"కంగ్రాచ్యులేషన్స్ ఇప్పుడు నా మొదటిప్రశ్నకి జవాబు చెప్పు" అంది సరోజ మెరిసే కళ్ళతో.
    
    గిరిజ తన పెళ్ళి ముహూర్తం తేదీ చెప్పింది.
    
    "అరె!" అంది సరోజ ఆశ్చర్యంగా.
    
    "అయితే నేనీ పెళ్ళికి రాలేను."
    
    "నామీద నీకంత ఆగ్రహం కలిగిందేమిటే? ఎందుకని?"
    
    "ఎందుకంటే... ఎందుకనంటే?" సరోజ తడబడింది. చివరకు చెప్పింది "నా పెళ్ళికూడా అదేరోజునే."
    
    "ఈజిట్!" అంటూ గిరిజ కళ్ళు పెద్దవి చేసింది. "ఇంత ఆలస్యంగా చెబుతావేం? అసలేం జరిగింది? ఎలా నిర్ణయం అయింది?"
    
    "ఏముంది? మా కిషోర్ బావ స్టేట్స్ నుంచి వచ్చాడు. మా అత్తయ్య మనోవ్యధ గురించి చెప్పానుగా, వాళ్ళంతా ఆలోచించుకుని ముహూర్తం నిర్ణయించి రాశారు."
    
    "మీ బావని కలుసుకున్నావా?"
    
    "ఇంకా లేదు బహుశా రెండు మూడురోజుల్లో యిక్కడికి వస్తాడేమో అనుకుంటున్నాను."
    
    "వెరీగుడ్" అంది గిరిజ పొడిగా.
    
    "ఏమిటే అలా వున్నావు? అసలెందుకే అలా వున్నావు?"
    
    "నిజంగా ఒట్టు ఏంలేదు బాగానే వున్నాను" అంది గిరిజ నిర్లిప్తంగా నవ్వి.
    
    "ఆశ్చర్యంగా వుందికదూ?" అంది సరోజ. "యిద్దరం బావలను చేసుకుంటున్నాం అందునా ఒకేరోజున చేసుకుంటున్నాం కాని ఒకళ్ళ పెళ్ళికి ఒకళ్ళు రాలేం."
    
    "పెళ్ళిళ్ళు అయాక కలుసుకుందాంలే."
    
    తర్వాత సరోజ పెళ్ళయ్యాక చదువు మానేసి తానుకూడా ఫారిన్ వెళ్ళిపోతానని, అక్కడ అయిదారేళ్ళు కులాసాగా గడిచాక అప్పుడు స్వదేశం తిరిగివచ్చి అతన్తో ప్రాక్టీస్ పెట్టిస్తానని, యిట్లా తన కలలని గురించి చెబుతూ చాలాసేపు కూర్చుండిపోయింది.
    
    గిరిజకు ఆశ్చర్యంగావుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎనలేని ఆత్మీయత. ఇద్దరి జీవితాలూ ఒకేరకంగా సాగబోతున్నాయి. కాని స్పందించటంలో ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. తనకి అర్ధంకాకుండా వున్నది ఆమెకానందం కలిగిస్తోంది. తనకి వికారంగా వున్నది ఆమెకి ప్రియాతిప్రియంగా వున్నది. తాను దూరంగా వుండాలనుకుంటున్నది ఆమె కోరుకుంటున్నది. కాని ఆమె కబుర్లు చెవికింపుగా వున్నాయి. అందుకని వింటూ కూర్చుంది.
    
                                                           * * *
    
    రోజులు గడిచిపోతున్నాయి. పుండరీకాక్షయ్యగారింట్లో పెళ్ళి ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి. గిరిజ యించుమించు కాలేజీకి వెళ్ళటం మానేసింది. ఇంకో రెండుమూడు నెలలలో పరీక్షలున్నాయి. బాగా రాయాలంటే బాగా చదవగలగాలి. కాని చదవటానికి ఆమె మనసు ఎదురు తిరుగుతోంది. కాలేజీకి వెడితే తోటి విద్యార్ధినుల పరాచికాలు, లేకపోతే బాయ్ స్టూడెంట్ల కిచకిచలు. ఈ బాధ పడలేక వెళ్ళకపోవటం నయమనుకుంది.
    
    ఒకరోజు సరోజ కబురుచేసింది వచ్చివెళ్ళమని. వంటింట్లో పనిలోవున్న తల్లికి చెప్పి సాయంత్రం అయిదున్నర గంటలవేళ రిక్షా ఎక్కి సరోజ యింటికి వెళ్ళింది.
    
    గేటు తీసుకుని లోపలకు వెడుతూండగానే సరోజ ఎదురుగా వచ్చింది. ఆమె ముఖం ఏదో కాంతితో వెలిగిపోతోంది.
    
    "మా బావ వచ్చాడు వూరినుంచి" అంది.
    
    "అదీ సంగతి" అనుకుంది గిరిజ.
    
    "అతన్ని చూసి నువ్వు చాలారోజులయింది కదూ! రా చూపిస్తాను" అని చెయ్యిపట్టుకుని లోపలకు తీసుకువెళ్ళింది.
    
    కృష్ణకిశోర్ సరోజగదిలో చెస్ టేబుల్ ముందు కూర్చునివున్నాడు. పావులు వున్న తీరు చూస్తే ఆటమధ్యలో వున్నట్లు తెలుస్తోంది. అయితే సరోజ కాలేజీ ఎగ్గొట్టిందన్నమాట. అతను పొడుగ్గా, బలంగా, ఎర్రగా వున్నాడు. జుట్టు చెంపలదగ్గర పొడుగ్గా పెంచాడు. ఒత్తయిన క్రాఫింగు, తెల్లబట్టలు.
    
    "మా బావ" అంది సరోజ గర్వంగా.
    
    గిరిజ కంగారుపడినట్లయి, చేతులు జోడించి నమస్కారం చేసింది చేతులు కొద్దిగా వణుకుతున్నాయి.
    
    కృష్ణకిషోర్ ప్రతినమస్కారం చేశాడు.
    
    గిరిజ అనుకోకుండా అతని ముఖంలోకి చూసింది. అతని కళ్ళల్లో, అతని చూపుల్లో దృఢత్వం, వ్యక్తిత్వం, స్ఫుటమైన భావాలున్న సూటిదనం కనిపించాయి.
    
    "అలా కూర్చోవే" అంది సరోజ.
    
    గిరిజ ఎదురుగావున్న సోఫాలో కూర్చుని ఇబ్బందిలో పడినట్లుగా అనుకుంటోంది.
    
    "బావా! గిరిజ నాకు బెస్ట్ ఫ్రెండ్ తెలుసా? నీకో విషయం చెప్పనా? ఇద్దరం అనుకోకుండా ఒకేబాటన పయనిస్తున్నాం మా ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేరోజు, ఒకే ముహూర్తాన జరగాలని విధి నిర్ణయించింది."
    
    ఈ మాటలు చెబుతూన్నప్పుడు ఆమె ముఖంమీది ఎరుపు, తొణికిసలాడే సిగ్గు గిరిజ గమనించకపోలేదు.
    
    కాని ఆమెకుమాత్రం సంభాషణ ఈ విధంగా మొదలవటం ఏదోలా అనిపించింది. 'ఛీ' అనుకుంది.
    
    "అంతేకాదు ఇదికూడా తన బావను చేసుకుంటోంది" చప్పున క్రిష్ణకిషోర్ ముఖంలో ఓ ఉలికిపాటు, అతను చకితుడవటం గిరిజ చురుకైన కళ్ళు పసికట్టాయి.
    
    "భలే గమ్మత్తుగా లేదూ బావా?" అని నవ్వేసింది సరోజ.
    
    "గిరిజా! మా బావ నాకు అక్కడనుంచి మంచి ఫారిన్ శారీ తీసుకొచ్చాడు. చూపిస్తానుండు" అని సరోజ లోపలకు వెళ్ళింది.
    
    గదిలో గిరిజా, క్రిష్ణకిషోర్ యిద్దరే వున్నారు. ఆమెకు భయమేసింది.