ఆమె తన భర్తని ఎలా ఎంచుకుందంటే....

 


పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. కానీ నిండు నూరేళ్లపాటు కలిసి ఉండాల్సిన భాగస్వామిని ఎన్నుకోవడంలో ఆడవాళ్లకి ఎంత వరకు స్వేఛ్ఛ ఉంది అన్న ప్రశ్నకు జవాబు దొరకడం కష్టమే! అందుకే ‘నాజరీన్ ఫజల్‌’ అనే యువతి తనకు కాబోయే భర్త, తన ఊహలకి తగినవాడో కాడో తెలుసుకునేందుకు ఓ మార్గాన్ని ఎంచుకున్నారు.

 

నాజరీన్‌ లండన్ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు. సంప్రదాయ ముస్లిం కుటుంబం కావడంతో... చదువు పూర్తికాగానే తల్లిదండ్రులు ఆమెకు ఓ వరుడిని నిశ్చయించేశారు. అక్కడే నాజరీన్‌ తనదైన శైలిలో స్పందించారు. ఫలానా వ్యక్తితో నీకు వివాహాన్ని తలపెట్టాము అని ఆమె తల్లిదండ్రులు ఎప్పుడైతే చెప్పారో వెంటనే అతనికి ఓ మెయిల్‌ పంపారు. అందులో ఒక పేజి నిండా తన గురించిన పరిచయం రాశారు. మరో పేజిలో తనకి కాబోయే జీవితభాగస్వామి నుంచి ఏం ఆశిస్తోందో తెలియచేశారు.

 

నాజరీన్ ముక్కుసూటితనం ఆమెకి కాబోయే భర్త ‘అమీన్‌’కు నచ్చినట్లే ఉంది. వెంటనే తన గురించి ఓ మూడు విషయాలు చెప్పి బదులుగా మరో మూడు ప్రశ్నలని సంధించాడు. అక్కడి నుంచి వారి మధ్య లేఖల పరంపర మొదలైంది. ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ప్రయత్నమూ ముందుకు సాగింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు... దాదాపు 80 మెయిల్స్‌ వారి మధ్య నడిచాయి.

 

తను తన భర్తని ఎలాంటి ప్రశ్నలు అడిగిందీ, వాటికి అతను ఎలాంటి జవాబులు చెప్పిందీ నాజరీన్‌ వ్యక్తిగతం. కానీ ఆడవారి ఉద్యోగాల దగ్గర నుంచీ వారి మీద జరిగే అత్యాచారాల వరకూ అతని అభిప్రాయాలన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేశానంటారు నాజరీన్‌. వాటికి అతను చెప్పిన జవాబులు ఆమెకు సంతృప్తికరంగానే తోచాయట. తన మనసులో ఉన్న ప్రతి సందేహాన్నీ అతని ముందు వ్యక్తపరిచాననీ, వాటికి అతను ఓపికగా జవాబులు అందించాడనీ అంటారు నాజరీన్‌. దాంతో అమీన్‌తో నిఖాకు మనస్ఫూర్తిగా ఒప్పేసుకున్నారట.

 

ఇదంతా జరిగి ఇప్పటికి ఏడాది గడిచిపోయింది. ప్రస్తుతం నాజరీన్ తన భర్త అమీన్‌తో హాయిగా కుటుంబజీవనాన్ని గడుపుతున్నారు. కాకపోతే ఆనాటి విషయాలను తన ఫేస్‌బుక్‌లో పంచుకోవడం వల్ల ఇప్పుడు నాజరీన్‌ వివాహం వార్తల్లో నిలుస్తోంది. బీబీసీ వంటి పత్రికల దృష్టిని సైతం ఆమె ఆకర్షిస్తోంది. ఇంతకీ నాజరీన్‌ తనకు కాబోయే భర్త అభిప్రాయాలని ఎందుకు తెలుసుకోవాలనుకుంది. ఆ విషయాన్ని ఇప్పుడు ఫేస్‌బుక్‌ ద్వారా ఎందుకు పంచుకోవాలనుకుంది అంటే- ‘మనం రెస్టారెంట్లో ఏం ఆర్డరు ఇవ్వాలనే విషయం మీద కూడా ఎంతోసేపు ఆలోచిస్తాం. అలాంటిది ఏమీ తెలియకుండానే ఒక వ్యక్తిని మన జీవితభాగస్వామిగా ఎలా నిర్ణయించుకోగలం. మరీ దారుణం ఏమిటంటే, చాలామంది తమ జీవితసహచరిని కేవలం పెళ్లిరోజే కలుసుకుంటారు. ఇద్దరూ ఒకరికొకరు తగినవారో కాదో తెలియకుండానే ఇలాంటి ప్రయత్నం ఎలా చేయగలం! కాబట్టి ‘పెళ్లి’ గురించి ఆలోచించేకన్నా ‘వివాహబంధం’ గురించి ఆలోచించాలి. నేను ఆ ప్రయత్నమే చేశాను. నాలాగా ఇతరులు కూడా చొరవ చూపాలి,’ అంటున్నారు నాజరీన్‌. సంప్రదాయ వివాహపద్ధతులకు కాస్తంత స్వేచ్ఛని జోడించిన నాజరీన్ ప్రయత్నాన్ని సోషల్‌ మీడియా తెగ మెచ్చుకుంటోంది.
 

 

- నిర్జర.