నేను మా అమ్మ
నవ మాసాలు మోసి నాకు జన్మ ఇచ్చిన మా అమ్మ గురజాడ వెంకట లక్ష్మి మట్టి ముద్ద లాంటి నన్ను మానవతవాదిగా మలచింది. స్కూల్ లో చదివే రోజుల్లో పిల్లల పుస్తకాల్లో చిన్న కధలు రాసి చిట్టి పారితోషికం సంపాదించేదాన్ని . ఆ డబ్బుతో అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య..... ఇలాంటి పెద్దలకి పళ్ళు, రుమాళ్ళు, తువ్వాళ్ళు కొని దణ్ణం పెట్టించి ఇప్పించేది . నాకది నచ్చకపోయినా భయానికో భక్త్తికో కాని మాట్లాడేదాన్ని కాదు. ఒక సారి నాకు ఒక పెద్ద పారితోషికం వచ్చింది. వేసంగి సెలవలు కావడంతో కాకినాడ అమ్మమ్మ వాళ్ళ వూరికి వెళ్ళాము. అక్కడ పిల్లలం పార్టీ చేసుకుందా నుకున్నాము.
అప్పుడు మా పెద్ద నాన్నగారు "వూర్లో వృద్ధాశ్రమం పెడుతున్నారు. మొదటిసారి అందరూ విరాళాలు ఇవ్వండి" అన్నారు. వెంటనే అమ్మ, " ముందు శోభ పేరు రాసుకోండి" అంది. నా ముఖంలో రంగులు మారినా తప్పనిసరిగా ఇచ్చాను.ఆ సాయంత్రం పెద్దనాన్నగారు నన్ను పెద్దల దగ్గరికి తీసుకువెళ్ళి పరిచయం చేసారు. 'ఇంత చిన్న పిల్ల మొదటి విరాళం ఇచ్చిందా!' అని అందరూ ఆశ్చర్య పొయారు. నన్ను దీవించారు. తమ తమ కష్టాలు చెప్పారు. అవి నా మనసులో నిలిచిపొయయి. రైల్లో వస్తున్నప్పుడు కూడా అమ్మ 'సేవ' అనేది ఎంత గొప్పదో చెప్తూనే వచ్చింది.
అంతే నాకు తెలియకుండా నేను సేవా రంగానికి వెళ్ళిపోయాను. పదహారేళ్ళు వున్నా పద్దేనిమిదని చెప్పి రక్త దానం కూడా ప్రారంభించాను. కాని అది అమ్మకి తెలియదు సాహిత్యాని కంటే సేవకి ఎక్కువ విలువ ఇవ్వడం నాన్నకి నచ్చలెదు. "సమయం దొరికితే సేవా కార్యక్రమం చేసేందుకు పోతున్నావు, కధలు కవితలు రాయడం తగ్గిస్తున్నావు" అని మందలించారు. "దాని ఆశయం ముందు సేవ తర్వాతే సాహిత్యం కనక అలాగే కానిద్దాము" అంది అమ్మ. అప్పటినుండి ఇప్పటిదాకా అమ్మ నా నీడలా వుంది నన్ను ముందుకు నడిపిస్తూంది. ఆఖర క్షణాల్లో ఉన్న వారి దగ్గరికెళ్ళి సేవ చేసిన రోజులు వున్నాయి. ఆసుపత్రిలో ఉన్నవారికి సాయపడిన రోజులూ వున్నాయి. అమ్మతో ఆ విషయాలు చెబుతూ వుంటే అన్నీ విని సంతోషిస్తుంది. దూరదర్శన్ వాళ్ళు మా ఇంటికి వస్తే అమ్మ పెదవి విప్పలేదు. తెలుగు వన్. కామ్ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు తనని అమ్మలా చూసుకున్న అత్తగారి గురించి చెప్పింది.
అభినందన సంస్థ ఉత్తమ తల్లులకి పిల్లలతో వందన కార్యక్రమం చేసింది. అందులో పాల్గొని అమ్మకి పూజ చేసే అవకాశం నాకు లభించింది సేవా రంగంలో నేనిలా ఉన్నానంటే దానికి కారణం అమ్!. ముందు నేను కనిపిస్తాను కాని కనబడకుండా నన్ను నడిపించేది అమ్మ. అందుకే ఆమె గురించి రాయమంటే సంతోషం. నాకు ఆమె గురించి చెప్పమంటే గర్వంగా అనిపిస్తుంది ఎప్పుడూ!
-డా. గురజాడ శోభాపెరిందేవి
