భర్తని ఎన్నుకునే హక్కు 5 శాతం మందికే!

కాలం మారిందని గొప్పగా చెప్పుకొంటున్నాం. పురుషులతో సమానమైన హక్కులను సాధించేందుకు స్త్రీలు ప్రయత్నిస్తున్నారనీ, వారి ప్రయత్నానికి సమాజం మొత్తం అండగా నిలబడిందనీ వ్యాసాలు రాస్తున్నాం. కానీ స్త్రీల పరిస్థితి ఏమాత్రమూ..... మారలేదని ఓ సర్వే తేల్చి చెబుతోంది.


National Council of Applied Economic Research అనే సంస్థ University of Marylandతో కలిసి భారతీయ మహిళల స్థితిగతుల మీద ఓ సర్వేను నిర్వహించారు. ఇందుకోసం వారు 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 34 వేలమంది స్త్రీల నుంచి వివరాలను సేకరించారు. వీరంతా కూడా 15 నుంచి 81 ఏళ్ల వయసులోపు వారే! ఈ సర్వేలో తేలిన విషయాలతో సామాజికవేత్తలకి నోట మాట రాలేదు.


- దాదాపు 80 శాతం మంది స్త్రీలు తాము వైద్యుడి దగ్గరకు వెళ్లాలంటే ఇంట్లోవారి అనుమతి తీసుకోక తప్పదని చెప్పారు. అది భర్తయినా కావచ్చు, అత్తమామలు అయినా కావచ్చు. మొత్తానికి అనుమతి లేనిదే ఆరోగ్యం కోసం బయటకు వెళ్లడం అసాధ్యం అన్నమాట.


- వైద్యుడి దగ్గరకు వెళ్లడం సంగతి అలా ఉంచితే... ఆఖరికి ఉప్పు, పప్పుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లడానికి కూడా వారికి అనుమతి కావాల్సిందే! 58 శాతం స్త్రీలు తాము పచారీల కోసం బయల్దేరేటప్పుడు కూడా ఇంటి యజమాని అనుమతి తీసుకోవాల్సిందే అని తేల్చి చెప్పారు.


- ఇంట్లో ఏ వంటకం చేయాలో నిర్ణయించే అధికారం 93 శాతం స్త్రీలకి ఉంది. ఆగండాగండి! ఆ శాతాన్ని చూసి సంబరపడకండి. దాదాపు 50 శాతం సందర్భాలలో ఇంట్లో ఏ వంట చేయాలని చేసే నిర్ణయంలో భర్త కూడా పాలు పంచుకుంటాడట.


- వైద్యం దగ్గర్నుంచీ వంట వరకూ పరిస్థితి ఇలా ఉంటే ఇక కుటుంబ విషయంగా భావించే పెళ్లిళ్ల సంగతి చెప్పేదేముంది! కేవలం ఐదంటే ఐదు శాతం ఆడవారికి మాత్రమే తమ భర్తలను ఎన్నుకొనే అధికారం ఉందట.


- మన దేశంలో పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లే అధికంగా ఉంటాయి కాబట్టి అందులో వధూవరుల పాత్ర తక్కువ కావడం అంత ఆశ్చర్యం కాకపోవచ్చు. కానీ పెళ్లి కుదిరిన తరువాత కూడా వారిద్దరి మధ్యా ఒక మాటా మంతీ జరగకపోవడం విచిత్రం. దాదాపు 65 శాతం మంది ఆడవారు పెళ్లిరోజునే తనకి కాబోయే భర్తని మొదటిసారి చూసినట్లు చెప్పారు. బీహార్లో అయితే ఇది 94 శాతంగా ఉంది.


విస్మయాన్ని కలిగించే విషయం ఏమిటంటే... స్త్రీల అక్షరాస్యతతో కానీ, పురుషులతో పోలిస్తే వారి నిష్పత్తితో కానీ ఈ శాతాలలలో పెద్దగా మార్పు రాలేదు. ఉదాహరణకు స్త్రీపురుష నిష్పత్తి ఎక్కువగా ఉండే చత్తీస్‌ఘడ్‌తో పోలిస్తే, వెనకబడిన రాష్ట్రమైన మేఘాలయలలో స్త్రీల పరిస్థితులు మెరుగ్గా కనిపించాయి. ఇన్నాళ్లూ ప్రభుత్వాలు స్త్రీలలో అక్షరాస్యత పెరిగితేనో, ఆర్థికంగా వారి పరిస్థితి మెరుగుపడితేనో వారు సాధికారతని సాధిస్తారని భావిస్తూ వచ్చాయి. కానీ ఆడవారి పరిస్థితి మెరుగుపడాలంటే సామాజికంగానే మార్పులు రావాలనీ... అందుకు అనుగుణమైన ప్రయత్నాలు మొదలుపెట్టాలనీ ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.                


- నిర్జర.