ఎదగనివ్వరా!

పార్వతమ్మగారి మనుమరాలు అశ్వని ఆరోజే పట్నం నుంచి వచ్చింది. వచ్చిన దగ్గర్నుంచీ మనుమరాలు ముభావంగానే ఉండటం గమనించారు పార్వతమ్మగారు. ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే అశ్వనిలో మునుపటి ఉత్సాహం లేదు. కదిపితే చాలు నిండుకుండలా తొణికిపోయేట్లు ఉంది. ఆ రాత్రి భోజనాలు పూర్తయ్యాక నిదానంగా మనుమరాలిని కదిపింది పార్వతమ్మగారు ‘ఏంటలా ఉన్నావు?’ అంటూ.

‘ఆఫీసులో చేరిందగ్గర్నుంచీ ఏవో ఒక అడ్డంకులు. ఆడపిల్లను కదా! సలహాలకి మాత్రం అందరూ సిద్ధపడిపోతారు. సాయం కావల్సి వచ్చేసరికి ఎవ్వరూ తోడురారు. పైగా నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అంటూ ప్రతిదానికీ వెనక్కి లాగుతూనే ఉంటారు. ఇక నా వల్ల కాదనిపిస్తోంది’ అంటూ వాపోయింది మనుమరాలు.

పార్వతమ్మగారు కాసేపు ఆలోచించారు. కొంతసేపటికి ఏదో స్ఫురించినదానిలా ‘సరే! నువ్వు వెళ్లి పడుకో. రేపు ఆ కొండ మీద ఉన్న గుడికి అలా సరదాగా వెళ్లొద్దాం.’ అని ఊరడించారు. ఎప్పుడు కొండ మీదకి వెళ్దామన్నా అంతగా శ్రద్ధ చూపించని బామ్మ ఇవాళ ఇలా మాట్లాడటం అశ్వనికి విచిత్రంగా అనిపించింది.

మర్నాడు ఉదయాన్నే బామ్మా, మనుమరాలు ఇద్దరూ గుడికి బయలుదేరారు. పార్వతమ్మగారికి వయసు మీద పడిపోవడంతో అడుగుతీసి అడుగు వేయలేకపోతోంది. ఎలాగొలా మనుమరాలు భుజం మీద చేతులు వేసి ఆయాసపడుతూ కొండమీదకి చేరుకుంది. గుడిలో దర్శనం అయిపోయాక ఇద్దరూ ఓ చెట్టు నీడన సేదతీరారు. ‘ఏంటి బామ్మా! చిన్నప్పుడు ఎప్పుడు అడిగినా ఈ కొండ మీదకి వచ్చేదానికి కాదు. ఇప్పుడు ఓపిక లేకపోయినా ఇంత ఎత్తుకి ఎక్కావు. ఏంటి విషయం?’ అని అడిగింది అశ్వని. ‘చిన్నప్పుడు ఈ ఊరికి వచ్చిన ప్రతిసారీ, ఎప్పుడెప్పుడు ఈ కొండ ఎక్కుదామా అని ఎదురుచూసేదానివి. గుర్తుందా!’ అని అడిగారు పార్వతమ్మగారు.

‘అవును. చిన్నప్పుడు నాకు ఈ కొండ చివరిదాకా ఎక్కేంత ఓపిక లేకపోయేది. కొంత దూరం ఎక్కి కూలబడిపోతుంటే, అన్నయ్యలంతా తెగ ఏడిపించేవారు. ఇప్పుడు ఇంత చిన్నగా అనిపిస్తున్న కొండ నాకు అప్పట్లో ఎవరెస్టంత ఎత్తు ఉన్నట్లు తోచేది. ఈ కొండ పైకి చేరుకుని గుడిలో దర్శనం చేసుకున్న రోజుని నా జీవితంలో మర్చిపోలేను. ఆ రోజు నుంచి ఎప్పుడూ నాకు ఈ కొండ ఎవరెస్టులా కనిపించలేదు’ అని అశ్వని  ఆ రోజులను గుర్తు చేసుకుంటూ.

‘చేరుకునేదాకా లక్ష్యం ఎప్పుడూ అసాధ్యంగానే కనిపిస్తుందమ్మా! నువ్వు ఆడపిల్లవనో, ఎవరో నవ్వుతున్నారనో, లక్ష్యం దూరంగా ఉందనో ఎప్పుడూ డీలాపడిపోకూడదు. సలహాలు ఇచ్చేవాళ్లకి నీ విజయమే సమాధానం కావాలి. ఒకప్పుడు నువ్వు ఎక్కలేననుకున్న కొండను నువ్వు ఇప్పుడు ఎక్కడమే కాదు, నన్ను కూడా పైకి లాక్కొని వచ్చావు. ఇకనుంచి నువ్వు నీ జీవితంలో ఎంచుకునే ప్రతి లక్ష్యమూ ఇలా కొండలాగా నీ ముందు తలవంచాలి. సరేనా!’ అంది పార్వతమ్మ.

పార్వతమ్మ మాటలకి అశ్వని చిరునవ్వే సమాధానంగా మిగిలింది.

--nirjara