కష్టంలో ఉన్న మహిళను చూసి నవ్వుకున్నాం

 


పదిహేను రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో అప్‌లోడ్‌ అయ్యింది. ‘Fastest cashier in the world’ పేరుతో అప్‌లోడ్ అయిన ఆ వీడియోలో ఓ మహిళా క్యాషియర్‌ చాలా నిదానంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంచుమించు స్లోమోషన్‌లాగా కనిపించిన ఈ వీడియోని చూసి జనం వెర్రెత్తిపోయారు. నవ్వీనవ్వీ తెగ లైకులు కొట్టారు. ఇంతకీ ఆ వీడియో వెనుక ఉన్న నిజం ఏమై ఉంటుంది అన్న ఆలోచన మాత్రం ఒక్కరికి కూడా రాలేదు. కుందన్‌ శ్రీవాస్తవ అనే సామాజిక కార్యకర్తకి మాత్రం ఆ ఆలోచన వచ్చింది.

 

వీడియోలోని మహిళ పూనేలోని మహారాష్ట్ర బ్యాంక్‌లో పనిచేస్తున్నట్లు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఒక్క వివరం ఆధారంగా శ్రీవాస్తవ ఆమె వివరాలను సేకరించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో బయటపడిన నిజాలతో ఆయన మనసు భారమైపోయింది. మన కళ్లకు కనిపించే దృశ్యానికీ, ఆ దృశ్యం వెనుక ఉన్న నిజానికీ మధ్య ఎంత వ్యత్యాసం ఉండవచ్చో అర్థమైంది.
ఇంతకీ ఆ వీడియోలో కనిపించిన మహిళ పేరు ‘ప్రేమలతా షిండే’. ఆమె అంత నిదానంగా పనిచేయడానికి కారణం లేకపోలేదు. ప్రేమలత ఒక హృద్రోగి. ఇప్పటికే ఆమె రెండుసార్లు వచ్చిన గుండెపోటుని తట్టుకొని నిలబడ్డారు. ఒకసారి పక్షవాతంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడారు. తీవ్ర అనారోగ్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రేమలత విధులు నిర్వహిస్తున్నారు.

 

నిజానికి ప్రేమలత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ అయిపోతున్నారు. అప్పటివరకూ ఇంటివద్దనే ఉండి విశ్రాంతి తీసుకునేందుకు ఆమెకు కావల్సినన్ని సెలవలు ఉన్నాయి. కానీ ఆమెకు అలా ఇష్టం లేదట. పనిచేస్తూ గౌరవంగా తన విధుల నుంచి విరమించుకోవాలన్నది ప్రేమలత కోరిక. అందుకనే ఓపిక చేసుకుని మరీ విధులను నిర్వహిస్తున్నారు.

 

అనారోగ్యం ప్రతి ఒక్కరినీ బాధిస్తుంది. దానిని తట్టుకొంటూనే విధులు నిర్వహించాలనుకోవడం గొప్ప కాకపోవచ్చు. కానీ ప్రేమలత కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఆమె భర్త చనిపోయారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు విదేశాలలో ఉంటున్నాడు. అయినా అధైర్యపడకుండా ఒంటరిగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు ప్రేమలత. ఆవిడ స్థైర్యాన్ని గమనించిన బ్యాంక్‌ ఉన్నతాధికారులు పనిలో కొనసాగేందుకు అనుమతినిచ్చారు. మరోవైపు ఆమె వలన పని కుంటుపడకుండా ఉండేందుకు మరో కౌంటరును ఏర్పాటుచేశారు. ప్రేమలత వీడియో వెనుక ఇంత కథ ఉంది. అదేమీ గమనించకుండా పోస్ట్‌ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. దాదాపు 50 లక్షల మంది ఈ వీడియోను చూశారు. లక్షన్నర మంది తమ మిత్రులతో షేర్‌ చేసుకున్నారు. ఇక వేలాదిగా వచ్చిన కామెంట్ల గురించి చెప్పనే అక్కర్లేదు. ప్రభుత్వోద్యోగుల అసమర్థత గురించీ, అందునా మహిళా ఉద్యోగుల నిదానం గురించి ‘అమూల్యమైన’ అభిప్రాయాలెన్నో వ్యక్తమయ్యాయి. సాటి మనుషుల పట్ల మన దృక్పధం ఎలా ఉందో చెప్పేందుకు ఈ ఉదంతం ఒక ఉదాహరణ మాత్రమే! ఇక ఆ మనిషి ఆడది అయితే నవ్వుకొనేందుకు అడ్డేముంది. ఇలాంటి చేతగాని పనులు మహిళలే చేస్తారన్నది జనాల నమ్మకం. అలాంటివారికి ప్రేమలతా కథ ఒక కనువిప్పుగా మారితే సంతోషం. కనీసం మున్ముందైనా తొందరపడి ఏదో చూసి మరేదో అభిప్రాయానికి రాకుండా ఉంటారు.

 

చివరగా ప్రేమలత కష్టాన్ని మరోసారి గుర్తు చేసుకుందాం. కుందన్‌ శ్రీవాస్తవ మాటల్లో చెప్పాలంటే- ‘మన జీవితాలనీ, ఈ దేశాన్నీ ముందుకు నడిపించేందుకు శ్రమిస్తున్న ఇలాంటి ఆడవారందరికీ అభివాదం చేయాల్సిందే!’
 

 

- నిర్జర.