"ఎప్పుడు, ఎక్కడ కలవాలో నేను చెప్తాను గానీ... నువ్వు ముందు కారెక్కు- మీ రూం దగ్గర దింపేసి నేనింటికెళ్తాను-" అంటూ చేతివాచీ చూసుకుని "బాప్ రేబాప్... సెవెన్ ఫిఫ్టీన్... హరియప్... హరియప్" అంటూ గబాగబా పిట్టగోడ దాటి, అక్కడకు రోడ్డుకి కుడివేపున చీకట్లో ఉంచిన మారుతీ డీలక్స్ కారు దగ్గరకు నడిచి డోర్ తీసి, స్టీరింగ్ దగ్గర తను కూర్చుంది.

 

    ఆ పక్కనే కూర్చున్నాడు అవినాష్.

 

    మారుతి అక్కడ నుంచి దూసుకుపోవడానికి కొన్ని సెకన్ల సమయం మాత్రమే పట్టింది.

 

    కారు ఆలిండియా రేడియో స్టేషన్ మీదుగా సిరిపురం దగ్గరకు వచ్చినపుడు-

 

    అవినాష్ కి చటుక్కున ఓ విషయం జ్ఞాపకానికొచ్చింది.

 

    "నన్ను ద్వారకానగర్ జంక్షన్ లో దింపేసి నువ్వెళ్ళిపో..." అన్నాడు అవినాష్.

 

    "ఏం! రూం కెళ్ళవా..." ప్రశ్నించింది రోష్ణీ.

 

    "లేదు... మా కొలీగ్ దగ్గరికి వస్తానని చెప్పాను-" చెప్పాడు అవినాష్.

 

    "ఓ.కె" రోష్ణీ మరో ప్రశ్న వేయనందుకు చాలా ఆనందించాడు అవినాష్.

 

    మరో రెండు నిమిషాల్లో కారు ద్వారకానగర్ జంక్షన్ దగ్గరికి వచ్చింది.

 

    అవినాష్ కారు దిగిపోయాడు.

 

    "సీయూ... డియర్..." హాయిగా నవ్వుతూ... ఓరగా ఒకసారి అవినాష్ వేపు చూసింది రోష్ణీ.

 

    కారు ముందుకెళ్ళిపోయింది.

 

    ఆ పేవ్ మెంట్ మీద చాలా సేపు నిలబడి పోయాడు అవినాష్.

 

    రోష్ణీతో అనుభవం చాలా గమ్మత్తుగా, ఆనందంగా ఉంది. రోష్ణీ తనని ప్రేమించడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. తనని నమ్మడం చాలా చాలా ఆనందంగా ఉంది.

 

    తన గురించి రోష్ణీకి నిజం తెలుస్తే...

 

    తన నేపధ్యం గురించి రోష్ణీకి తెలిస్తే...

 

    తనో చీకటి మనిషని, తనలో ఏమాత్రం ప్రేమలేదని రోష్ణీకి తెలిస్తే.

 

    తన ప్రేమంతా నటనని రోష్ణీకి తెలిస్తే...

 

    అవినాష్ ఆలోచిస్తున్నాడు.

 

    రోజురోజుకీ జటిలం అవుతున్న సమస్య గురించి ఆలోచిస్తున్నాడు.

 

    ఆ సమస్య పేరు గౌతమి-

 

    ఎప్పటికైనా అవినాష్ కంఠానికి తగులుకోబోయే ఆ విచ్చు కత్తుల ఉచ్చు పేరు గౌతమి.

 

    అవినాష్ అటూ ఇటూ చూసాడు. రోడ్డుకి ఎడంపక్కనున్న పాన్ షాపు దగ్గరకెళ్ళి రెడ్ విల్స్ సిగరెట్ పాకెట్ తీసుకుని వెలిగించి- ముందుకి నడిచాడు.

 

    దారికటూ ఇటూ వెళ్తున్న మనుషుల వేపు చూసుకుంటూ అవినాష్.

 

    పదినిముషాల సేపు ఆ దారంట నడుస్తూనే ఉన్నాడు.

 

    పది నిముషాల తర్వాత-

 

    అతను ఓ ప్రైవేట్ నర్సింగ్ హోం ముందుకొచ్చాడు. అతనికి లోనికి వెళ్ళడానికి భయంగా ఉంది.

 

    వళ్ళంతా చెమట్లు పట్టేసాయి- అప్పటి వరకూ హుషారుగా ఉన్న అతని మొహం అప్పటికప్పుడు ఎందుకలా తయారైందో అవినాష్ కి ఒక్కడికే తెల్సు.

 

    మెట్లెక్కి నేరుగా రిసెప్షనిస్టు దగ్గరకెళ్ళాడు. తనకి కావలసిన వివరాలు అడిగాడు.

 

    ఆ తర్వాత లిఫ్ట్ దగ్గర కొచ్చాడు.  

 

    పైకెళ్ళిన లిఫ్ట్ ఇంకా కిందకు రాలేదు.

 

    ఆలోచిస్తూ నిలబడ్డాడు.

 

    రెండు నిమిషాల్లో లిఫ్ట్ కిందకొచ్చింది.

 

    లిఫ్ట్ లో కెళ్ళాడు.

 

    అప్పుడు సమయం సరిగ్గా రాత్రి ఎనిమిది ముఫ్పై నిమిషాలైంది.


                                        2


    "The trouble sith you Avinash, is that you're over sexed.

    Non sense. It's just a perfectly ordinary craving for affection."

 

    కృష్ణ చైతన్యా నర్సింగ్ హోం!

 

    సమయం! రాత్రి ఎనిమిది ముఫ్పై ఐదు నిమిషాలు.

 

    అవినాష్ లిఫ్ట్ దిగి మూడో ఫ్లోర్లోకొచ్చాడు.

 

    అటూ ఇటూ గదులు, మధ్యలో విశాలమైన వరండా, ఆ వరండాలో ట్రేలతో, ఆదరాబాదరాగా నడుస్తున్న అందమైన నర్సులు.

 

    తనకెదురుగా వస్తున్న ఓ నర్సుని తనక్కావాల్సిన రూం నెంబరు గురించి అడిగాడు. ఆవిడ చెప్పింది.

 

    ఎదురుగా నడిచి, మలుపు తిఇగి ఎడమవేపునున్న రెండోగది దగ్గర ఆగాడు.

 

    ఆ గది తలుపు దగ్గరగా వేసి ఉంది. మునివేళ్ళతో నెమ్మదిగా తలుపు తోసాడు. చప్పుడు చెయ్యకుండా ఆ తలుపు తెరుచుకుంది.

 

    లోనికి చూశాడు.

 

    ఎడమ వేపున్న ఓ ఇనప మంచం వేపు చూశాడు.

 

    ఆ మంచమ్మీద తలగోడవేపు తిప్పుకొని ఓ వ్యక్తి పడుకుని ఉంది.

 

    ఆ మంచం వేపు నడిచాడు.

 

    అడుగుల చప్పుడికి ఆ వ్యక్తి కుడివేపు ఒత్తిగిలి, తల తిప్పి చూసి, గబుక్కున మంచమ్మీంచి లేచింది.

 

    లేస్తూ-

 

    "అవినాష్..." భోరున ఏడుస్తూ ఆ వ్యక్తి అవినాష్ ని గట్టిగా పట్టేసింది.

 

    "గౌతమీ... ప్లీజ్... డోంట్ క్రై..." నెమ్మదిగా అన్నాడు అవినాష్.

 

    ఆవిడ తలమీద చెయ్యివేసి నిమురుతూ "వాట్ హేపెండ్... గౌతమి... వాట్ హేపెండ్..." అని అడిగాడు.