్రొఫెషన్ కి సరిపడే వ్యక్తుల్ని, విద్యాధికులయిన వార్ని, న్యాయశాస్త్రంతో, చట్టాలతో సంబంధం ఉన్నవార్ని, కామన్ సెన్స్, తెలివితేటలు, గుడ్ క్యారెక్టర్, ప్రజాస్వామ్య వ్యవస్థపట్ల గౌరవం, బాధితుల పట్ల సానుభూతి, నేరస్థుల పాలిట కఠిన వైఖరిని అవలంబించగల వారినే ఎన్నుకోవాలి.