"మా ఊళ్ళోకి కొత్తగా ఓ కుర్రాడొచ్చాడు బాసూ... ఆడి పేరైతే నాకు తెలీదు... రాత్రిపూట వెళ్ళాను... రాత్రిపూట వచ్చేశాను... ఈసారి కనుక్కుంటాను."

 

    "మీ ఊరు జోగిపేటే కదా?" అడిగాడు కాళిదాసు.

 

    "కాదు గురూ... అసలూరు శివదేవునిపల్లె అని ఇక్కడకు చాలా దూరంలే... ఆంధ్రా, మహారాష్ట్ర బోర్డరులో వుంది" చెప్పాడు వెంకట్.

 

    "ఆ కుర్రాడు పట్నపు కుర్రాడేనా? నువ్వు చూశావా?"

 

    "ఎందుకు చూడలేదు... ఓ పోరి గొడవల్లో గురువుని బాగా చితక తంతేనూ" పక్కనున్న వెంకట్ శిష్యుడు చెప్పాడు నవ్వుతూ.

 

    కాళిదాసు జేబులోంచి ఈనాడు పేపర్ని తీసి అందులోని ఆదిత్య ఫోటోని చూపించాడు.

 

    పేపర్లో ఫోటోని చూడగానే గుర్తుపట్టేశాడు వెంకట్.

 

    "ఈడేనండీ బాబూ ఆడు... ఈ మర్డర్ గాడు మా ఊళ్ళోకెందుకొచ్చాడండి బాబూ?"

 

    ఆ మాటకి కాళిదాసు కళ్ళు మెరిశాయి.

 

    "నువ్వు మందు కోసం చెపుతున్నావా? నిజంగా చెపుతున్నావురా?"

 

    "నిజంగా కాళీబాసూ... నీ మీదొట్టు... ఆడు మా ఊళ్లోనే వున్నాడు" అన్నాడు వెంకట్ పళ్ళు నూరుతూ.

 

    "అయితే... పదరా పద మీ ఊరెళ్దాం" కాళిదాసు తూలుతూ లేచాడు.

 

    కాళిదాసు, దుర్గ, వెంకట్, ఇద్దరు శిష్యులు లారీ దగ్గరకొచ్చారు... లారీ ఎక్కారు.

 

    లారీ ముందుకి దూసుకుపోయింది ఆ మరుక్షణం.

 

    లారీ రైల్వేస్టేషన్ పక్కనున్న కిళ్ళీ బడ్డీ దగ్గర సిగరెట్ ప్యాకెట్లు కొంటున్న ఇన్స్ పెక్టర్ డేవిడ్ అనుకోకుండా లారీవేపు చూసాడు.

 

    "లారీలోని వ్యక్తులు గుర్రం పెద్దబ్బాయి మనుషులు కాదుగదా?"

 

    అతని పోలీస్ మైండ్ అలారం కొట్టింది.

 

    ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేగంగా వెళ్ళి జీపెక్కాడు.

 

    "రాములూ... ఫాలో ది లారీ... వాళ్ళని మనం ఫాలో అవుతున్నామని వాళ్ళకు తెలియకూడదు... జాగ్రత్త" హెచ్చరించాడు ఇన్స్ పెక్టర్ డేవిడ్ వుద్వేగంతో.


                                                *    *    *    *    *


    ఇద్దరి వ్యక్తుల మధ్య మౌనంగా ఉంది నిశ్శబ్దం.

 

    మెయిన్ గేటు తెరచుకుని లోనికొచ్చాడు ఆదిత్య. హాల్లో రంగి ఎదురయ్యింది.

 

    "అమ్మగారెక్కడున్నారు?" అడిగాడు ఆదిత్య.

 

    "మేడమీద ఉన్నట్టున్నారు" చెప్పేసి వంటగదిలోకెళ్ళిపోయింది రంగి.


    
    గబగబా మెట్లెక్కాడు ఆదిత్య.


    
    బెడ్ రూమ్ తలుపులు దగ్గరగా వేసున్నాయి.

 

    నెమ్మదిగా తలుపు తెరిచాడు.

 

    బేబీ బెడ్ మీద ప్రెటీ నిద్రపోతోంది.

 

    "హలో" ఆ పిలుపుకి బదులు లేదు గదులన్నీ వెతికాడు. ఎక్కడా సుమబాల కన్పించలేదు.

 

    తోటలోకొచ్చాడు... ఆకుల గలగలలు తప్ప మనిషి అలికిడి లేదు.

 

    ఎక్కడకెళ్ళుంటుంది?

 

    మళ్ళీ వెంకట్ దాడి చేశాడా? ఇన్స్ పెక్టర్ డేవిడ్...

 

    ఆ ఆలోచన రాగానే ఆదిత్య స్థాణువులా నిలబడిపోయాడు... అతని మెదడు అచేతనంగా అయిపోయింది.

 

    క్రితం రాత్రినుంచీ సిక్త్స్ సెన్స్ హెచ్చరిస్తూనే వుంది. ఎందుకో రాత్రంతా అతనికి నిద్రకూడా పట్టలేదు. ఒకవేళ అలాంటిదే జరిగితే రంగి చెప్పకుండా వుంటుందా?

 

    వాతావరణం ప్రశాంతంగా వుంది... చేతి వాచీవేపు చూశాడు... తొమ్మిదిగంటలు దాటింది.

 

    దూరంగా కొండల మధ్యనుంచి పారుతున్న జలపాతం హోరు...

 

    పొలాల గట్ల వెంబడి వడివడిగా నడుస్తున్నాడు.
    


    అయిదు నిమిషాలు... పది నిమిషాలు...

 

    "సుమ...బాలా" ఆ అరుపు జలపాతపు హోరులో కలిసిపోయింది.

 

    దట్టమైన చెట్లకింద, రాళ్ళగుట్టలవేపు చూశాడు...

 

    దూరంగా సుమబాల నిశ్చలంగా కూర్చుని వుంది.

 

    ఆదిత్య మనసు కుదుటపడింది.

 

    జలపాతం వేపు చూస్తూ పరధ్యానంగా వుంది.

 

    దీర్ఘంగా నిట్టూర్చి ముందుకు నడిచాడు. అతనికి, ఆమెకూ మధ్య కేవలం అయిదడుగుల దూరమే వుంది.

 

    అప్పుడు వినిపించింది స్పష్టంగా...

 

    వెక్కి వెక్కి ఏడుస్తోంది సుమబాల.

 

    ఆ దుఃఖాన్ని తను సముదాయించలేడు... ఆ బాధను తను మాయం చేయలేడు...

 

    మనసుకు తగిలిన ఈ గాయానికి తన దగ్గర మందులేదు.

 

    ఒక్కొక్కప్పుడు భరించలేని బాధకు కన్నీరే మందు.

 

    కాళ్ళకింద పడిన ఎండుటాకు చప్పుడుకి తుళ్ళిపడి తలతిప్పి చూసింది సుమబాల.

 

    కన్నీటిని తుడుచుకోబోయింది కంగారుగా.

 

    "మీరా?"

 

    "పరిస్థితుల్ని అర్ధం చేసుకుని బాధల్ని దిగమింగుతారనుకున్నాను, కానీ... ఇలా..." అర్దోక్తిలోనే ఆగిపోయాడు.

 

    సుమబాల కనురెప్పలమీంచి ఒక కన్నీటి చుక్క ఎండుటాకుమీద పడింది.

 

    "నేను రాయిని కాదు. మనిషిని"

 

    పైటచెంగుతో కన్నీటిని తుడుచుకుంటూ అంది సుమబాల.

 

    "ధరణిని అంతస్తు కోసం, హోదా కోసం, ఆస్తికోసం నేను ప్రేమించలేదు... ధరణి మంచి మనసును చూసి ప్రేమించాను... నా వాళ్ళందరినీ కాదనుకుని ప్రేమించాను, పెళ్ళి చేసుకున్నాను... ప్రేమ, పెళ్ళి, ధరణి ఒక కలగా మిగిలిపోయాయి... ఇప్పుడు నేను నా తండ్రి దగ్గరికి గానీ... నా చెల్లి దగ్గరకిగానీ వెళ్ళలేను... ఒంటరిగా బతకలేను... ధరణి లేకుండా... నా బతుకును వూహించుకోలేను... నేను బతకలేను... ఆదిత్యా! మీరో పని చేస్తారా?" తనని తాను కంట్రోల్ చేసుకుంటూ రక్త వివర్ణమైన చూపులతో అడిగింది సుమబాల.

 

    ఆశ్చర్యంగా చూశాడు ఆదిత్య.

 

    "మా సిస్టర్ ట్రెస్సా... హైద్రాబాదులో వుంటోంది... ప్రెటీని ఆమెకు అప్పగిస్తారా?"

 

    ఆమె ఏం చెపుతోందో అర్ధంకాలేదు ఆదిత్యకు.

 

    "మరి...మీరు?"

 

    దుఃఖంతో మళ్ళీ కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి సుమబాలకు.