అమ్మతో
అమ్మ ఒక తెరిచిన పుస్తకం...
చదవాలనుకుంటే అక్షరమాలలా కనిపిస్తుంది...
వ్రాయాలనుకుంటే తెల్ల కాగితమై నిలుస్తుంది..
కనుకొలుకుల నిలిచిన కన్నీటితెర అమ్మ..
మాతృదినోత్సవం కోసమని అమ్మ గురించి రాయాలని అనుకున్నప్పటి నుంచి నా కనుపాపల వెనుక ఉన్న బాల్యంలోనికి వెళ్ళిపోయి అమ్మని ప్రేమతో ఆలింగనం చేసుకున్నా...
అమ్మకి అమ్మామ్మావాళ్ళు (తన అమ్మ ) పెట్టిన పేరు ప్రమీల ..నాన్నగారితో ఏడడుగులూ నడచి వచ్చి, ‘లీల’గా, లీలమ్మగా మారిపోయింది... అమాయకత్వానికి మారు రూపమయినా అన్నీ తన ఇష్టప్రకారమే జరగాలనే మనస్తత్వం ఆమెది.
'పాప'గా నేను ఒక్కదాన్నే అవటం మూలాన నేను ‘ఇది కావాలి’ అని అడిగే అవసరం లేకుండా నాకు అన్నీ అమర్చిపెట్టేది... అయినా, నేనెప్పుడూ మా నాన్నపార్టీనే...కానీ ఆ మురిపాలన్ని ఆమెవే...
ప్రతీ పుట్టిన రోజుకీ తనే స్వయంగా బూందీ లడ్డూలు చేసి (అప్పుడు కట్టెల పొయ్యి కదా..పాపం చాలా శ్రమ పడవలసి వచ్చేది..) ఆ వీధిలో ఉన్న పిల్లలందరికీ నా చేతితో ఇప్పించేది..
ముఖ్యంగా వడియాలు .. వేసవి వచ్చిందంటే చాలు రకరకాలైన వడియాలు పెట్టి, ఎండిన తరువాత డబ్బాల్లోకి ఎత్తి పెట్టేది... వర్షం వస్తూ ఉంటే ప్లేటు నిండా అమ్మ వేయించి ఇచ్చిన వడియాలు తింటూ కిటికీలో కూర్చుని వర్షపు ధారలను చూస్తూ.. ఎంతో సంబరపడేదాన్ని...
స్కూలు డ్రెస్సు తళతళ మెరిసిపోయేలా ఉతకటమేకాదు, ప్రతీ వారం బొగ్గుల ఇస్త్రీ పెట్టెతో చక్కగా ఇస్త్రీ చేసి పెట్టేది... నేను బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలని ఆమె కోరిక... (ప్చ్! నేను తీర్చలేకపోయాను)
తనకి వకీలు (లాయర్) అంటే ఎంతో ఇష్టం. ఆడవాళ్ళు అలా నల్లకోటు వేసుకొని న్యాయం కోసం వాదిస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండి పోయేది..(సినిమాలో టివిలో..) ...
నాకు పదమూడేళ్ళకి ఒక అపురూపమయిన వరప్రసాదంలా తమ్ముడ్ని ఇచ్చింది అమ్మ.. వాడి ఆలనా పాలన అంతా నా చేతిలోనే...
అనుకోకుండా నాకు మంచి సంబంధం రావడంతో ‘వద్దు’ అనలేకపోయింది, కానీ అమ్మకి అప్పుడే నా పెళ్ళి చేయడం మనస్ఫూర్తిగా అంత ఇష్టం లేకపోయింది.
నా పిల్లలు పుట్టాక, నా ఇద్దరు అమ్మాయిలతో తన గోడు వెళ్ళబోసుకునేది... (మా నాన్నతో కలిసి ఆమె మాట వినక పోయేదాన్ని కదా...! ఆవిషయాలన్నీ..)
ఎప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే .. తమ వీధి చివర దుకాణం లోంచి టెలిఫోను చేయించి... "నాన్న దగ్గుతున్నారు బాగా... నిన్ను ఒక్కటే అడుగుతున్నరు...ఒకసారి వచ్చి చూసి వెళ్ళు పాపా!" అని చెప్పి పెట్టేసేది...
మేము ఉండేది బేగం పేటలో... అమ్మా వాళ్ళు అంబర్ పేటలో ఉండే వాళ్ళు. మరుసటిరోజు పిల్లలు స్కూలుకు వెళ్ళగానే రెండు బస్సులు మారి మరీ వెళ్ళి చూద్దును గదా..! "నాకేమయింది? చూడు నేను పర్ ఫెక్ట్లీ ఆల్రైట్..." అంటూ నాన్న పెద్దగా నవ్వేసేవారు. అప్పుడు అర్థమయ్యేది నాకు ఇదంతా అమ్మ చేసిన పనేనని. 'ధనియాలపొడి, కారంపొడి, చారు పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్...’ మొదలయినవి అన్నీ ముందు రోజే తయారు చేసి మరీ ఉంచేది... ఇవన్నీ నాకు ఇవ్వడం కోసం అన్నమాట ఈ పన్నాగమంతా...
సూర్య బింబం లాగా ఎఱ్ఱగా కుంకుమని తన నుదుట నిండుగా దిద్దుకుని, అపర పార్వతీ దేవిలాగ ఉండేది మా అమ్మ. ఎప్పుడైనా చేయి జారి కుంకుమ కిందికి ఒలికిందా, ఇక చూడండి ఆమె బాధ... తనని ఓదార్చటం ఎంతో కష్టం అయేది మాకు... ఆమె అంతిమ కోరిక ‘ఒడి బియ్యం పోయించుకుని మళ్ళీ పెళ్ళికూతురిగా వెళ్ళిపోవాలని...’ అది ఆమె నిత్యం కొలిచే ఆ దైవం విన్నాడేమో, నాన్నని ఒంటరిగా వదిలేసి మమ్ముల్ని విషాద సాగరంలో ముంచేసి తను మాత్రం అన్ని జరిపించుకొని మరీ చెదరని చిరునవ్వుతో వెళ్ళిపోయింది...
'అఆలు’ నేర్వని అమ్మ అయినా ప్రతి అక్షరమూ తానే అయింది..ఈ పాపని కన్న ఆ అమ్మ...మా అమ్మ..!
సుజాత తిమ్మన (కవయిత్రి)
