సినిమా రాజ్యంలో ఓ రోజు


                       


    సినిమా తారలందరూ రాజకీయాల్లోకి వలసపోతున్నారు. పార్లమెంటులో అసెంబ్లీల్లో సినిమా నటీనటులు నిండిపోయే రోజు ఎంతో దూరంలేదు. అలా జరిగినప్పుడు సినిమా రాజ్యంలో- ఓ రోజు-

 

    ఇక చదవండి :

 

    మా కాలనీలో ప్రభుత్వం ఇటీవలే ఏర్పాటు చేసిన కమ్యూనిటీ టీవీ సెట్ పెద్ద సౌండ్ లో మోగసాగింది.

 

    "తెలుగు వీర లేవరా...."

 

    రోజూ ఆ పాటతో ప్రజలంతా నిద్రలేవాలని ప్రభుత్వం ఆదేశాలివ్వటం చేత నేను లేచి టైమ్ చూసుకున్నాను. అయిదున్నరవుతోంది. ఇంకా చీకటిగానే ఉంది బయట.

 

    "ఏవండోయ్- బ్రాందీ తెమ్మంటారా. విస్కీ తెమ్మంటారా?" లోపల్నుంచి అరచింది మా ఆవిడ.

 

    "బ్రాందీ!" అన్నాన్నేను.

 

    "బ్రాందీ వద్దు మమ్మీ! విస్కీ కావాలి! విస్కీ-" అరచారు పిల్లలు.

 

    ఈ గొడవ రోజూ ఉండేదే! ఒకోళ్ళకూ ఒకోరుచి.

 

    మా ఆవిడ రెండు సీసాలు తీసుకొచ్చి ఎవరికేది కావాలో వాళ్ళకది గ్లాసునిండా పోసి ఇచ్చింది.

 

    "మరి నువ్వు తాగవేం?" అడిగాన్నేను.

 

    "నేను రమ్ము తాగేశానండీ ఇందాకే! ఈ మూడింట్లోనూ అదే మంచిదన్నాడు డాక్టరు..." అందామె.

 

    సినిమా రాజ్యం వచ్చాక ప్రజలందరూ కూడా సినిమా ఫీల్డులో ఉండే అలవాట్లు చేసేసుకున్నారు. మరి ఆ ఫీల్డులో తెల్లవారుజాము నుంచీ అర్థరాత్రి వరకూ రమారమి అందరూ బాగా అలవాటుపడేది మందుకే గదా! అందుకే ప్రభుత్వం బ్రాందీ, విస్కీ, రమ్ములాంటివి రేషన్ కార్డుమీద కారు చవగ్గా అందజేస్తున్నారు. ఎల్లో కార్డు ఉన్న వాళ్ళకు పెద్ద బ్రాందీ డ్రమ్ పదహార్రూపాయలు! గ్రీన్ కార్డు వాళ్ళకు అదే ముప్పయ్ రూపాయలు.

 

    పిల్లలు విస్కీ తాగటం ముగించి మొఖాలు కూడా దాన్తోనే కడుక్కొని సిగరెట్లు తాగుతూ కమ్యూనిటీ టీవీలో మొదలయిన "విచిత్రహార్" ప్రోగ్రాం చూడసాగారు.

 

    రోజూ ఉదయం ఆ ప్రోగ్రామ్ లో పార్లమెంట్ సభ్యుల తాలూకు విభిన్న చలనచిత్ర పాత్రల్ని- విభిన్న సినిమాల నుంచి కొంచెం కొంచెం చూపిస్తారు.

 

    ఆఖర్లో ఆ సభ్యుడు వచ్చి రెండు ముక్కలు మాట్లాడతారు.

 

    ఆ రోజు "ఫాల్తూ ఆద్మీ" అనే హిందీ సినిమాలోని చలనచిత్ర నటుడు మాట్లాడుతున్నాడు.

 

    "సినిమాల్లోకి రాకముందు నేను జేబులు కొడుతూండే వాడిని! ఓసారి ఓ డైరెక్టర్ జేబు కొడుతూండగా ఆయన నన్ను పట్టుకుని సినిమాల్లో జేబులుకొట్టే పాత్ర ఇచ్చారు. ఆ రోజు నుంచీ అన్నీ అవే పాత్రలు. ఈలోగా ఎలక్షన్లు వచ్చాయ్. ఓ నామినేషన్ పత్రం పడేశాను. అంతే అద్భుతమయిన మెజారిటీతో ప్రజలు నన్ను గెలిపించారు!"

 

    మరి కాసేపటికి పిల్లలు పంచరంగుల డ్రస్ లు వేసుకుని స్కూల్ కి బయల్దేరారు. ఇప్పుడు ఇదివరకులాగా వాళ్ళు ఒకే రకం యూనిఫారం వేసుకోనక్కర్లేదు. ఎవరిష్టమొచ్చినా కాస్టూమ్స్ వాళ్ళు వేసుకోవచ్చు. ఆ కాస్టూమ్స్ అయిదు రంగులుంటే చాలు.

 

    నేనూ కాస్టూమ్స్ వేసుకుని భోజనం చేసేసరికి రంగారెడ్డి శాయిరామ్, గోపాల్రావ్, జనార్ధన్, యాదగిరి వచ్చేశారు.

 

    "త్వరగా పద మ్యూజిక్ మొదలయిపోయింది" అన్నాడు రంగారెడ్డి.   

 

    నగరంలోని అన్ని ఏరియా కమ్యూనిటీ సెంటర్స్ నుంచీ ఆఫీసులకు వెళ్ళే ప్రజల కోసం దేశభక్తిని ప్రేరేపించే పద్ధతిలో మ్యూజిక్ వినిపిస్తారు. నలభై నిముషాల వరకు నగరమంతా ఆ మ్యూజిక్ అలా వినిపిస్తూనే ఉంటుంది. అందరూ మ్యూజిక్ ఆగిపోయే లోపల ఆఫీసులకు చేరుకుంటేనే అటెండెన్స్ రిజిష్టర్ లో సంతకం చేయనిస్తారు. లేకపోతే ఆ రోజుకి ఆబ్సెంటే!

 

    మేము ఆఫీస్ లోకి అడుగు పెడుతూండగా మ్యూజిక్ ఆగిపోయింది. ఎదురుగ్గా ఉన్న 70 ఎం.ఎం తెరమీద టైటిల్స్ వేయడం ప్రారంభమయింది. ఆ రోజు మా ఆఫీస్ మేనేజర్ ఎవరూ, మా డిపార్ట్ మెంట్ కి సెక్రటరీ ఎవరూ, మంత్రి ఎవరూ అనేవి టైటిల్స్ లో వస్తాయి.

 

    ఆ తరువాత ఆ రోజు డీల్ చేయాల్సిన ఫైల్స్ ని చూపిస్తారు. వాటిల్లోనే పెండింగ్ లో ఉండి శతదినోత్సవాలు చేసుకున్న ఫైల్సూ, ఫ్లాప్ ఫైల్సూ, షూటింగ్ ళు ఉన్న ఫైల్సూ అన్నీ కనిపిస్తాయ్.

 

    ఆ తరువాత మా శాఖకు చెందిన మంత్రిగారు నటించిన చిత్రాల్లోని కొన్ని భాగాలు మేము విధిగా చూడాలి. మిస్సయితే ఫైన్ వేస్తారు.

 

    మంత్రిగారు చేసిన ఫైట్ ఆఖర్లో చూపిస్తారు.

 

    తన ఆదేశాలను ధిక్కరించే క్లర్క్ లు అలాంటి ఫైట్ కి సిద్ధపడి ఉండాలన్న హెచ్చరిక ఆఖర్లో వస్తుంది.

 

    ఆ సీను చూడ్డం అయాక ఎవరి సీట్స్ లో వాళ్ళు కూర్చున్నాం.

 

    అదే సమయంలో మా చీఫ్ క్లర్క్స్ మేకప్ రూమ్ నుంచి అందరికీ అభివాదం చేస్తూ బయటికొచ్చాడు.

 

    యాభై అయిదేళ్ళ మనిషల్లా ఇప్పుడు ఆ మేకప్ లో పాతికేళ్ళ కుర్రాడిలా కనబడుతున్నాడు.

 

    మేమంతా కూడా మేకప్ రూమ్ లోకి పరుగెత్తి త్వరత్వరగా మొఖానికి రంగులేసుకుని, తలకు విగ్గులు పెట్టుకుని బయటికొచ్చాము.

 

    డిపార్ట్ మెంట్ టీవీ స్క్రీన్ మీద ముఖ్యమంత్రి దేశభక్తి గీతం ప్రారంభమయింది.

 

    "మనమంతా ప్రజల సేవకులం- కాంట్రాక్టర్లనూ గూండాలనూ ప్రేమతో జయిద్దాం! రాష్ట్రాన్ని నందనవనంగా మారుద్దాం" అంటూ పాట ముగిసింది. ఆ తరువాత ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న (ముఖ్యమంత్రి హీరోగా నటిస్తున్న) చిత్రంలో కొన్ని సీన్లు చూపిస్తున్నారు.

 

    మా ఉద్యోగులంతా ఆ సీన్లు చూడటం చాలా అవసరం.

 

    ఎందుకంటే మాకు ప్రమోషన్స్ వచ్చేందుకు పెట్టే డిపార్ట్ మెంట్ పరీక్షల్లో రాబోయే ముఖ్యమంత్రి చిత్రాల్లోని పాత్రల గురించీ, సీన్స్ గురించీ కొశ్చెన్స్ ఉంటాయ్.