వాకిట్లో ఎదురయిన ఆ దృశ్యం ఆమెకి అతి కమనీయంగా తోచింది.
    
    నవీన్ కి అతని తల్లి అన్నం నోట్లో పెడుతోంది. అతను నవ్వుతూ ఏదో అంటున్నాడు. ఆమెకి నచ్చేది అదే. ఎప్పుడూ ఆ తల్లీ, కొడుకులూ ఆనందంగా, ఆహ్లాదంగా వుంటారు. వాళ్ళకి కష్టాలు లేవని కావు. వాటిని తలచుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు అంతే! ఎదుటి వాళ్ళకి కూడా తమ ఆనందాలు పంచుతారే తప్ప, విషాదాలు పంచాలనుకోరు.
    
    "ఏమిటీ ఇంట్లోకి రాకుండా అక్కడే నిలబడిపోయావు?" అడిగాడు నవీన్ ధృతిని చూసి.
    
    "ఏమిటి సంగతి! బాలకృష్ణుడిలా గోరుముద్దులు తింటున్నావు.....?" అంటూ వచ్చి పక్కన కూర్చుంది ధృతి.
    
    దయామణి ఖాళీ గిన్నె తీసుకుని లోపలికి వెళుతూ "రాత్రి ఎవరింట్లోనో ఎలక్ట్రిక్ పనిచేస్తుంటే షాక్ కొట్టిందమ్మా నాకూ ఇప్పటిదాకా చెప్పలేదు. చూడు చేతులెలా కాలిపోయాయో" అంది.
    
    ధృతి చప్పున ముందుకి వంగి అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ "నాకు చెప్పలేదే?" అంది. అతని వెల్లకి బేండేజ్ కట్టివుంది.
    
    అతను చేతులు వెనక్కి తీసేసుకుంటూ "అంత మంచి విషయమా పరిగెత్తుకొచ్చి చెప్పడానికీ?" అన్నాడు.
    
    "అవున్లే! నేనే పిచ్చిదాన్ని ప్రతిదానికీ నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నీ సలహా తీసుకుంటాను" అంది ఉక్రోషంగా.
    
    "ప్రేమ్ ఏమంటున్నాడు?" అతను కవ్వింతగా అడిగాడు.
    
    ఆమెకి వెంటనే ఇంట్లోవాళ్ళ ప్రవర్తన గురించి నవీన్ తో పూసగుచ్చినట్లు చెప్పెయ్యాలనిపించింది.
    
    "ప్రేమ్ చాలా తెలివిగా అందర్నీ బుట్టలో వేసేశాడు. అమ్మా, నాన్నా పూర్తిగా అతని ప్రభావంలో వున్నారు. ప్రతిమాటకీ చివరా.....ముందూ వెనకా..... అతని పేరే...." అంది.
    
    "ప్రేమ్ చేస్తున్నదేం వుంది ఇందులో? అతనికి ఏం లాభం....?" నవ్వుతూ అడిగాడు నవీన్.
    
    ధృతి ఆవేశంగా ఏదో అనబోయి, కొంచెం ఆలోచించి సిగ్గుపడి "తెలీదా" అంది.
    
    నవీన్ లేచి నిలబడుతూ - "ఇవన్నీ ఆ పెద్దాయన ఆడిస్తున్న ఆటలు" అన్నాడు.    

    ఆమె ఉలిక్కిపడి చూసింది.
    
    "ధృతి....! ప్రపంచంలో తెలివిగా నెట్టుకురావడానికి రెండే రెండు మార్గాలు స్వయంకృషీ, లేదా ఇతర్ల అవివేకం. రెండోది పుష్కలంగా దొరికింది మీ ఇంట్లో" అన్నాడు.
    
    ధృతి అప్పుడే కళ్ళు తెరుస్తున్నట్లుగా అతనివైపు చూసింది.
    
    "పందెం సంగతి నువ్వు మరిచిపోయినా, ఆయన మరిచిపోడు. అఖండుడు! డబ్బు రుచి నీకు చూపించాడు ప్రేమ్ ద్వారా నువ్వు పడక పోయేసరికి నీ వాళ్ళకి ఎర వేస్తున్నాడు. వీళ్ళు టపీమని పడిపోతారు" అన్నాడు.
    
    ఆమెకి అప్పటిదాకా జరిగిన సంఘటనలన్నీ క్రోడీకరించి చూసుకుంటుంటే నవీన్ చెప్పినట్లే పథకం ప్రకారం జరుగుతున్న అద్భుతమైన నాటకంలా తోస్తోంది. తనేమో వెర్రిదానిలా ఆయన వ్యక్తిత్వానికీ......క్రమశిక్షణకీ మురిసిపోతూ ....చెప్పినట్టల్లా ఆడుతోంది. ఆయన మాత్రం తన ప్రయత్నాల్లో తను బిజీగా వున్నాడు. మొదటి మెట్టుగా తల్లినీ, తండ్రినీ తనవైపు తిప్పేసుకున్నాడు. నో! జరగనివ్వకూడదు. అస్సలు జరగనివ్వ  కూడదు..... నా వాళ్ళు డబ్బుకి మోజుపడి ఆయన చెప్పినట్లల్లా ఆడారు అని ఆయనకి తెలియజెప్పాలి అనుకుంది.
    
    "ఏమిటీ అలా అయిపోయావ్?" ఆమె కళ్ళముందు చిటికెలు వేస్తూ అడిగాడు నవీన్.
    
    "ఏంలేదు మళ్ళీ కలుస్తాను నాకు చాలా పని వుంది నవీన్..." అంటూ ఆమె ఇంటికి బయల్దేరింది.
    
    దయామణి ఆశ్చర్యంగా "అదేమిట్రా ధృతి అప్పుడే వెళ్ళిపోతోంది?" అంటూ వచ్చింది.
    
    అతను చిన్నగా నవ్వి "ఏదో సలహాకోసం వచ్చిందమ్మా..." అన్నాడు.
    
    "చెప్పావా?" అడిగింది.
    
    "నేను చెప్పబోయేలోగా ఏదో స్ఫురించినట్లుంది. వెళ్ళిపోయింది" చెప్పాడు.
    
    దయామణి నవ్వి "పాలపొంగులాంటి వయసు ఇది! ఏదొచ్చినా పట్టలేరు" అంది.
    
                                                               * * *
    
    ధృతికి ఆరోజు ఆఫీస్ లో ఎలాగైనా ధర్మానందరావుగారితో పోట్లాడాలని పించింది. కానీ కారణం లేదు.
    
    ఆయన పిలవగానే పెన్సిల్, బుక్ తీసుకుని లోపలికెళ్ళింది.
    
    "మీ నాన్నగారికి ఎలావుంది?" చాలా కూల్ గా అడిగాడాయన.
    
    "మీ దయవల్ల బాగానే వుంది" వ్యంగ్యంగా అందామనుకుంది కానీ గొంతు సహకరించలేదు. మామూలుగానే అంది.
    
    "చాలా పని పెండింగులో పడిపోయింది. వెళ్ళి చూడు....." అన్న ఆయన ఆజ్ఞాపూరితమైన గొంతు వినగానే, ఆమె అప్రయత్నంగా వెనక్కి తిరిగి తన సీట్లోకి వచ్చి కూర్చుంది. ఏదైనా మాట్లాడాల్సింది. వాదించాల్సింది అని చాలా అనిపించింది కానీ తనంత తానుగా వెళ్ళి ఏమీ అనలేని పరిస్థితి!
    
    గొప్ప వ్యక్తుల కోపం క్షణికం! సాధారణ వ్యక్తి కోపం రెండు గంటలు! బొత్తిగా సంస్కారంలేని వ్యక్తి కోపం ఓ రోజు! పాపి కోపం తఃను చచ్చిపోయే దాకా అట! ఆమె సాధారణ అమ్మాయే పాపం!    
    
    సాయంత్రం ఇంటి దగ్గర ప్రేమ్ కలిస్తే ఆమె ముక్తసరిగా మాట్లాడింది.
    
    "మీ అమ్మా, నాన్నలు మీ వివాహ విషయంలో చాలా బెంగపెట్టుకున్నారు పాపం" అన్నాడు నాందీ ప్రస్తావనగా.
    
    ఆమె ముఖం ఎర్రబడింది.