"ఎప్పుడో బాల్యంలో ఆరేళ్ళ ప్రాయంలోనే తల్లి ఒడికి దూరమైన ఓ పసికందు ఈరోజు ఈస్థాయికి ఎదగడం పతనమో లేక పురోగమనమో నాకు తెలీదు. కాని మీ కథ తెలిసిన నేను విపరీతంగా స్పందించాను."

 

    శ్రీహర్ష ఫాలభాగంపై స్వేదం పేరుకుంది గతం గుర్తుకొస్తుంటే.

 

    "గోదావరి గట్టున నీటిబుడగల్ని చూస్తూ ఇసుకలో పిచ్చుకగూళ్ళు కట్టుకుంటూ కలలోలా బ్రతికిన ఓ పసికందు చాలామంది పిల్లలతోబాటు అపహరించబడ్డాడు. వెళ్ళింది అరబ్ దేశాలకి... సుఖంగా బ్రతకడానికి కాదు. ఉన్నవాళ్ళ వినోదానికి బలికావటానికి. నిశ్శబ్దంగా ఎంత ఏడ్చినా ప్రయోజనం లేకపోయింది రాణా. కోట్లు సంపాదించినా అరబ్ షేక్స్ ఎడారిలో ఒంటెల పరుగు పందెంలో పిల్లల్ని వాడుకోవడంలో వినోదం నాకు అర్థమయ్యేది కాదు. నేలకి ఆరడుగుల ఎత్తులో ఒంటె కంఠాన్ని పట్టుకుని ప్రాణాలుగ్గబెట్టుకుంటూ కూర్చుంటే అమ్మ ఒడికాదు గుర్తుకొచ్చేది. బ్రతుక్కోసం తపన, బ్రతకాలన్న ఆరాటం. ఆ పందెంలో పిల్లలు నేలకిజారి యిసుకలో సమాధి అయిపోతుంటే ఎంత ఉన్మాదంగా ఆనందించేవారో గమనించాను. అందరూపోగా మిగిలింది నేను" అసహనం, జుగుస్ప శ్రీహర్ష కళ్ళలో "అప్పుడే పేరుకుపోయింది ఆ వ్యవస్థపై ద్వేషం. ఆ బుర్జువా వ్యవస్థని నేలమట్టం చేయాలని ఆ పసితనంలోనే ఆలోచన రేగింది. ఆ వయసులోనే నన్నుకొన్న అరబ్ షేక్ ని నిద్రపోతుండగా హత్యచేసాను. అక్కడనుంచి మరోచోటకి మరోదేశానికి పారిపోయాను. అలా నా యాత్ర ప్రారంభమైంది."

 

    "మీరు చెప్పిన కధలోని ప్రతివిషయమూ నాకు తెలుసు శ్రీహర్ష. ఇదంతా తెలుసుకున్నది మీ భార్య లూసీ ద్వారా. కారణం నాకు స్నేహితుడయిన విదేశీ జర్నలిస్టు ఎవరోకాదు. లూసీకి అన్నయ్యే."

 

    నివ్వెరపోయాడు శ్రీహర్ష.

 

    "అందుకే... మీ శ్రీమతి మరణం తర్వాత మీరు పోలీసుల బారినుంచి తప్పించుకోవడాన్ని ఆ స్నేహితుడు నాకు తెలియజేసిన రాత్రే మీరీదేశంలో అడుగుపెడతారని వూహించి మీకోసం బాంబేలో కాపుకాసా. మిమ్మల్ని అనుసరిస్తూ శమంత్ ని మీరు కాపాడటంతో మీ మానవతావాదాన్ని గమనించి మీతో పరిచయాన్ని పెంచుకున్నాను."

 

    అరనిముషం నిశ్శబ్దం తర్వాత అడిగాడు శ్రీహర్ష "ఇంత తెలిసిన మీకు ఈ నిజం ఈరోజే నాకెందుకు తెలియజేయాలనిపించింది".

 

    "రేపు మొత్తం ప్రపంచం మీరెవరో తెలుసుకోబోతూంది శ్రీహర్షా."

 

    శ్రీహర్ష భృకుటి ముడిపడింది.

 

    "అంటే"

 

    "ఇంటర్ పోల్ నుంచి మీ గురించి పూర్తివివరాలు అందుకున్న కేంద్ర ప్రభుత్వం మీమీద నిఘా ఉధృతం చేసింది. ఈరోజు యస్పి శ్యాంసుందర్ ప్రెస్ కాన్ ఫరెన్స్ ఏర్పాటుచేసి మీ గురించి వివరాలతోబాటు ఫోటోల్ని ప్రెస్ కి రిలీజ్ చేసాడు. అంతేకాదు... గ్రాండ్ మాస్టర్ మీరే అయ్యుంటారన్న అనుమానాన్ని వ్యక్తంచేసాడు."

 

    నిశ్శబ్దంగా నిలబడిపోయాడు శ్రీహర్ష.

 

    "మీ చుట్టూవున్న మనుషుల్ని దేవుడిలా కాపాడగలుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి శ్రీహర్షా. మీమీద ఎలాంటి నేరాలు మోపబడిందీ ప్రజలకు తెలిసినా మీ గురించి తెలుసుకుంటున్న ప్రజలు మీ అవసరాల్ని గుర్తించారు. ఇక్కడ రావణుల స్వైరవిహారానికి శాశ్వతంగా తెరపడాలీ అంటే ఈ నేలకి మీ ఆసరా కావాలి."

 

    నవ్వుకున్నాడు నిర్లిప్తంగా.

 

    ఏది జరగకూడదనుకున్నానో అదికాస్తా జరిగిపోయింది.

 

    యధేచ్చగా తిరిగే అవకాశం లేదిక.

 

    అలా అని సాగిస్తున్న యజ్ఞాన్ని మధ్యలోనే ఆపలేడు.

 

    బ్రతుకుపై ఆశ, బ్రతికే అవకాశం ఏనాడో కోల్పోయిన తను ఇప్పుడిప్పుడే చావుకి సిద్ధంగాలేడు.

 

    "మీకు రహస్యంగా రక్షణ ఇవ్వటానికి నేను సిద్ధంగా వున్నాను" అన్నాడు రాణా ధృడంగా.

 

    "ఇంతవరకు మీరు అందించిన సహకారానికి కృతజ్ఞుడ్ని రాణా. కాకతాళీయంగా చాలాదూరం చొచ్చుకుపోయిన నేను మిమ్మల్ని తెలిసి రొంపిలోనికి లాగలేను. ఈ క్షణంలో నేను నిర్ణయించుకున్నదొక్కటే. సాధ్యమైనంత త్వరగా నా కార్యక్రమాల్ని ముగించుకోవాలి అంతే."

 

    "అదికాదు శ్రీహర్షా. యస్పి శ్యాంసుందర్ యీ విషయాన్ని అప్పుడే సవ్యసాచి మహేంద్రలతోపాటు మొన్న మీచేత దెబ్బతిన్న రాజీవ్ కి తెలియజేసాడు. ఇప్పటికే కేంద్రంనుంచి ఓ సిబిఐ ఆఫీసరు రంగంలోకి దిగాడని తెలిసింది. వేట అన్నిటి పక్కలనుంచి ఉధృతం కాబోతోందని అర్థమౌతుంది. రేపు దృశ్య పుట్టినరోజునాడు అందరూ సమావేశమై..."

 

    "వెయిట్" అర్థోక్తిగా అన్నాడు శ్రీహర్ష "దృశ్య పుట్టినరోజు రేపేనా."

 

    విస్మయంగా చూసాడు రాణా.

 

    "అవును."

 

    "థాంక్యూ రాణా. నేను మరిచిపోయిన అతి ముఖ్యమైన రోజుని గుర్తుచేసావ్"

 

    "అర్థంకావడం లేదు"

 

    అర్థంకావాల్సింది రాణాకికాదు... ...దృశ్యకి.

 

    డేవిడ్ ని పంపి గాయపరిచిన దృశ్యకి సరిగ్గా ఆమె పుట్టినరోజునాడు అద్భుతమైన గుణపాఠం చెబుతానని ఛాలెంజ్ చేసిన శ్రీహర్ష ఆ సమయం వచ్చినందుకు ప్రసన్నంగా నవ్వాడు.

 

    "శ్రీహర్ష షాగా తెలిసిపోయిన శుభసమయంలో దృశ్యద్వారా ఆ వ్యవస్థకి అందమైన అనుభవాన్ని అందించాలనుకుంటున్నాను రాణా. కలుస్తాను మళ్ళీ."

 

    వెళ్ళిపోయాడతను రాణా నిశ్చేష్టుడై చూస్తుండగానే.

 

    శ్రీహర్షకీ తెలియదు.

 

    అతడిక్కడ తన ఆలోచన్ని ప్రకటించే సమయానికే అతడెవరూ అన్నది దృశ్యకి తెలిసిపోయింది.

 

    సవ్యసాచి, యస్పి శ్యాంసుందర్ మాటల్ని వినడమేకాదు-

 

    అతడి ఫోటోని చూసింది దృశ్య.

 

    అదికాదు ఆమెను ఆందోళనపరిచింది.

 

    హఠాత్తుగా రంగప్రవేశం చేసిన దృశ్య బామ్మ ఫోటోని చూస్తూ "ఆ రోజు చీకటిలో నిన్నేదో చేసినవాడు యితడేనే పిచ్చిపిల్లా" అంది.