విక్టరీ కోర్టు అపార్టుమెంట్స్ టెర్రస్ పైనుంచి సిగ్నల్ మెన్ శవం రోడ్డు మీదకు విసిరివేయబడింది. దబ్బున కిందపడ్డ శవం తలపగిలి రక్తం ఫౌంటెన్ లా చిమ్మింది రోడ్డంతా.
    
    మరుక్షణం ఆ ప్రాంతం నుంచి గొరిల్లా కమెండోస్ ఇద్దరూ అదృశ్యమైపోయారు.
    
                                               *    *    *    *    *
    
    "పని పూర్తయిపోయింది. ఇక హాన్ సోదరులు అందించే సూట్ కేస్ ని అందుకోవటమే మిగిలిపోయింది...." అన్నాడు జోహ్రా సిగార్ వెలిగించుకుంటూ.
    
    "నాకెందుకో మాస్టర్ అసాసినేట్ అయ్యాడంటే నమ్మశక్యంగా లేదు" ఖలీల్ జీప్ ని వేగంగా నడుపుతూనే అన్నాడు.
    
    "రోల్స్ రాయిస్ బ్యాక్ సీటులో వున్న మాస్టర్ గిలగిలా కొట్టుకుంటూ సీటుమీదకు వాలిపోవటాన్ని స్పష్టంగా చూశాను. పైగా ఆఖరిక్షణంలో నా పథకంలో చిన్నమార్పు చేసుకుంటూ రోల్స్ రాయిస్ బ్యాక్ టైర్సు ని ఫెయిర్ చేశాను. ప్రెజర్ ని సడన్ గా ఆ టైర్సు కోల్పోవటంతో ఫ్రంట్ టైర్సు స్కిడ్ అయ్యాయి. అదీ చూశాను..." జోహ్రా చిరాకుపడుతూ అన్నాడు.
    
    అతని పథకం దెబ్బతినటం ఎప్పుడూ జరగలేదు.
    
    క్రిమినల్ వరల్డ్ లో నెంబర్ వన్ డేంజరస్ ట్రిగ్గర్ మెన్ అంటే జోహ్రానే.
    
    "నీ గురి గొప్పదే. కాదనటం లేదు. కాని ఇంత తేలిగ్గా మాస్టర్ ప్రాణాలు తీయటం మిల్లర్ బ్రతికుండగా సాధ్యమా అని...?!" ఖలీల్ జీప్ ని జుహు బీచ్ లో శివాజీ పార్కుకేసి వేగంగా నడిపిస్తూ అన్నాడు.
    
    జోహ్రా మాట్లాడలేదు. అతనికి కోపం వచ్చింది ఖలీల్ తన పథకాన్ని శంకించటంతో.
    
                                                  *    *    *    *    *
    
    మృదుల కారు ఇస్కాన్ టెంపుల్ కి వందగజాల దూరంలో వున్న జైన్ టెంపుల్ ప్రక్కన ఆగింది. ఫ్రంటు సీట్లో ఉన్న ఇద్దరు ఆగంతకులు కారుదిగి ఇస్కాన్ కేసి సాగిపోయారు.
    
    వాళ్ళెవరో? ఎందుకు తన కారుని దారిమళ్ళించి అటు తీసుకువచ్చారో అర్ధంకాక మృదుల అయోమయానికి గురవుతూ తలెత్తి చూసేసరికి ఆ ఇద్దరు ఆగంతకులు అదృశ్యమైపోయారు. ఆ షాక్ నుంచి తేరుకుంటూ డ్రైవర్ కారుని రివర్సు చేసి రామ్ డాఇన్ కేసి సాగిపోయాడు.
    
                                                  *    *    *    *    *
    
    "టైమ్ అయిపోయింది. మాస్టర్ రానట్లేనా?" ఇస్కాన్ ప్రతినిధి ఒక కమెండోని అడిగాడు నెమ్మదిగా.
    
    కమెండో సమాధానం ఇవ్వలేదు.
    
    "నేను ఈ గుడి పాలకవర్గపు ప్రతినిధిని. మీ మాస్టర్ రాకకు నిజముగా సంతోషిస్తున్నాం మేం. వారివ్వబోయే విరాళం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాం. మేం మీకు శత్రువులం కాము. దయచేసి చెప్పండి" తిరిగి అన్నాడా ఇస్కాన్ ప్రతినిధి.
    
    కొద్దిక్షణాలు మౌనం తర్వాత "ఇప్పుడు మాస్టర్ మీ టెంపుల్ లోపల పూజలు జరిపిస్తున్నారు..." అన్నాడు గంభీరంగా ఆ కమెండో.
    
    ముందు తాను విన్నదేమిటో ఆ ప్రతినిధికి అర్ధంకాలేదు.
    
    అర్ధమయిన మరుక్షణం "వ్వాట్?" అని అరిచినంత పని చేసాడు.
    
    "ఎస్.... నౌ హీ ఈజ్ ఇన్ టెంపుల్" అంటూ ప్రక్కకు సాగిపోయాడు ఆ కమెండో.
    
    ఎలా... ఇదెలా సాధ్యం? ఆ ప్రతినిది మెదడు మొద్దుబారి పోయింది.
    
    కొద్దిక్షణాలకి తేరుకున్న అతను మెయిన్ గేట్ నుంచి గుడికేసి దూసుకు పోయాడు.
    
                                                   *    *    *    *    *
    
    మిల్లర్ ఆదేశాల మేరకు వెహికల్స్ అన్నీ విక్రోలికేసి పరుగులు తీసాయి.
    
    మిల్లర్ ఆలోచనలేమిటో వాళ్ళే మాత్రం పసిగట్టలేక పోయారు.
    
    ఓ ప్రక్క రోల్స్ రాయిస్ లో మాస్టర్ మెషిన్ గన్ బుల్లెట్స్ కి గాయపడిఉన్నాడు.
    
    ఆయనకి ట్రీట్ మెంట్ ఇవ్వటంలాంటి చర్యలేమీ తీసుకోకుండా బంగ్లాకేసి సాగిపొమ్మని ఉత్తర్వు జారీచేసాడు. ఏమిటిదంతా....? ఏం జరిగిందసలు..? కమెండోస్ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు.
    
                                                    *    *    *    *    *
    
    మాస్టర్ అసాసినేట్ చేయబడినట్లు కంట్రీక్లబ్ కి వార్త వెళ్ళింది.
    
    జోహ్రా సామర్ధ్యానికి క్రిమినల్స్ ఆశ్చర్యానందాల్ని వ్యక్తం చేసారు.
    
    జోహ్రాకి ఘనంగా పార్టీ ఇచ్చేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి.
    
                                                  *    *    *    *    *
    
    రామ్ డా ఇన్ కి వెళ్ళిన మృదుల స్థిమితంగా ఉండలేక పార్టీలో పాల్గొనలేక వెనక్కి వచ్చి కారెక్కి ఇంటికి పోనివ్వమని డ్రయివర్ కి చెప్పి కారు వెనక సీట్లో వాలిపోయింది.
    
                                                 *    *    *    *    *
    
    జోహ్రా, ఖలీల్ లీలా కెంపెన్ స్కి హోటల్ కి చేరుకున్నారు.
    
    హాన్ సోదరుల నుంచి రానున్న కరెన్సీ సూట్ కేస్ కోసం వాళ్ళు ఎదురు చూస్తుండగా వాళ్ళ సూట్ లోని ఫోన్ మ్రోగింది.
    
    జోహ్రా చటుక్కున ఫోన్ ని అందుకున్నాడు.
    
    ఫోన్ లో వినిపించిన హాన్ సోదరుడి కంఠాన్ని గుర్తుపట్టాడు.
    
    "పని పూర్తయిపోయింది. మరి డబ్బు?" జోహ్రా ఉత్సాహంగా అడిగాడు.
    
    ఆవేపు సమాధానానికి బదులు నవ్వు  వినిపించింది.
    
    "పిచ్చివాడా? మిల్లర్ ని తక్కువ అంచనా వేయకు" అని వినిపించిందా వేపు నుంచి.
    
    "వాడ్డూయూ మీన్?" జోహ్రా ఆశ్చర్యపోయాడు.
    
    "ఐమీన్... మాస్టర్ బ్రతికే ఉన్నాడని అతనిప్పుడు ఇస్కాన్ లో పూజలు పూర్తి చేసుకొని తన తల్లి, మేనకోడలుతో విక్రోలికేసి బయలుదేరాడు."
    
    జోహ్రా షాక్ తిన్నాడు.