అసలు ముఖ్యమంత్రిని పడగొట్టడానికీ, ఓ మూల యూనివర్శిటీలో జరిగే క్విజ్ కాంపిటీషన్ కీ కనెక్షనేమిటో వాళ్ళ ఊహకందడంలేదు.
    
    దానికి పద్మనాభం చెప్పే థియరీ ఇది "ముఖ్యమంత్రి అవినీతి గురించి, లేదా తప్పులగురించి ఏకరువుపెడుతూనే, లేక పత్రికల్నీ ప్రతిపక్షాన్నీ రెచ్చగొడుతూనే అతడ్ని నిర్వీర్యుడ్ని చేయటం ప్రత్యక్ష పోరాటం. అలా అయితే చాలా తెలివైన వాసుదేవరావు తెలివిమీరిపోతాడు. ప్రతి బలవంతుడికీ బలహీనమయిన ఆయువుపట్లు కొన్ని వుంటాయి. వాటిని పరోక్షంగా నొక్కడం సిసలయిన రాజకీయం. రాజకీయాల్లో చేవ గల వాసుదేవరావుకి సెంటిమెంటల్ ఏంకర్ ప్రబంధ కూతురు ప్రబంధ కోసం వాసుదేవరావు ఏమైనా చేస్తాడు.
    
    "అయితే?"
    
    "వాసుదేవరావు మానసికంగా బలహీనుడయితే తప్ప మనం బలాన్ని పుంజుకోలేం అతడు బలహీనుడు కావాలంటే ప్రబంధ ద్వారానే అది సాధ్యం."
    
    "కాని ఎలా?"
    
    "సిల్వర్ స్పాట్ కంపెనీ వాళ్ళు మరో నెల తర్వాత పోటీని నిర్బహిస్తారు" తన మేధని వ్యక్తంచేశాడు హోమ్ మినిస్టర్ పద్మనాభం "ఈలోగా యూనివర్శిటీలో మనం మన కుర్రాళ్ళ ద్వారా చిన్న రాజకీయాన్ని నెరుపుతాం. నిన్న జైర్గిన పోటీలో క్విజ్ మాస్టర్ గావున్న ప్రొఫెసర్ రాధాకృష్ణ ముఖ్యమంత్రి ప్రాపకంకోసం ప్రయత్నిస్తున్నవాడు. కాబట్టే చిన్న సైజు తెలివిని ప్రదర్శించాడు. అది స్టూడెంట్స్ ని రెచ్చగొట్టడానికి కారణం కావాలి అంటే మరోసారి ఈ క్విజ్ పోటీ నిర్వహించాలి. అది నిర్వహించేది ఈసారి ప్రొఫెసర్ రాధాకృష్ణ కాదు. జాతీయస్థాయిలో ఇండియా క్విజ్ నిర్వహించడంలో సిద్దహస్తుడయిన సత్యేంద్ర బసు. సిల్వర్ స్పాట్ కంపెనీ పోటీలను వాయిదా వేయడానికి కారణమైన నేను సత్యేంద్రబసును రప్పిస్తాను. ఈసారి న్యాయబద్దంగా పోటీ నిర్వహించటానికి అవకాశం కల్పిస్తాను."
    
    "కాని వైస్ ఛాన్సలర్ మరొకసారి పోటీ నిర్వహించడానికి సిద్దం కావద్దూ?"
    
    "సిద్దపడి తీరుతాడు. ఎందుకంటే రిటైర్ మెంట్ కి సిద్దంగా వున్న వీసీ తనపైన అభియోగాల్ని మనం తవ్వటం ప్రారంభిస్తే తట్టుకోలేడు కాబట్టి."
    
    చాలాసేపటిదాకా నిశ్శబ్దం ఆవరించిందక్కడ.
    
    "అసలు ప్రబంధ, ఆదిత్య ఈ పోటీలో పార్టిసిపేట్ చేస్తే అది వాసుదేవ రావుకి సమస్యగా ఎలా మారుతుంది?"
    
    తార్కికంగా నవవాడు పద్మనాభం. "ఏ స్థితిలోనూ ఆదిత్య, ప్రబంధలు కలిసే అవకాశం లేదు. కలిసి జంటగా పార్టిసిపేట్ చేసే పరిస్థితీ రాదు. అయినా అహంకారి మాత్రమేగాక తను అనుకున్నదే జరగాలని ఆలోచించే ప్రబంధ ఆదిత్యని తన పకక్కు లాక్కోవాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం చాలా అనర్దాలకి కారణమవుతుంది. అదే వాసుదేవరావుకి అసాధారణమైన తలనొప్పినీ, మానసిక శ్లేషనీ కలిగించేది."
    
    అర్ధంగాక చూస్తున్న తన మిత్రబృందానికి అదే స్థాయిలో ఓ పజిల్ ని వివరిస్తున్నట్టుగా చెప్పాడు పద్మనాభం "ప్రపంచంలో అతి భయంకరమయినది అణ్వాయుధం కాదు మిత్రులారా! ప్రేమ అనే సమ్మోహనాస్త్రం. దానికోసం రాజ్యాలూ కూలిపోయాయి, రాజవంశాలూ నశించిపోయాయి. ఊహించని రక్తపాతమూ జరిగింది. ఇది నా థియరీ కాదు. చరిత్ర చెప్పిన సత్యం. అదిగో ఆదిత్య, ప్రబంధల మధ్య ఇప్పుడు మొదలయ్యే యుద్ధం ఇంచుమించి అదే స్థాయికి చెందినదవుతుంది."
    
    అంచెలంచెలుగా నిర్వహించే నెట్ వర్క్ గురించి అంతకుమించి వివరించలేదు పద్మనాభం. కాని ఇదో గమ్మత్తయిన పథకంలా మాత్రం బోధపడింది అందరికీ.
    
    "నాదో చిన్న అనుమానం." ఓ ఎమ్మెల్యే అన్నాడు.
    
    "అడుగు."
    
    "ఓ ముఖ్యమంత్రి కూతురు అడిగితే ఆ ఆదిత్య అనేవాడు దేనికీ కాదనే అవకాశం లేదుగా?"
    
    "నిజమే! కాని ఓ ముద్దుసీనులో ఇప్పటికే ఆదిత్యమూలంగా అవమానితురాలైన ప్రబంధ ఇప్పుడు ఆదిత్య అనే ఆ వ్యక్తి ప్రణయ అనే మరో అమ్మాయికి చేరువకావడాన్ని సహించలేకపోతోంది. ఇక ముందు ఇంకా సహించదు. సహించకుండా నేను చేస్తాను."
    
    "ఎలా?"
    
    "మన్మథబాణంతో..." నవ్వాడు అదోలా "అయితే ఈ కథలోకి మన్మథుడు రాడు. రతీదేవి అడుగుపెడుతుంది."
    
    "ఎవరామె?"
    
    "సౌదామిని."
    
    ఉలిక్కిపడ్డారంతా.
    
    "ఆశ్చర్యపోకండి ప్రియ మిత్రులారా! ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అతి చేరువైన సౌదామిని ఇప్పుడిప్పుడే నా ప్రాపకంకోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ కథలో అవసరమైన మలుపుల్ని తిప్పబోతున్నది సౌదామినే!"
    
    అందంలో 'క్లియోపాత్రా' ఆలోచనల్లో 'రోషనారా' అయిన సౌదామిని గురించి అంతా ఆలోచిస్తున్న సమయంలో...
    
    ముఖ్యమంత్రి బంగళాలోని బెడ్ రూంలో సౌదామిని వాసుదేవరావుకి సపర్యలు చేస్తోంది ఎప్పటిలాగే.
    
    తన కనుసన్నలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించగల సౌదామిని వాసుదేవరావుకి అంత చేరువైంది ఇప్పుడు కాదు- ఏడేళ్ళ కిందటే. కాని మరో పదేళ్ళపాటు తన స్థానాన్ని పదిలపరచుకోవాలని ఈ మధ్య గట్టిగా ప్రయత్నిస్తూ యువకుడయిన పద్మనాభం పైన అస్త్రాన్ని సంధిస్తోంది.
    
    "ఇక నిద్రపోరూ?" అడిగింది సౌదామిని ముఖ్యమంత్రిని చూస్తూ.
    
    జవాబు చెప్పలేదు వాసుదేవరావు. "ఒకప్పుడు నిన్ను చూస్తూ నిద్రపోలేక పోయేవాడిని."
    
    "మరిప్పుడో?" గోముగా అంది అతడి తల నిమురుతూ.