శశి సమ్మతిగా మళ్ళీ తల ఊపింది. అతను ఆమెకు దగ్గరగా వచ్చి అభిముఖంగా నిలిచాడు. దూరం దగ్గరకు జరిగింది. వాకిట్లో వీచిన చల్లనిగాలి సగం లోపలకు వచ్చి ఊదబోతున్న అతని నోటిని మెత్తని పమిటచెంగు మూయించింది. అతని ఊపిరి లోలోన ఆగింది. శశి మనసారా నవ్విన నవ్వు అతనికి కనబడలేదు.  

    "శశీ!" అన్నాడు ఆశ్చర్యంగా - "ఈ చీర పేరేమిటి?"

    ఆమె తత్తరపాటు చెంది "షిఫాన్" అంది. అతను జేబులోంచి పెన్నుతీసి ఓ కాయితంమీద ఆ పేరు రాసుకున్నాడు. "ఈ పేర్లు నాకు గుర్తుండిచావవు. మా చిన్నక్కకు తీసుకుపోతాను. ఈ చీర ఎంత బాగుంది!" అన్నాడు.

    ఆమె ఏదో పలకబోయేసరికి డగ్గుత్తి ఆపింది. అతను రిస్టువాచి చూసుకుని ఆతృతతో "క్షమించు శశీ! నేను ఇంకా బజార్లో కొన్ని వస్తువులు కొనుక్కోవాలి. అందులో ఆదివారం. వెళ్ళిరానా?" అని ఆమె అంగీకారంకోసం ఎదురుచూశాడు.

    ఆమె అంగీకారం సూచించింది. అతను వేగంగా బయటకు నడిచి చకచకా వెళ్ళిపోయాడు.

    సాయంత్రం ఆరున్నర అయింది. రవి హడావుడిగా స్టేషన్ కి వచ్చి ప్రజా సమూహాన్ని చీల్చుకుంటూ పోయి తన సామాన్లతో సహా ఓ కంపార్టుమెంటులో తలుపుదగ్గర నిలబడ్డాడు. ఇంకా అయిదునిముషాల వ్యవధి వుంది. అతను నిట్టూర్పు విడిచాడు. మూడునెలల తర్వాత తిరిగి ఇంటికి చేరుతున్నాడు. ఇహ చీటికీమాటికీ ఇక్కడకు వచ్చే అవసరం ఏమీలేదు. ఈ ఆలోచన అతని వెన్నుమీద చరిచినట్లయింది. తాను ఏదో అంతులేని అగాధంలో పడిపోతున్న మాటా వాస్తవం. లోపలకు పోయి కూర్చుందామని ఓసారి ప్రజాసమూహంలోకి దృష్టి సారించి ఉలిక్కిపడ్డాడు. ప్రతి కంపార్టుమెంటునూ శ్రద్ధగా పరిశీలిస్తూ ఓ స్త్రీ త్వరత్వరగా వస్తోంది. అతను అప్రతిభుడై నిల్చుండిపోయాడు. చివరకు ఆమె అతన్ని సమీపించింది. అతనుకూడా క్రిందకు దిగి నిలబడ్డాడు.

    "శశీ! నేను ఏమన్నా మరచిపోయానా?" అనడిగాడు ఆత్రంగా.

    "ఉహు! నేనే మరచిపోయాను" అంది శశి సన్నని స్వరంతో.

    "ఏమిటి?"

    ఆమె అతనికి ఓ పెద్ద పుస్తకం అందిస్తూ "ఈ పుస్తకం నీవు ఇమ్మని ఓసారి అడిగావు గుర్తుందా? నీకు ఊరికి వెళ్ళేటప్పుడు ఇద్దామనుకున్నాను" అంది.

    "థాంక్స్" అంటూ అట్ట తెరువబోయాడు.

    ఆమె తొందరగా వారిస్తూ "ఇప్పుడు తెరువబోకు. ఓ గంట గడిచాక తెరువు" అంది.

    "సరే" అంటూ అతను నవ్వుకుని ఊరుకున్నాడు.

    రైలు కదిలేవరకూ ఇద్దరూ మాట్లాడుకుంటూ నిల్చున్నారు. అప్పుడు మెట్లు ఎక్కి నిలబడి సెలవు తీసుకున్నాడు. చాలాసేపటినుంచి ఆమె నిల్చున్న ప్రదేశం నుంచి కదలకపోవటం అతను చూశాక మనస్సంతా కలచివేసినట్లయింది. లోపలకు వెళ్ళి ఆలోచిస్తూ కూర్చున్నాడు.   

    సరిగ్గా ఓ గంట గడిచింది. రైలు అప్పుడే ఓ స్టేషన్ విడిచిపెట్టి మందకొడిగా సాగుతోంది. కిటికీవరకూ దూసుకువచ్చిన చీకటికన్య రవినిచూసి ఈ అధిక్యత ముందు నేను పనికిరాననుకుని సిగ్గిలి తలవంచుకుంది. దీపం వెలిగింది.

    రవి జాగ్రత్తగా పుస్తకం విప్పి, పుటలు త్రిప్పాడు. కవరుకోసం వెదికాడు. అందులో ఒక చిన్న చీటీ వుంది. "నాకు మాత్రం దూరం కాబోకు!" అని అందులో వుంది. అది చదివి భారంతో తల వంచుకుని కూర్చున్నాడు.

                                       *    *    *

    చిన్నక్క ఉంటూన్న ఊరుకూ, రవివాళ్ళ ఊరుకూ మధ్య దూరం నలభై మైళ్ళ పైచిలుకే. ఊరికి చేరిన సాయంత్రమే అతను ఆమెను చూడటానికి బయలుదేరి వెళ్ళాడు.

    అతను ఓ పెద్ద ఇంటిముందు ఆగేసరికి తొమ్మిది దాటింది. గేటుదగ్గర కూర్చుని, చుట్ట కాలుస్తున్న ముసలినౌకరు లేచి నిలబడి, "ఎవరూ?" అని అడిగాడు.

    "నేనోయ్ రంగన్నా!" అన్నాడు రవి.

    "బాబుగారా! రండి" అని లోపలకు తీసుకువెడుతూ "ఎప్పుడు వచ్చారు?" అని అడిగాడు.

    "ప్రొద్దున్న. బావ ఊళ్ళో వున్నాడా?"

    "ఉన్నారు."

    రవి మెట్లు ఎక్కి పైకివెళ్ళాడు. వసారాలో చీకటిగా వుంది. లోపలెక్కడో తప్ప ఎక్కడా వెలుగు కనబడటంలేదు. రెండడుగులు వేసి ఆగిపోయాడు. కిటికీదగ్గర ఆనుకుని నిలబడి, బయటకు చూస్తోన్న ఓ స్త్రీరూపం అస్పష్టంగా కనబడింది. రవి ఆమెను మొదటి క్షణంలోనే గుర్తుపట్టాడు. అతని గుండెవేగం హెచ్చింది. తడబడుతున్న అడుగులతో ఆమెను సమీపించాడు.

    "చిన్నక్కా!" అన్నాడు.

    ఆమె ఉలిక్కిపడి వెనుదిరిగింది. "రవీ! నువ్వా" అంది ఆనందోద్రేకాలతో.

    "ఈవేళ ప్రొద్దున్నే వచ్చాను."

    "రా నాయనా! లోపలకు" అంది చిన్నక్క. అతను మాట్లాడకుండా అనుసరించాడు. ఎదురెదురు సోఫాలలో కూర్చున్నారు.

    "ఇట్లా చిక్కిపోయినావేంరా?" అంది చిన్నక్క.

    "అక్కడికి వెడితే చిక్కిపోవటం, ఇక్కడవుంటే బలిసిపోవటం అలవాటని నీకు తెలుసుకదా!"

    "నువ్వింకా తిరుగుతూ కూర్చుంటే వీలులేదు. నాన్నగారు నిన్ను ప్లీడర్ని చేయాలని ఎప్పుడూ కలలుకనేవారు. నువ్వు దురదృష్టవంతుడివి నాయనా! నీ అదృష్టం వాళ్ళకు చూపించే భాగ్యం కలుగలేదు" అని ఆమె కళ్ళు తుడుచుకుంది.

    "చిన్నక్కా! ఈ సమయంలో నువ్వు వాళ్ళని గుర్తుచేసి నాకెందుకు బాధ కలిగిస్తావు చెప్పు?" అన్నాడు రవి ఖిన్నుడై.

    "లేదు బాబూ! ఈరోజు నా మనసెంతో సంతోషంగా వుండటంమూలాన నీది ఒట్టి తేలికగుండె అన్న సంగతి మర్చిపోయాను. నీ దగ్గర్నుంచి ఉత్తరం ఎప్పుడు వస్తుందాఅని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాను. కానీ నువ్వు ఉత్తరం రాయకుండానే వచ్చావు."

    "నిజమే. చాలా పొరపాటు చేశాను."

    "రవీ! భోజనానికి లే నాయనా!"

    "బావ ఏడీ?"

    "ఆయన నిద్రపోతున్నారు."