ప్రెగ్నెంటా... అయితే అది తినకండి!

గర్భం దాల్చాక కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. తొమ్మిది నెలలూ బిడ్డను మోసి కనే వరకూ ఆ బుజ్జాయి గురించిన ఆలోచనలే. అయితే ఆ తొమ్మిది నెలలూ టెన్షన్ కూడా అలానే ఉంటుంది. ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఎంత తినాలి,  ఎప్పుడు తినాలి అన్నీ కన్ ఫ్యూజన్లే. పెద్దవాళ్లేమో నోటికి రుచిగా నాలుగు రకాలూ తినమంటారు. డాక్టర్లేమో ఏది పడితే అది తినొద్దంటారు. దాంతో తల్లికి చెప్పలేనంత చింత. అయితే నిజానికి మరీ నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదు. హాయిగా చక్కగా తినొచ్చు. ఒకే ఒక్కటి తప్ప... అదే చక్కెర.
 
    స్వీట్లు ఇష్టపడేవాళ్ల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా గర్భం దాల్చాక కొందరికి అవీ ఇవీ తినాలన్న ఆశ పెరిగిపోతుంది. అయితే ఆ అవీ ఇవీలో చక్కెర ఉండకూడదని తేల్చేశారు వైద్యులు. ఇటీవలే జరిగిన ఓ పరిశోధనలో... కడుపుతో ఉన్నప్పుడు స్వీట్స్ ఎక్కువగా తిన్నవారి పిల్లలకు కొన్ని రకాల సమస్యలు వచ్చినట్టు గుర్తించారు. గర్భవతులు చక్కెర ఎక్కువగా తింటే పిల్లలకు అలర్జీలు వస్తుంటాయట. ఆస్తమా, ఒబెసిటీ వంటి సమస్యలూ తలెత్తుతాయట. మిగతా పిల్లల్లో కంటే ఈ పిల్లలకు రకరకాల అనారోగ్యం సమస్యలు ముప్ఫై శాతం అధికంగా వస్తాయని నిర్ధారించేశారు. 

అయితే ఒకటి. సహజసిద్ధమైన ఆహారం ద్వారా ఒంట్లోకి చేరే చక్కెర వల్ల సమస్య ఉండదట. అంటే పండ్ల ద్వారా, కూరగాయల ద్వారా, తేనె వంటి సహజమైన ఆహారాల ద్వారా ఏ ప్రమాదమూ ఉండదన్నమాట. చక్కెర, బెల్లం వంటివి వేసి మనం తయారు చేసుకునే ఆహార పదార్థాలతోనే సమస్య అంతా. కాబట్టి వీలైనంత వరకూ గర్భంతో ఉన్నప్పుడు స్వీట్స్ కి దూరంగా ఉండటమే మంచిదట. తెలిసింది కదా! తల్లిగా పొందే తీయని ఆనందం కోసం తీపికి కాస్త దూరంగా ఉండండి మరి!

-Sameera