7-30 ఎ.ఎమ్.

 

    మధుకర్ బెడ్ రూమ్ లో ఫోన్ రింగయింది.

 

    బద్ధకంగా అలాగే బెడ్ మీద పడుకుని వున్న మధుకర్ విసుగ్గా ఫోనందుకున్నాడు.

 

    "నేను. మధువన్ బార్ అండ్ రెస్టారెంట్ మేనేజర్ ని మాట్లాడుతున్నాను. రాత్రి విషయం గుర్తుందా? మర్చిపోయారా?"

 

    "నువ్వింకా నా బార్ లోనే వున్నావా? మా వాళ్ళు వచ్చి నీ ఉద్యోగము పీకేయలేదా?"

 

    "వ్వాట్?" ఫోన్ లో మేనేజర్ ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అన్నాడు.

 

    "ఎస్! ఇప్పుడది నా బార్. మీది కాదు."

 

    "ఐదు రూపాయల స్టాంప్ పేపర్... నాన్ జ్యుడీషియల్ పేపర్... ఏ బికారీ డబ్బిచ్చినా ప్రభుత్వం అమ్ముతుంది. అరవైయేళ్ళు దాటాక అ... ఆ... లు నేర్చుకొనే వ్యక్తయినా దానిమీద, ఆరుకోట్ల అపోలో హాస్పటల్ కొంటున్నాను. కొన్నాను అని కూడా రాసి అపోలో హాస్పటల్ మెయిన్ గేట్ ముందు పడేసి వెళ్ళినంత మాత్రాన అది రౌడీ స్వంతం అయిపోదు. ఆ ఆరుకోట్లు చెల్లించాలి. అర్థమయిందా చిన్ని నాన్నా..." మేనేజర్ కవ్వింపుగా అన్నాడు.

 

    "నీ జీవితంలో తెల్లవారటాలు లేట్ అనుకుంటాను. కాని కృంగిపోవటాలు మాత్రం త్వరగానే సంభవిస్తాయి. ఈరోజు ఉదయం ఐదు గంటలకే మా ఫైనాన్స్ సెక్రటరీ ఆ డబ్బు తీసుకెళ్ళి మీ ఓనర్ కి పేచేసి సంతకం తీసుకుని వచ్చారు. ఇంకా నీకు అందులోనే మేనేజర్ గా ఉద్యోగం చేయాలని వుంటే మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. ఎందుకంటే ఇప్పుడు ఆ బార్ కి యజమానిని నేను. యూ... ఓల్డ్ జాకాల్... హోల్డు యువర్ టంగ్..." మధుకర్ లైన్ ని డిస్కనెక్ట్ చేసి తిరిగి నిద్రలోకి జారుకున్నాడు.  

 

    ఫోన్ కి ఆవల వున్న మేనేజర్ కి ఒక్కక్షణం కాలు, చేయి ఆడలేదు.

 

    గాలి స్తంభించి పోయినట్లుగా, జీవితంలో కొత్త అనుభవాలు ఆశ్చర్యాన్ని, అద్భుతాల్ని మోసుకొస్తున్నట్లుగా దిగ్భ్రాంతికి గురయ్యాడు.

 

    ఎదురుగా కనిపించిన ఆటో ఎక్కి బార్ అడ్రస్ చెప్పి పోనివ్వమన్నాడు.

 

    మహతి తండ్రి రాజేంద్రప్రసాద్ కూడా ఓ మాదిరి వ్యాపారస్తుడే. రెండు మూడు వేరే వ్యాపారాలు కూడా వున్నాయి. అతనే ఆరోజు ఉదయం జరిగిన సంఘటనను జీర్ణించుకోలేకపోతున్నాడు.

 

    మాటా మాటా పెరిగి పౌరుషం కోసం పంతం కోసం తన బార్ కి వచ్చిన ఒక యువకుడు పది లక్షలు ఖరీదు కూడా చేయని బార్ ని ముప్ఫై లక్షలకు కొన్నాడు. ఇది నిజంగా నిజమేనా?

 

    పాతిక లక్షలకు బార్ ని కొని, ఐదు లక్షలు టిప్ యిచ్చాడు... ఇలాంటి నమ్మలేని నిజాలు అప్పుడప్పుడు, అక్కడక్కడ జరుగుతుంటాయంటే తనింత కాలం నమ్మలేకపోయేవాడు. కానిప్పుడు నమ్మక తప్పటంలేదు.

 

    తన దగ్గరిప్పుడు పదిలక్షలకి చెక్, ఇరవై లక్షల హార్డ్ క్యాష్ వుంది. ఏమిటిదంతా? ఎలా జరిగింది? మూడు గంటల కాలమా! ఇరవై లక్షల లాభమా?

 

    "మీరలా, వాటినక్కడే పెట్టుకు కూర్చుంటే ప్రమాదం. వెంటనే ఆ ఇరవై లక్షల క్యాష్ ని వేరేచోటికి తరలించండి" అప్పుడే కాఫీ కప్పుతో వచ్చిన రాజేంద్రప్రసాద్ భార్య అంది.

 

    రాజేంద్రప్రసాద్ చప్పున తేరుకున్నాడు.

 

                                                      *    *    *    *    *

 

    మేనేజర్ బార్ ముందు ఆటో దిగుతూనే మరింత ఆశ్చర్యపోయాడు.

 

    పదిమంది వర్కర్స్ ఒక వ్యక్తి ఆధ్వర్యంలో సీరియస్ గా పని చేసుకుపోతున్నారు.

 

    అప్పటికే మధువన్ బార్ పేరున్న నియాన్ లైట్స్ సైన్ బోర్డ్ ని పీకి క్రింద పడేసాడు. గోడలమీద వున్న మధువన్ బార్ అండ్ రెస్టారెంట్ పెయింటెడ్ లెటర్స్ ని గీకిపడేసారు.

 

    అంటే... ఉదయం రాజేంద్రప్రసాద్ గారికి డబ్బిచ్చి బార్ కీస్ కూడా తీసుకుని, వెంటనే పనిలోకి దిగిపోయారన్నమాట.

 

    తన వాటా ఐదు లక్షలు.

 

    తనకి టిప్ గా ఇచ్చిన మరో ఐదు లక్షలు.

 

    అంటే తనిప్పుడు పదిలక్షల హార్డ్ క్యాష్ కి యజమాని అన్న మాట. ఆ ఆలోచనే అతనికి ప్రపంచాన్ని జయించినంత ఆనందాన్ని కలుగజేసింది.

 

    వెంటనే అదే ఆటోలో రాజేంద్రప్రసాద్ ఇంటికి బయలుదేరాడు ఆ బార్ మాజీ మేనేజర్.

 

                             *    *    *    *    *

 

    రాఘవేంద్ర నాయుడు.

 

    డి గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్. తన తండ్రి తన కిచ్చిన కేవలం నాలుగు ఎకరాల పొలం పెట్టుబడితో అంచెలంచెలుగా, అనవరతపు శ్రమతో, పట్టుదలతో, అనుక్షణం పరుగులు తీస్తూ కేవలం ముప్ఫై సంవత్సరాల కాలంలో ఐదొందల కోట్ల ఆస్తుల్ని సొంతం చేసుకొనే స్థాయికి ఎదిగిన అనితర సాధ్యుడు రాఘవేంద్రనాయుడు.

 

    తణుకు ప్రక్కన రేలంగి అనే గ్రామంలో పుట్టి, కేవలం ఐదంటే, ఐదో తరగతి వరకే చదివిన ఒకప్పటి రఘు... రాఘవేంద్ర... మూడు పదుల సుదీర్ఘ ప్రయాణం తరువాత, తన పూర్తి పేరుకు నిజంగానే న్యాయం చేకూర్చుకున్న లివింగ్ లెజెండ్ - రాఘవేంద్ర నాయుడు" ఆయన జపాన్ లో పర్యటిస్తున్న సందర్భంలో జరిగిన సంఘటన అది.

 

    మోడరన్ మెడికల్ సైన్స్ కి సవాల్ గా వాళ్ళ వంశంలో ఒక్కరే జన్మిస్తుంటారు. రాఘవేంద్ర నాయుడి ముత్తాతకు రాఘవేంద్ర నాయుడి తాత ఒక్కరే సంతానం. ఆ తాతకు తన తండ్రి ఒక్కరే సంతానం. తన తండ్రికి తనొక్కడే. తనకీ మధుకర్ ఒక్కడే. ఆ మధుకర్ కి ఒక్కరే పుడతారా? అనే ప్రశ్న రాఘవేంద్ర నాయుడు దంపతుల్ని కొన్నివేలసార్లు ప్రశ్నించి వుంటుంది. తమ వంశంలో రెండో సంతానికి అవకాశం లేదని నిర్ధారించుకోవటం మూలంగానో... పెరిగిపోతున్న కోట్లాది సంపద పరులకు దక్కకూడదనో గాని రాఘవేంద్ర నాయుడుకి కొడుకు మధుకర్ అంటే ప్రాణం కంటే ఎక్కువ. తను ఎదిగిన ఎత్తులకన్నా ఎక్కువ. తను పాటించే వ్యాపార ధర్మాలకంటే ఎక్కువ.

 

    చిన్న బాధ కూడా కొడుకు దరి చేరకూడదని తపిస్తుంటాడు.

 

    మధుకర్ కి ఏ చిన్న కష్టం కలిగినా తట్టుకోలేడు.

 

    ఆ కష్టం కలిగించినవార్ని క్షమించలేడు.

 

    ఆ విషయం ఆయన క్రింద పనిచేసే అందరికీ తెలుసు.

 

    నిజానికి ఆయన క్రింద పనిచేసే వున్నతోద్యోగులు సయితం రాఘవేంద్ర నాయుడి కన్నా మధుకర్ కే ఎక్కువ భయపడతారు.

 

    రాఘవేంద్రనాయుడు తమనుంచి వర్క్ నే ఆశిస్తాడు. ఫలితాల్ని వూహిస్తాడు. నీతి నిజాయితీల్నే కోరుకుంటాడు. అందుకే ఆయన ఆశించినట్లు వుండగలిగితే చాలు - మిగతా విషయాలు ఒకటి అటూ ఇటూ అయినా ఉపేక్షిస్తారనే ధైర్యం వుంది.

 

    కాని, మధుకర్ విషయంలో అలా కాదు. ఎప్పుడు... ఎందుకు... ఎలా... కోపగించుకుంటాడో... రియాక్ట్ అవుతాడో ఊహించటం కష్టం.

 

    అతనా రాత్రి, అర్థరాత్రి దాటాక ఇంటికి చేరుకొని, ఆ మత్తులోనే ఫైనాన్స్ సెక్రటరీకి ఫోన్ చేసి, నిద్రలేపి, ముప్ఫై లక్షలకు మధువన్ బార్ కొనమన్నప్పుడు  అతను ముందు షాక్ తిన్నాడు. తేరుకొని కొద్ది క్షణాలు ఆలోచించాడు. అయినా వేరే మార్గం కనిపించక ఆ తెల్లవార్లూ ఇరవై లక్షల హార్డ్ కేష్ కలెక్షన్ లోనే గడిపాడు. ఎంత బిజినెస్ మెన్ అయినా ఎవరు మాత్రం లక్షలకు లక్షలు హార్డ్ కేష్ ని దగ్గరుంచుకుంటాడు?