ఆమె ‘మదర్ ఆఫ్ ద ఇయర్’
అమ్మ ఎవరికైనా అమ్మే. తన బిడ్డ మాత్రమే బాగుండాలి... వేరే తల్లి కన్న బిడ్డలకు ఏమైనా పర్లేదు అని ఏ అమ్మ అయినా అనుకుందీ అంటే, ఆమె అమ్మతనంలో కమ్మదనం లేనట్టే భావించాలి. అయితే అమెరికాలోని బాల్టిమోర్ ప్రాంతానికి చెందిన ఒక అమ్మ తన కొడుకు మీద అతిగా ప్రేమ పెంచేసుకోలేదు. అతను తప్పు చేసినా వెనకేసుకు రావాలని ప్రయత్నించలేదు. అతను తప్పు చేస్తున్నప్పుడు నిలదీసింది. ఇతరులకు హాని చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు అడ్డుకుంది. అమ్మ అంటే ఎలా వుండాలో ప్రపంచానికి చెప్పింది. అందుకే ఆమెను ఇప్పుడు అందరూ ‘మదర్ ఆఫ్ ద ఇయర్’ అని పిలుస్తున్నారు.
అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో ఇటీవల ఒక విద్యార్థి పోలీసుల కస్టడీలో చనిపోయాడు. ఆ విద్యార్థిని పోలీసులు అన్యాయంగా చంపేశాడని స్థానికులు గత కొద్ది రోజులుగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. అయితే మంగళవారం వరకూ ఆ ప్రదర్శనలు శాంతియుతంగానే జరిగాయి. బుధవారం నాడు ఆ మరణించిన విద్యార్థి అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా కూడా శాంతియుత నిరసన ప్రదర్శన జరుగుతూ వుండగా కొంతమంది కుర్రాళ్లు ముఖానికి ముసుగులు వేసుకుని విధ్వంసకాండకు దిగారు. ఈ అల్లర్ల కారణంగా పరిస్థితులు చెయ్యి దాటిపోయి, పోలీసు ఫైరింగ్ జరిగే ప్రమాదం వుందని అక్కడున్నవారందరూ భయపడిపోయారు.
అయితే ఇదే ప్రదేశంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ‘టోయా గ్రాహమ్’ అనే మహిళ చూపులు ముఖం నిండా ముసుగు కప్పుకుని, పోలీసుల మీదకు రాళ్ళు విసురుతున్న ఒక యువకుడి మీద నిలిచాయి. ఆ ముసుగులో వున్నదెవరో ఆమె కనిపెట్టేసింది. ఎందుకంటే, ఆ యువకుడిని కన్నది తానే కాబట్టి. ఆ ముసుగు యువకుడు తన కుమారుడే అని గ్రహించిన ఆ అమ్మ మనసు ఆగ్రహంతో రగిలిపోయింది. వెంటనే ఆ యువకుడి వెంట పడింది. తన తల్లి తనను పట్టుకుని తన ముసుగు తొలగిస్తుందని భయపడిన ఆ యువకుడు ఆమె నుంచి దూరంగా పారిపోయే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆమె పట్టు విడవకుండా తన కొడుకు వెంట పరిగెత్తి అతన్ని పట్టుకుంది. అతని ముసుగు తీసి, ఆ చెంపా, ఈ చెంపా వాయించేసింది. తల్లికి దొరికిపోవడంతో ఆ యువకుడు శాంతించి అదుపులోకి వచ్చాడు. మిగతావారు కూడా పారిపోవడంతో అల్లర్లు అదుపులోకి వచ్చి పోలీసు కాల్పులు తప్పాయి. ఈ ఘటనను ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో చూస్తున్న దాదాపు ఐదు లక్షల మంది ప్రేక్షకులు చూశారు. ఆ మహిళ వెంటాడి పట్టుకున్నది తన సొంత కొడుకునే అని తెలిసి ఆశ్చర్యంలో మునిగిపోయారు.
ఈ ఘటన తర్వాత టోయా గ్రహమ్ మాట్లాడుతూ, తన కొడుకు ముసుగులో వున్నప్పటికీ తాను గుర్తించానని, అల్లర్ల కారణంగా అతని జీవితం నాశనం కావడంతోపాటు పోలీసులు కాల్పులు జరిగితే ఎంతోమంది మరణించేవారు. ఒక తల్లిగా నా బిడ్డ ఎలా సంతోషంగా వుండాలని కోరుకుంటానో, మిగతా తల్లులు కూడా సంతోషంగా ఉండాలని భావిస్తాను అని చెప్పింది. నా కొడుకు దారి తప్పాడు... ఇప్పుడు అతన్ని సరైన దారిలో పెట్టే పనిలో నిమగ్నమవుతాను అని చెప్పింది. తన చర్యలతో, తన మాటలతో టోయా గ్రహమ్ అమెరికా ప్రజలకు బాగా నచ్చేసింది. ఇప్పుడు ఆమెను అందరూ ‘మదర్ ఆఫ్ ద ఇయర్’ అని పిలవటం మొదలుపెట్టారు.