నవరాత్రి సమయంలో గర్భవతులు ఏం చేయాలి..ఏం చేయకూడదు!

నవరాత్రి భక్తితో జరుపుకునే తొమ్మిది రోజుల పండుగ. సాధారణంగా మహిళలు నవరాత్రులను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ప్రతి రోజూ అమ్మవారి ఆరాధన, నైవేద్యం, ఉపవాసాలతో గడుస్తూ ఉంటుంది. అయితే సాధారణ మహిళలు అయితే ఇలా ఉపవాసాలు ఉంటూ అమ్మవారిని ఆరాధిస్తారు. కానీ గర్భవతులు మాత్రం ఇంలాటి విషయాలలో చాలా శ్రద్ద తీసుకోవాలి. కడుపులో ఒక బిడ్డ పెరుగుతున్న సమయంలో ఉపవాసాల విషయంలో నిర్లక్ష్యం చేయడం, వైద్యుల సలహా లేకుండా ఉపవాసాలు ఉండటం చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది తల్లికి, కడుపులో బిడ్డకు కూడా చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. నవరాత్రుల సందర్భంలో గర్భవతులు చేయాల్సినది ఏంటి? చేయకూడనిది ఏంటి? తెలుసుకుంటే..
ఉపవాసానికి ఉండాలంటే..
గర్భిణీ స్త్రీలు నవరాత్రి సమయంలో ఉపవాసం ఉండాలని అనుకుంటే మొదట వైద్యుడిని సంప్రదించాలి. గర్భవతులు రోజంతా ఉపవాసం ఉండటం మంచిది కాదు. ఒకవేళ ఉండాలని అనుకుంటే.. అది కూడా ఎలాంటి సమస్యలు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉండేవారు అయితే రోజంతా ఉపవాసం ఉండే బదులు పండ్లు, పాలు వంటి తేలికపాటి ఆహారాలు తినండి .
పోషకాలు..
ఉపవాసం ఉన్నప్పుడు ఆహారంలో తగినంత పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్, కాల్షియం , ఐరన్, ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. వీటిని ఎట్టి పరిస్థితులలో తగ్గించడం లేదా అసలు తీసుకోకుండా ఉండటం లాంటివి చేయకూడదు. పండ్లు, గింజలు, పాలు, పెరుగు, జున్ను తినాలి.
శారీరక శ్రమ..
నవరాత్రి సమయంలో సాధారణంగా ఇంటి పనులు, వంట పనులు, నైవేద్యాల తయారీ, దేవుడి అలంకరణ, పూజ వంటివి ఉంటాయి. ఇంకా పెద్ద పట్టణాలలో అయితే ప్రత్యేక ఈవెంట్లు కూడా ఏర్పాటు చేస్తుంటారు. అయితే గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో తేలికపాటి పనులు మాత్రమే చేయాలి. ఇక రెండవ, మూడవ త్రైమాసికంలో వీటిని నివారించాలి .
పూజలలో జాగ్రత్తలు..
సాధారణంగా పూజల సమయంలో ఎక్కువ సేపు కూర్చోవడం లేదా ఎక్కువ సేపు నిలబడటం వంటివి ఉంటాయి. కానీ వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే పూజల పేరుతో ఎక్కువగా అలసిపోకూడదు. అలాగే దేవతా ఊరేగింపులు, సమూహ పూజలు వంటివి చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
విశ్రాంతి, నిద్ర..
గర్భధారణ సమయంలో నిద్ర చాలా ముఖ్యం . నవరాత్రి ఉత్సవాల్లో నిద్ర విషయంలో రాజీ పడకూడదు. రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. అలాగే పగటిపూట కొంత విశ్రాంతి తీసుకోవాలి. అలసట అనిపిస్తే కాస్త విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి.
నిర్లక్ష్యం వద్దు..
నవరాత్రుల సమయంలో ఏదైనా ఇబ్బందికరంగా అనిపించినా సమస్యగా ఉన్నట్టు అనిపించినా అవన్నీ పండుగ హడావిడిలో వచ్చాయి, తర్వాత తగ్గిపోతాయి అనే నిర్లక్ష్యంతో ఉండకూడదు. వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.
*రూపశ్రీ.



.webp)