"మీ బాధ నాకర్ధమయిందమ్మా... కాని ఇలా కోర్టులో కూతురైనా కొట్టకూడదమ్మా..." న్యాయమూర్తి భువనేశ్వరీదేవిని అర్ధం చేసుకుంటూ అన్నారు.

 

    తీర్పు తమకు వ్యతిరేకంగా రాబోతోందని తెలిసినప్పుడు, చాలా మంది కోర్టులో అలా హిస్టీరిక్ గా బిహేవ్ చేయటం ఆయన సర్వీసులో చాలాసార్లు చూసి వుండటంతో తప్పుగా అనుకోలేకపోయారు న్యాయమూర్తి.

 

    "నాదొక విన్నపం జడ్జీగారు-ఈ దగాపడిన కన్నతల్లి కోరిక తీరుస్తారని ఆశపడుతున్నాను" ఏడుస్తూ అంది భువనేశ్వరీదేవి.

 

    "చెప్పమ్మా... న్యాయబద్ధమైన కోరిక ఏదయినా తీర్చేందుకు ప్రయత్నిస్తాను. చెప్పమ్మా..." న్యాయమూర్తి జాలిపడుతూ అభయమిచ్చారు.

 

    "మాకు చెప్పి, మా అమ్మాయి కాశీబాబుని పెళ్ళి చేసుకోలేదు. మా అమ్మాయికి 20 నిండేదాకా వాళ్ళ తాతగారి దగ్గరే పెరగాలని, గతంలో ఒక కోర్టు తీర్పు యిచ్చిన కారణాన అక్కడే పెరిగి, పెళ్ళి చేసుకొని మా దగ్గరకొచ్చి, తనకు పెళ్ళి కాలేదని- ఆంజనేయులనే వ్యక్తిని ఇష్టపడుతున్నానని చెబితే కన్నతల్లిగా కాదనలేకపోయాను.

 

    ఇదివరకే పెళ్ళయిందని తెలిసుంటే విషయం ఇక్కడిదాకా రానిచ్చే దాన్ని కాదు. నన్ను క్షమించండి.  

 

    ఈ కాలం పిల్లలు గంటలో పెళ్లిచేసుకోవటం మరో గంటలో అభిప్రాయ భేదాలొచ్చాయని విడిపోవటం ఫ్యాషనయిపోయింది.

 

    ఈ లోకంలో ఎంతమంది భార్యలు తమకి తమ భర్తలు నచ్చక పోయినా గుట్టుగా సంసారం చేసుకోవటంలేదు...? అంతా మా ఖర్మ... మా ప్రారబ్ధం...

 

    పిల్లలు తల్లిదండ్రుల్ని కాదనుకున్నా, తల్లిదండ్రులు పిల్లల్ని కాదనుకోలేరు.

 

    నా కూతురు తప్పుచేసినా, మమ్మల్ని కోర్టుకి లాగినా, తమ కోర్టుకి ఎక్కినా, కన్న మమకారం పోదుగా జడ్జీగారు...

 

    ఇంతచేసినా నా బిడ్డ మీద ప్రేమ నాలో చచ్చిపోలేదు.

 

    నాకు మీరు దయతో రెండు హామీలివ్వాలి... ఇస్తారా జడ్జీగారు" చేతులెత్తి నమస్కరిస్తూ అర్ధించింది భువనేశ్వరీదేవి.

 

    "చెప్పమ్మ..."

 

    "మానం పోయాక మనం ఆలోచించవలసింది ప్రాణం గురించే కదా జడ్జీగారు..."

 

    "అవునమ్మా... అయినా ఇప్పుడెవరి ప్రాణం గురించి ఆలోచించాలి?"

 

    "కడుపు చించుకుంటే కాళ్ళ పడినా తప్పటంలేదు. ఇప్పుడు నా బిడ్డ ప్రాణం నాకు ముఖ్యం. ఈ చిన్న హామీని మీ నుంచి పొందటంలొ తప్పులేదుగా... న్యాయవిరుద్ధం కాదుగా జడ్జీగారూ" అక్కడున్న ఎవరికీ భువనేశ్వరీదేవి ఏమి కావాలనుకుంటుందో అర్ధంకాక ఊపిరి కూడా పీల్చటం మర్చిపోయి చూస్తున్నారు.

 

    శ్రీనివాసరావుకి కళ్ళముందు కోటీ అరవై లక్షల ఆస్తీ, ఓడిపోయిన భువనేశ్వరీదేవి రూపం మాత్రమే కనిపిస్తున్నాయి.

 

    "తప్పులేదమ్మా... వివరంగా చెప్పు... ఆ హామీ ఇస్తాను" అన్నారు న్యాయమూర్తి ఆసక్తిగా ఆమెనే చూస్తూ.

 

    "నా కూతురు తప్పు చేసింది జడ్జీగారూ. ఆంజనేయులితో తిరిగిన ఫలితంగా ప్రెగ్నెన్సీ వచ్చింది. అది తెలిసినా, ఎలాగూ ఆంజనేయులికే ఇచ్చి చేస్తున్నాం గదా అని ఊరుకున్నాం. ఈలోపు పెళ్ళయిందనే నిజం తెలీటంతో నాలో భయం చోటు చేసుకుంది. ఏ భర్త మాత్రం తన భార్య మరొకడితో బిడ్డని కంటే ఊరుకుంటాడు? మానాభిమానం, పౌరుషం ఉన్న ఏ భర్తా ఊరుకోడు. మా అల్లుడు కాశీబాబయినా అంతేకదా...? తప్పే... నా కూతురు చేసింది తప్పే అయినా, కన్నతల్లినైన నేను చంపుకోలేనుగా. ఈ తప్పు ఇప్పుడు నేను చెప్పకపోయినా, రేపయినా మా అల్లుడికి తెలిసి పోతుంది. అప్పుడు చంపకుండా ఊరుకోడు.

 

    కనుక ఈ విషయంలో నా బిడ్డ ప్రాణానికి రక్షణ కోర్ట్ ద్వారానే లభించాలి. పుట్టబోయే బిడ్డని నేనే పెంచుకుంటాను. నా బిడ్డ చేసిన తప్పుకి ఆ పసికూన శిక్షింపబడగూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏ జన్మలో ఏ పాపం చేశామో... ఇలా పరువు ప్రతిష్టల్ని పోగొట్టుకోవలసి వచ్చింది. పుట్టబోయే బిడ్డకి అన్యాయం చేసి మరో పాపం చేయదలుచుకోలేదు జడ్జీగారు.

 

    నా బిడ్డ ప్రాణం, నా బిడ్డకు పుట్టబోయే బిడ్డ ప్రాణం. అంతే. ఈ రెండు వరాలే నాకు కావల్సింది. దయతో అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను..." అంది భువనేశ్వరీదేవి ముగిస్తూ. ఆమె ముగిస్తుండగానే కాశీబాంబు చటుక్కున లేచి కోర్ట్ హాలు మధ్యగా వచ్చాడు.

 

    "వామ్మో... ఇదంతా నాకు తెలీదు. నాకీ పెళ్ళాం వద్దు దేవుడోయ్ నాకసలు పెళ్ళే కాలేదు. ఆస్తి కోసం అయినట్లు మా నాన్న అబద్ధం ఆడమంటే ఆడాను. నాకేం తెలీదు... నిజం నన్ను నమ్మండి... రేపు అందరూ నీ పెళ్ళాం కడుపుతో ఉందటగా...! నీ మూలంగా కాదటగా అని కుళ్ళ బొడుస్తారు దేవుడోయ్..." ఏడుస్తూ అనేశాడు కాశీబాంబు అసంకల్పితంగానే.

 

    ముందు కాశీబాబన్నదేమిటో కోర్టుహాల్లో ఉన్న ఎవరికీ అర్ధం కాలేదు. అర్ధం కాగానే అదిరిపడ్డారు

 

    శ్రీనివాసరావయితే పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు.

 

    క్షణంలో కేసు మొత్తం తారుమారయిపోయింది. జరిగింది నిజమో అబద్ధమో తెలీక బిత్తరపోయారంతా.

 

    దాన్నెలా తిప్పికొట్టాలో తెలీక శ్రీనివాసరావు చకచకా ఆలోచిస్తుండగానే గేలరీలో వున్న జడ్జిగారి భార్య లేచింది.

 

    "ప్రశాంతంగా ఉండవలసిన కోర్టులో మీ గోలేమిటి అసహ్యంగా..." జడ్జిగారి భార్య భువనేశ్వరీదేవిని కోపగించుకుంది.

 

    ఆ మరుక్షణం భువనేశ్వరీదేవి వేగంగా జడ్జీగారి భార్యను చేరుకొని, ఆమె రెండు చెంపల్ని వాచిపోయేలా కొట్టింది.

 

    అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న న్యాయమూర్తి అసంకల్పితంగా సీట్లోంచి లేచి-

 

    'ఏయ్... ఏంటి నువ్వు చేసింది? ఆ ..." నిప్పులు కురిపిస్తూ మందలించారు న్యాయమూర్తి.

 

    "మీకెందుకు కోపం వచ్చింది జడ్జీగారూ?" భువనేశ్వరీదేవి ఆశ్చర్యపోతూ అడిగింది.

 

    "ఎందుకేమిటి? భార్యని కొడితే- అదీ భర్త ముందే- కోపం రాదా?" ఆగ్రహంగా అడిగారు న్యాయమూర్తి.