వ్యాన్ రెస్టారెంటు ముందు ఆగడంతోనే లోన్నించి పరుగు పరుగున ఒక వ్యక్తి వచ్చి నమస్కరించి, తనను తాను మేనేజర్ గా పరిచయం చేసుకుని, నిశాంతను గౌరవంగా లోనికి తీసికెళ్ళాడు.

 

    డైమండ్ ఆకారంలో వున్న గ్లాస్ హౌస్ అది. గ్లాస్ ఫర్నిచర్. లైట్ బ్లూ కలర్ యూనిఫాంలో తిరుగుతున్న సిబ్బంది.

 

    సెంట్రల్ హీటింగ్ సిస్టమ్ ఆ రెస్టారెంటు స్పెషాలిటీ.

 

    లోనికి అడుగుపెట్టిన నిశాంతకు మొట్టమొదట కనిపించిన దృశ్యం.

 

    కౌంటర్ వెనక భాగంలో లైఫ్ సైజ్ తన ఫోటో!

 

    ఆ ఫోటోని చూడగానే ఒక్కక్షణం నిశాంత కనుకొలకుల్లో తడి కదలాడింది.

 

    ఆ తడి మాటున సన్నగా కదలాడిన రూపం దేశ్ ముఖ్!

 

    అణువణువునా, మానవత్వపు వెలుగుతో ప్రకాశించే దేశ్ ముఖ్ లో అంతులేని పగ, ప్రతీకారం!!

 

    "దేశ్ ముఖ్ సాబ్! మీ కోసం నేనేమైనా చేస్తాను. నా ప్రాణం పోయినా సరే" దృఢంగా నిశ్చయించుకుని కదిలింది నిశాంత.

 

    ఒక వ్యక్తిని నువ్వు సేవకుడిలా మార్చాలనుకుంటే ముందు నువ్వు ఆ వ్యక్తిని స్నేహితుడిలా చూడు. అతని సంతోషాన్ని, విషాదాన్నీ పంచుకో! అతని శక్తిని, బలహీనతల్ని గమనించు. అతని శక్తి నీకు కావాలనుకుంటే అతని బలహీనతల్ని అంచనా వెయ్యి.

 

    ఆయనకి తెలిసిన సత్యం ఇది. డబ్బొక్కటే తెలివితేటల్ని కొనే ఆయుధం కాదు... సెంటిమెంట్ ని కూడా వుపయోగించాలి. నిన్ను నేను ఇంతగా నమ్ముతున్నాను అన్న విషయం స్పష్టంగా తెల్సిననాడే అవతలి వ్యక్తి నీకు పూర్తిగా వుపయోగపడతాడు. అదే ఆయన సిద్ధాంతం.

 

    హాల్లో కూర్చుంది నిశాంత.

 

    రెస్టారెంట్ స్టాఫ్ ఒక్కొక్కరూ పరిచయం చేసుకుంటున్నారు.

 

    సిటీలో మన హోటల్ కి మంచి పేరుంది. ఎలాంటి వి.ఐ.పీ. అయినా మన రెస్టారెంట్ కి ఒక్కసారైనా వచ్చి వెళ్తాడు. అక్కడకు ఎలాంటి ప్రముఖులొచ్చారో చెప్తున్నాడు మేనేజర్ గర్వంగా.

 

    "చూడండి ఫ్రెండ్స్... నాణ్యత విషయంలో మన హోటల్ కి మంచి పేరుంది. వెరీగుడ్! యజమాని ఎవరో, ఏమిటో తెలీకుండా యీ హోటల్ కి మంచి పేరు రావడం కోసం కృషి చేసింది మీరు.

 

    అందుకే ఇకనుంచి ఈ హోటల్ కి వచ్చే ప్రాఫిట్ లో పదిశాతం మీకే ఇస్తాను" నిశాంత ప్రకటన చెయ్యగానే స్టాఫ్ అంతా చప్పట్లు కొట్టారు.

 

    "అలాగే వింటర్ లో ఇక్కడ పనిచేయడం కష్టం కనుక మీకు వింటర్ ఎలవెన్స్ ను ప్రకటిస్తున్నాను."

 

    ఏ కంపెనీ రూల్స్ లో లేని వింటర్ ఎలవెన్స్ తమ యజమాని ప్రకటించడం చాలా ఆశ్చర్యంగా వుంది స్టాఫ్ కి.

 

    తనిక్కడ నెరవేర్చబోయే బృహత్తర కార్యానికి స్టాఫ్ మద్దతు చాలా అవసరం. అందుకే స్టాఫ్ ని తనవైపు తిప్పుకోడానికి తిరుగులేని ఎత్తుగడ వేసింది నిశాంత.

 

    అద్దాల్లోంచి కనబడుతున్న బయట రోడ్డువైపు చూస్తోంది నిశాంత.

 

    సరిగ్గా అదే సమయంలో ఒక బ్లూ కలర్ మారుతీకారు ఆ రోడ్డు వైపు వెళ్లడం గమనించిన నిశాంత-

 

    గబగబా హాల్లోంచి బయటికొచ్చింది.

 

    "ఎవరిదా మారుతీకారు?" ప్రశ్నించింది నిశాంత.

 

    "అనంతమూర్తిగారిది మేడమ్" ప్రక్కన వున్న మేనేజర్ చెప్పాడు.

 

    "అనంతమూర్తి మీకు తెలుసా?"

 

    "ఆయన మన వి.ఐ.పి. కస్టమర్స్ లో ఒకరు మేడమ్! నెలకోసారి ఎవరో ఒక గెస్ట్ ని ఆయనిక్కడకు తీసికొస్తారు" చెప్పాడతను.

 

    అంటే ఆ కారులో వున్నది అనంతమూర్తా? సిద్ధార్ధా?

 

    ఆ కారులో వున్నది సిద్ధార్దే... నిశాంత సిక్త్ సెన్స్ బలంగా చెప్తోంది.

 

    బ్లూ కలర్ కారు, నీలపు బిందువులా కనిపించేవరకు అలా చూస్తూ వుండిపోయింది నిశాంత.

 

    నిశాంత ఊహించింది కరెక్టే.

 

    ఆ కారులో వున్నది సిద్ధార్ధ ఒక్కడే. భట్టా ఫాల్స్ నుంచి తనొస్తున్న సమయంలో తనకు కన్పించి మాయమైపోయిన ఆ అమ్మాయి గురించి రెండుగంటలసేపు ఆలోచించి, ఆ అమ్మాయి మరోసారి సిటీలో ఎక్కడైనా కన్పిస్తుందేమోనని-

 

    యంగ్ ప్యాలెస్ లోంచి రహస్యంగా బయటపడి ముస్సోరీలో ప్రతి రోడ్డునీ సిద్ధార్ధ గాలిస్తున్న విషయం నిశాంతకు తెలీదు.


                                                      *    *    *    *


    చైనా బీజింగ్ లోని స్కైలీవ్స్ హోటల్.

 

    చైనా విదేశాంగ శాఖ ప్రతినిధులతో సమావేశం కోసం రహస్యంగా ప్రత్యేకంగా వచ్చాడు మహంత.

 

    "మహంత సాబ్! మీకు తెలుసు. ప్రపంచానికి పోలీసుగా వ్యవహరించే అధికారాన్ని అమెరికా తనకు తానే దత్తం చేసుకుంది. తన మాట వినే ఐక్యరాజ్యసమితినుంచి ఎలాగో పొందిన అనుమతి ముసుగులో కొన్నిమార్లు, ఆ శ్రమ కూడా లేకుండా కొన్నిసార్లు పెత్తనం చేస్తోంది. ప్రపంచాన్ని శాసించే శక్తి తనకే వుందని అమెరికా భ్రమపడుతోంది. నీకు తెలుసు. అమెరికన్ నౌకాదళాలు ఇటీవల మా చైనా రవాణా నౌక మిన్ హార్ ముజ్ ను అఖాతంలో ప్రవేశించకుండా చేసి అంతర్జాతీయ న్యాయశాస్త్రాన్ని, చైనా హక్కుల్ని అవహేళన చేశాయి. ఆ నౌకను అమెరికన్ నౌకాదళం ఏడురోజులపాటు తనిఖీ చేసి చివరికి రసాయనిక ఆయుధాల ఒప్పందం నిషేధించిన రసాయనికాలేవీ అందులో లేవని నిర్ధారించారు. ఇది చైనాను అవమానించడమే" ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు చైనా వున్నతాధికారి.

 

    "ఇంతకీ నా నుంచి మీకేం కావాలి?" సూటిగా ప్రశ్న వేశాడు మహంత.

 

    ఆ అధికారి ఒక్కక్షణం తటపటాయించాడు.

 

    "మినీ అణ్వస్త్రాల తయారీలో తొలిభాగంగా అమెరికా పరిశోధనల్ని చేపట్టిందని మాకు తెలుసు. భూగర్భంలో వుండే బంకర్లను సైతం ఛేదించగల ఈ అణ్వాయుధాలు చాలా శక్తివంతమైనవని తెలుసు. అందుకే ఆ ఆయుధాల ఫార్ములా మాకు కావాలి" చెప్పాడా అధికారి.

 

    ఆలోచనల్లో పడ్డాడు మహంత.

 

    "తెలివైనవాడు ఫార్ములా జోలికి పోడు. ఆయుధాలు సేకరిస్తాడు. మీకు ఆయుధాలు సరఫరా చేస్తాను" నవ్వుతూ చెప్పాడు మహంత.

 

    ఒప్పందం కుదిరింది. ఆరువేల కోట్ల అమెరికన్ డాలర్లు.

 

    రహస్య సమావేశం ముగిసింది.

 

    తను పర్సనల్ గా డీల్ చేసిన ఏ వ్యాపార ఒప్పందమూ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. గర్వంగా నవ్వుకున్నాడు మహంత.

 

    "ఒప్పందం విషయం మరోసారి ఆలోచించావా?" అడిగాడు సురేంద్రరాయ్.

 

    "నువ్విలా అడుగుతావని నాకు తెలుసు. ఆయుధాల వ్యాపారం చేసేవాడు నరహంతకుడు కాదు... ఆయుధాల్ని తయారుచేసేవాడు నరహంతకుడు... నేను ధర్మవ్యాధుడు లాంటివాడ్ని! నేను మేకను చంపను! చంపిన మేక మాంసాన్ని అమ్ముతాను. ఇది ధర్మసమ్మతం! శాస్త్ర సమ్మతం... ఆయుధ సమ్మతం కూడా" నవ్వుతూ చెప్పాడు మహంత.