శివనాథరావు ఏమీ పలక్కుండా వుండేసరికి "నన్ను గురించే ఆలోచిస్తున్నావా?" అనడిగాడు.
    
    "ఆలోచించడం అనబోకు, విచారిస్తున్నాను."
        
    'ఎందుకింత శ్రమ నీకు నా గురించి?" అన్నాడు చంద్రం.
    
    "మానవుడికి ఏమీ ప్రత్యేకత లేకుండా జీవించడం కష్టమేమో బ్రతుకు ఎప్పుడూ దుర్భరంగా వుండరాదు. నా మాటల్లోని నిజం తెలుసుకునే రోజు నీకు వస్తుందిలే."
    
    "మంచిది ఆ శుభ సమయంకోసం ఎదురుచూద్దాం."
    
    ఓ క్షణంపాటు చంద్రం ఆలోచనలో పడ్డాడు. చప్పున ఏదో స్ఫురించి "చవట సన్నాసీ" అన్నాడు.
    
    "ఏమ్క్?" అన్నాడు శివనాథరావు తెల్లబోయి.
    
    "లే" అని ఆజ్ఞాపించాడు.
    
    "ఏమిటో చెప్పవోయ్ ఆజ్ఞలు మాని."
    
    "ఇంకా ఏమిటి చెప్పేది? చదువుకున్నవాడివి. ప్రపంచజ్ఞానం కలవాడివి, ఈ మనోహరమైన సాయంత్రం యిలా వేస్టు చేస్తావా? నాన్సెన్స్ నేను సుతరామూ ఒప్పుకోను. నేను నీ ఫ్రెండ్ ని అయివుండీ బుద్ది చెప్పకుండా వుండలేను. పద, పద మీ యింటికి పద" అంటూ ఊపిరి ఆడకుండా తగులుకున్నాడు"
    
    "ఏమిట్రా నీ గొడవ?"
    
    "ఒరేయ్! నీకంటే కొంచెం లోతైనవాడ్ని ఎందుకు చెబుతున్నానో ఆలోచించుకో గో గో ఊ" అని నిట్టూర్చి "అవసరంలో ఫ్రెండ్ కి యీమాత్రం సహాయం చేయకపోతే రేపు నలుగురూ నన్ను దుమ్మెత్తి పోస్తారు" అంటూ ముఖం తుడుచుకున్నాడు.
        
    "ఉహుఁ! నేను వెళ్ళను యిక్కడ్నుంచి."
    
    "అదేం కుదరదు" అని బలవంతంగా అతని చేతులు పట్టుకుని కుర్చీలోంచి లేవనెత్తి "నేనురాను" అన్నా, మొత్తుకుమ్తున్నా వినకుండా బలంగా బయటకు లాక్కొచ్చి "గో మేన్! స్ట్రెయిట్ యు ది హౌస్" అని ఓ తోపు త్రోశాడు. శివనాథరావు కోపంతో వెనక్కి తిరగబోతుండగా తలుపు గభాలున గడియ వేసుకున్నాడు.
    
    శివనాథరావు ఓ నిముషం స్థబ్ధుడై నిలబడ్డాడు. ప్రపంచం అంతా తనని చూసి పరిహసిస్తున్నట్లు అనుభూతమై ఇందరిలో తను ఒక్కడేనా దద్దమ్మ అనే బాధతో తల ఎత్తలేక మెల్లిగా కదిలాడు. వెనకనుంచి ఏదో అసహాయత, అసమర్ధత వెన్నంటి తరుముతున్నట్లు భ్రాంతి. మోహన్ గదికి వెడితే? అవును అతను యిటువంటి పిచ్చి వేషాలేం వెయ్యడు. దారిమార్చి అటుకేసి తిరిగాడు. తీరా వెళ్ళేసరికి రూమ్ తలుపులు తాళంవేసి వున్నాయి. నిట్టూర్పే మిగిలింది. చేసేది లేక దగ్గర్లో వున్న పార్కుకి నడిచి ఏకాంతంగా వుండటానికి అనువైన ప్రదేశం చూసుకుని గడ్డిలో చతికిలబడ్డాడు.
    
    ఉన్నట్లుండి సర్వ జగత్తుమీదా, సమస్త జీవరాసులమీదా, ప్రతి విషయం మీదా విరక్తి పుట్టుకువచ్చింది. ఇంకా యవ్వనం ప్రథమదశలోనే వున్న ఆ జీవికి ఒక్కసారిగా వైరాగ్యం మీద ఆసక్తి జనించింది. ఎందుకు చిత్రాలు గీయటం? ఎందుకు చదివి తలకాయలు పాడుచేసుకోవటం? ఎందుకు పాటలు పాడి కంఠశోష? ఎందుకు యీ స్నేహాలు? ఎందుకు యీ...? ఏమిటి వీటివల్ల తేలేది? ప్రపంచంలో మానవుడికి పరిపూర్ణమైన ఆనందం కలిగించేదేమీ లేదు. కలిగించినా అది క్షణికం! సుఖంకోసం ప్రాకులాట ఓ అసహ్యం దీనికి, దుఃఖం అనే విషాదానికి అట్టేతేడాలేదు. మనుష్యులు సౌఖ్యం అని భ్రమిస్తుంటారే-దాన్నితెచ్చి తరిస్తే దృగ్గోచరమౌతుంది. లోపల ఎంత విషాదాగ్ని ప్రజ్వరిల్లుతోందో! ఏమీ చీకూచింతా వుండనవసరం లేనివాడికి కూడా ఏవో తెలియని విరక్తి, వర్ణించలేని దుఃఖమిశ్రితమైన జుగుప్సా దూరంగా వెన్నాడుతూ ఉంటాయి. ఒకరిపై ఒకరు రాగద్వేషాలు పెంచుకోవటం, అర్ధంలేని ఆకర్షణ ఆవేశం, చొరవ చేసుకుని ముందుకుపోయేవాడిదే కొంతవరకూ జీవితం. సిగ్గుతో, సున్నిత భావాలతో ముందుకూ, వెనక్కూ తటపటాయించే వ్యక్తులకు ఒకటే ఫలితం-గుండ్రని పెద్దసున్నా ఈ సున్నా ప్రపంచాన్నిచుడుతుంది. దాని గర్భంలో ఏమీ ఇమడదు. కోపం-శాంతం, పుణ్యం-పాపం, స్వార్ధం-త్యాగం, సుఖం-దుఃఖం, గర్వం-నిగర్వం ఇవన్నీ కొంతమంది మేధావులు ఒకదానికి మరొకదానికి కావలసినంత దూరంసృష్టించి వ్యతిరేకమైన అర్ధాలను ధ్వనింపచేస్తారు. ఎక్కడి రాగం? ఎక్కడి ద్వేషం? నిజమే. ఈ రెండింటికీ ఎక్కడా సామీప్యం, సామరస్యం లేవు. కానీ పగటికీ రాత్రికీ మధ్య సాయంత్రమనే ఓ చల్లని తెర వుంది. దానికి అటు చీకటి ఇటు వెలుతురూ ఈ తెగను చీల్చుకుంటూ పోతే వెలుగు కరిగి వెన్నెలవుతుంది. పోనీ చీకటి అలాగే ఓ విపరీతస్థితిలో వింత వాతావరణంలో పాపం కరిగి పుణ్యం కావచ్చు. కోపం మారి శాంతం అవవచ్చు. ఏం? యిది అసంగతమూ, అసందర్భమూ ఎందుకుకావాలి? క్రమంగా అతని ఆలోచన్లకు స్వరం తప్పుతోంది. ఆలోచనలకు అర్ధ, లేదన్నమాటకు అర్ధంవుంది. చివరకు ఝాడుసుకున్నాడు. ఈ పార్కు ఈ కోలాహలం, ఈ ప్రజలు యిదీ ప్రపంచం. కాదుకాదు, ఇహ భరించడం శక్యం కాక లేచి నడక సాగించాడు.        
    
    చీకటి నల్లగా నవ్వుతోంది. తప్పుచేసినవారిలా నరసంచారం మందంగా సాగుతోంది. వారిలో ఒకడు అతడు.
    
    జీవితకాలంలో మనిషిమీద మనిషి ప్రభావం ఎప్పుడూ వుంటూనే వుంటుంది. మనిషి మానసిక శక్తి యొక్క ఊహా పరిమితి మందగించినప్పుడు ఈ ప్రభావం తన దిగ్విజయ యాత్ర సాగిస్తుంది.
    
    ఇంటికి వచ్చి, దుస్తులు మార్చుకుని తన గదిలోకి పోయి ఏకాంతంగా కూర్చున్నాడు.
    
    మధ్యలో సరోజిని వచ్చి పలకరించింది "బావా! అలా పరధ్యాసగా వున్నావే"మని తనలో ఇన్ని ఆలోచనలు ఎవరైతే రేపుతున్నారో ఆ వ్యక్తే వచ్చి తననిలా ప్రశ్నిస్తే ఏం జవాబు చెబుతాడు? నీరసంగా నవ్వుతూ "ఏమీలేద"ని జవాబు.
    
    "బావా! నువ్వెప్పుడూ ఆలోచిస్తూ వుంటావేం?"
    
    తన ఆలోచనల మేనియాగురించి ఆమెకెలా వివరించడం?
    
    "బావా! నువ్వు ఈసారి మాతో ఊరు రావా?"
    
    ......
    
    "బావా, నా బొమ్మ పూర్తిచేయవా?"
    
    "నువ్వే ఓ బొమ్మవి....."
    
    "ఫో" అంటూ సరోజిని కోపంవచ్చి క్రిందకు వెళ్ళిపోయింది. చివరకు గోవిందు వచ్చి "భోజనానికి పదండి బాబూ" అన్నాడు.
    
    "ఈ పూట ఆకలి లేదు గోవిందూ."
    
    "అదేం మాట బాబుగారూ! మీ ఆరోగ్యం మంచిది కాదసలు. ఆకలి అయినంత తిందురుగాని రండి" అన్నాడు గోవిందు బలవంతం చేస్తూ.
    
    "ఏమీ లాభంలేదు. వాళ్ళని భోంచేయమను."
    
    గోవిందు కొంచెం చిన్నబుచ్చుకుని, కొంచెం మారిన కంఠంతో "వెడుతూ అమ్మగారు ఏం చెప్పారో గుర్తుందా? గోవిందూ, అబ్బాయిని నీ చేతుల్లో అప్పగించి వెడుతున్నాం. కంటికి రెప్పలా కాపాడాలి అన్నారు. సరేనమ్మగారూ, మీరు రాకముందు నుంచి కూడా బాబుగారి భారం నేనే వహించాను. బాబుగారి మనస్తత్వం నేనెరుగనా? అని భరోసా యిచ్చాను. ఇప్పుడు మీరిలా ఉపవాసాలుచేసి రోగం తెచ్చుకుంటే, రేపు నేను అమ్మగారికి ఏం సమాధానం చెప్పేది?"
    
    శివనాథరావు తల అడ్డంగా వూపి "గోవిందూ! నేను డాక్టరు చదువుతున్నాను, రోగాలగురించి నాకు తెలుసు. వృధాగా ఎందుకు వాదులాట?" యిహ వెళ్ళమన్నట్లు తల ప్రక్కకి త్రిప్పుకోవడం ద్వారా సూచించాడు.
    
    విధిలేక తనలో తను మధనపడి "ఐతే పాలైనా తాగండి...."
    
    "అలాగే."
    
    గోవిందు అక్కడినుండి వెళ్ళిపోయాడు. కానీ రెండునిముషాలన్నా గడవక ముందే సరోజిని వచ్చి "బావా! ఎందుకు భోంచేయవు?" అంటూ లంకించుకుంది.
    
    "సరోజినీ! భలే ప్రశ్నవేశావు. ఈ ప్రశ్నకు సమాధానం చాలా రోజులనుంచీ ఆలోచిస్తున్నాను. కానీ ఆడవాళ్ళు ప్రక్కనుంటే ఆకలి వేయదని చెబుతారు."
    
    ఆమె అతని మాట త్రోసిపుచ్చుతూ "నాలుగు మెతుకులు తిందువుగానీ రద్దూ" అంది.
    
    "అబ్బ! నువ్వు తిందూ!"
    
    "అబ్బ, రద్దూ."
    
    "అబ్బ, పోదూ."
    
    "ఓహో! అలా అయితే నేనూ అన్నం తినను తెలిసిందా? పోయి దుప్పటి ముసుగేసుకుని పడుకుంటాను."