సామంత్ ని ఎక్కడో చూశాననే అనుమానం అక్కడున్న కొందరిలో రేగగా తోచిన విధంగా వాళ్ళు ఆలోచిస్తుండగా అర్జునరావు పీటర్ కి రహస్యంగా సైగ చేశాడు.

 

    పీటర్ గొంతు సవరించుకున్నాడు.

 

    "మీరేమీ అనుకోనంటే చిన్న ప్రశ్న..." అన్నాడు పీటర్ అక్కడున్న అందర్నీ ఉద్దేశించి.

 

    అప్పటివరకు ఏదో ఒకటి మాట్లాడుకుంటున్న వాళ్ళు మాట్లాడడం ఆపి పీటర్ కేసి ప్రశ్నార్థకంగా చూశారు.

 

    "మీరంతా ఆటోమోబైల్ ఇంజనీరింగ్ లో నిష్ణాతులు. నిర్జీవ యంత్రాలకు ఊపిరిపోసి, ప్రాణ ప్రతిష్ట చేసి పరిగెత్తించగల మేధావులు. ఆధునిక మానవుడి జీవితాన్ని సుఖమయం చేసి, కాలపు విలువను ఎన్నోరెట్లు పెంచిన జీనియస్ లు. నాకు కారుకొనే శక్తి లేకపోయినా, మెర్సిడస్ బెంజ్ నాకో అబ్సెషన్ దాని గురించి చెబితే ఈ శుభసందర్భంలో విని ఆనందిస్తాను... ప్లీజ్" అన్నాడు నెమ్మదిగా.

 

    సామంత్ ముఖంలో రంగులు మారిపోయాయి. పీటర్ ఎవర్ని చెప్పమన్నాడో అర్థంకాక రాబర్ట్ తన సోదరికేసి ప్రశ్నార్థకంగా చూశాడు.

 

    సామంత్ రాబర్ట్ ని చెప్పమన్నట్లు అతనికేసి చూశాడు. ఆ విషయాన్ని అర్జునరావు పసిగట్టాడు.

 

    "పాపం పీటర్ కి ఆంగ్ల భాష రాదు. రాబర్టుగారు చెబితే ఆంగ్లంలోనే కదా చెబుతారు. అందుకని సామంత్ చెపితేనే బావుంటుంది" అన్నాడు ఓరకంట సామంత్ ని చూస్తూ.

 

    సామంత్ ఒకింత కలవరపడ్డాడు.

 

    "అంకుల్... వార్ని గౌరవించడం సంస్కారమని భావిస్తున్నాను. ఇకపై..." నాయకి మాటలు పూర్తికాకముందే నాగమ్మ అందుకుంది.

 

    "రెండురోజుల నుంచి చూస్తున్నాను- ఈ ఇంటి అల్లుడిని గౌరవించడం మర్యాదస్తుల మొదటి లక్షణం కావాలి. కాని నువ్వు మాత్రం వార్ని పేరెట్టి పిలుస్తున్నావ్..." మందలిస్తున్నట్టుగా అంది.

 

    "సే....గారు... లేదంటే పిలవడం మానెయ్యండి" నాయకి అర్జునరావు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంది.

 

    దాంతో అర్జునరావు మొఖం మాడిపోయింది.

 

    "సారీ... చనువుగా అలా సంబోధించాను. ఇకపై అలా జరగదు" అన్నాడు అర్జునరావు లోలోన మండిపడుతూ.

 

    సామంత్ కవ్వింపుగా అర్జునరావు వేపు చూశాడు.

 

    "పాపం పెద్దాయన - మతిమరుపు, చాదస్తం రావడం, పెద్దరికాన్ని తనకై తాను పైనేసుకోవడం సాధారణం. ఇకపోతే వారికి కూడా మెర్సిడస్ బెంజ్ పట్ల ఆసక్తి వున్నట్లు వారి చూపుల్ని, ముఖకవళికల్ని బట్టి, వారు పీటర్ కి సైగ చేయడాన్నిబట్టి గ్రహించాను..." అన్నాడు సామంత్ చిన్నగా నవ్వుతూ.

 

    ఒకింత కలవరపడ్డాడు అర్జునరావు.

 

    "మీకు తెలిసే వుంటుంది. వీళ్ళకు తెలీదు. అందుకే చెప్పాలనుకుంటున్నాను. మీరేమీ అనుకోవద్దు" అని క్రీస్టినీ, మాంటేనీ, రాబర్ట్ లకేసి చూసి అన్నాడు సామంత్.

 

    పీటర్, అర్జునరావులు ఉలిక్కిపడ్డారు. ఎలా చెప్పగలనని ఇంత సాహసం చేస్తున్నాడు? ఏం తెలుసని పెట్రేగిపోతున్నాడు?! వాళ్ళకంతా అయోమయంగా వుంది.

 

    సామంత్ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలని నాగమ్మకి కూడా వుంది. తన అల్లుడు ఎంత తెలివిగలవాడో అని తెలుసుకోవాలనే ఉత్సాహం మాత్రమే అది.

 

    నాయకి ఉత్సాహంగా భర్తకేసి చూడసాగింది. చెప్పబోయే ముందు కొద్దిక్షణాలు నిశ్శబ్దంగా వుండి, అందర్నీ కూర్చోమన్నట్లు సైగ చేశాడు.

 

    అందరూ కూర్చున్నాక సామంత్ గొంతు సవరించుకున్నాడు.

 

    "ప్రపంచంలో కార్లు ఉత్పత్తి చేసే కంపెనీలన్నీ నష్టపోయినా, లాకౌత్స్ ప్రకటించినా, మెర్సిడస్ బెంజ్ అమ్మకాలు మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే వున్నాయి. వుంటాయి కూడా. బెంజ్ కొత్త మోడల్స్ రాబోతుండగానే, కొన్ని నెలలముందే, సంవత్సరాలకు ముందే ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడు బోతుంటాయి." సామంత్ కొద్దిక్షనాలు చెప్పడం ఆపి అందరి మొఖాలకేసి చూశాడోసారి.

 

    హాలంతా నిశ్శబ్దంగా వుంది.

 

    అక్కడున్న అందరూ ఆసక్తిగా వింటున్నారు.

 

    "పశ్చిమ జర్మనీ దేశపు మూడో పెద్ద కంపెనీ ఈ డైమలర్ బెంజ్. గత పది సంవత్సరాలలో బెంజ్ కంపెనీ తన ఉత్పత్తుల్ని రెట్టింపు చేస్తూ వచ్చింది. టర్నోవర్ మూడురెట్లకు పెరిగింది. యూరప్ దేశాలలో ట్రక్స్ తయారుచేసే అతి పెద్ద కంపెనీగా ఈ బెంజ్ రూపాంతరం చెందింది. హెవీ ట్రక్స్ లో 16 నుంచి 32 టన్నుల కెపాసిటీ గల వెహికల్స్ ఉత్పత్తిలో ప్రపంచం మొత్తం మీదే ఈ కంపెనీ ప్రథమస్థానాన్ని పొందింది.

 

    1982లో 4,40,000 కార్లు ఉత్పత్తి చేసి యూరప్ ఖండంలో ఒక సంచలనాన్ని సృష్టించింది. కీన్యాదేశంలో మెర్సిడెస్ బెంజ్ కారు డ్రైవర్ ని 'వాబెంజి' అని పిలుస్తారు. దానర్థం బెంజ్ ట్రైబ్ అని, డ్రైవర్స్ అందరిలోకి బెంజ్ కారుతోలే డ్రైవర్ కి ఎక్కువ గౌరవం ఇస్తారు.

 

    బాగా డబ్బున్న వాడినని, గొప్ప ధనవంతుడినని ఏ వ్యక్తి అయినా సమాజానికి తెలియజెప్పుకోవాలంటే మెర్సిడస్ బెంజ్ కారుని సొంతం చేసుకోగలిగితే చాలు.

 

    అమెరికాకి చెందిన రాబర్ట్ ఒరయిలీ (ఒలంపియా, వాషింగ్టన్) తన కారుమీద 20 లక్షల కిలోమీటర్లు తిరిగి హైయెస్ట్ మైలేజ్ ని రికార్డు చేసి గిన్నీస్ బుక్ లోకి ఎక్కాడు. అతను వాడిన కారు మెర్సిడస్ బెంజ్.

 

    సిండెల్ ఫిన్ గెన్ నగరంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది.

 

    ఆ నగరంలోని ఒక పారిశ్రామికవేత్త ఓరోజు డైమలర్ బెంజ్ అసెంబ్లీ ప్లాంట్ కి వెళ్ళి తనకు ఎలాట్ అయిన బ్రాండ్ న్యూ మెర్సిడస్ బెంజ్ డెలివరీ తీసుకుని ఆ ఆనందోద్వేగంతో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వంద కిలోమీటర్లు వెళ్ళాక తను తన భార్యను వదిలేసి వచ్చినట్లు గమనించి తిరిగి వెనక్కి వెళ్ళాడు. మెర్సిడస్ బెంజ్ ని ఒకసారి కొన్న వ్యక్తి తిరిగి ఆ కారునే కొనేందుకు రీ ఆర్డర్ ప్లేస్ చేస్తాడు తప్ప మరో బ్రాండ్ కారుని కొనేందుకు ఎంత మాత్రం ఇష్టపడడు.

 

    1982లో వెస్ట్ జర్మనీలో మెర్సిడస్ ఖరీదు 76,000 డి.ఎం. (3 లక్షలు) ఇప్పుడది అక్కడే నాలుగున్నర లక్షలు ఇండియా వచ్చేసరికి పదినుంచి పదిహేను లక్షలు దాకా ధర పలుకుతుంది"

 

    ధారాళంగా, సరళంగా, అలవోగ్గా చెప్పుకుపోతున్న సామంత్ ని చూసి నాగమ్మ, నాయకి గర్వపడుతుంటే, ముగ్గురు అమెరికన్స్ అభినందనగా చూస్తుంటే అర్జున్ రావు, పీటర్ లు షాక్ తిన్నారు.