మీనాక్షి కత్తి పట్టిందంటే.... యువకులంతా బలాదూరే!

 


76 ఏళ్ల మనిషి ఎలా ఉండాలి! మన అంచనా ప్రకారం నడుము వంగిపోయి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, నాలుగడులు వేసినా ఆయాసపడుతూ, ఎవరి మీదన్నా ఆధారపడేలా ఉండాలి. అదీఇదీ కాదంటే... తన గతం గురించి నిరంతరం నెమరువేసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. కానీ మీనాక్షి అమ్మని చూస్తే వయసు గురించి, వృద్ధాప్యంలోని నిస్సారత గురించీ ఉన్న ఊహలన్నీ పటాపంచలు అయిపోవాల్సిందే!

 

 

 

కేరళలో ‘కలరిపయట్టు’ అనే ప్రాచీన యుద్ధకళ ఉంది. దీని ముఖ్యోద్దేశం ఆత్మరక్షణే అయినా శరీరానికి తగిన వ్యాయామం, ఆరోగ్యం చేకూరేలా లయబద్ధమైన కదలికలతో కలరిపయట్టు సాగుతుంది. ఈ కలరిపయట్టు ఈనాటిది కాదు! ఎప్పుడో 5వ శతాబ్దంలోనే ఈ కళ మొదలైందని అంటారు. క్రమేపీ బౌద్ధభిక్షువుల ద్వారా చైనాకు వ్యాపించిందనీ చెబుతారు. మనం ఈరోజున చూస్తున్న కరాటే, జూడో వంటి యుద్ధకళలలన్నింటికీ కూడా కలరిపయట్టే మూలమని ఓ నమ్మకం. ఇంత ప్రాచీన కళ అయిన కలరిపయట్టుని ఇంకా సజీవంగా ఉంచుతున్న వ్యక్తే మన మీనాక్షి అమ్మ!

 

 

 

మీనాక్షి అమ్మ తన ఏడేళ్ల వయసులో ఏదో సరదాగా ఈ కళని నేర్చుకోవాలని అనుకున్నారు. దాని వల్ల శరీరం నృత్యానికి మరింత అనుకూలంగా మారుతుంది కదా అని ఆమె తల్లిదండ్రుల ఆలోచన. కానీ ఒక్కసారి గోదాలోకి దిగి కర్రని చేతపట్టగానే, తాను ఈ కళ కోసమే పుట్టానని తోచింది మీనాక్షికి. అంతే! అప్పటి నుంచి ఇక వెనక్కి చూడలేదు. దాదాపు 70 ఏళ్లుగా మీనాక్షి కలరిపయట్టుకి అంకితం అయిపోయారు. ఆమె అంకితభావం చూసి ఆమె గురువైన రాఘవన్, మీనాక్షిని ఏరికోరి పెళ్లిచేసుకున్నారు.

 

 

 

రాఘవన్‌కు Kadathanadan Kalari Sangam పేరుతో కలరిపయట్టుని నేర్పే ఒక గురుకులం ఉండేది. చుట్టుపక్కల గ్రామాల్లోని విద్యార్థులందరికీ అందులో ఉచితంగా ఈ కళని నేర్పేవారు. కోజికోడ్‌లో ఉన్న ఆ గురుకులంలో రాఘవన్‌కు సాయంగా ఉండేది మీనాక్షి. కానీ 2009లో ఆయన చనిపోవడంతో మీనాక్షి జీవితం మారిపోయింది. తన భర్త స్థాపించిన గురుకులాన్నీ, దాంతోపాటుగా కలరిపయట్టు కళనీ నిలబెట్టాల్సిన లక్ష్యం ఏర్పడింది. దాంతో గురుకుల బాధ్యతలను సంతోషంగా స్వీకరించారు. వందలమంది శిష్యులను తీర్చదిద్దసాగారు.

 

 

మీనాక్షి అమ్మ వద్ద ఎప్పుడూ 150 నుంచి 200 మంది శిష్యరికం చేస్తుంటారు. వీరిలో ఓ 30-40 మంది విదేశీయులు కూడా ఉండటం గమనార్హం. కలరిపయట్టు నేర్చుకోవడం ఏమంత సాధారణమైన విషయం కాదు. ఈ విద్యకు అంతమంటూ ఉండదు. కర్ర, కత్తి, బల్లెం... ఇలా ప్రతి ఆయుధంతోనూ కలరియపట్టు సాగుతుంది. అంతేకాదు! ఈ యుద్ధకళకు అనుబంధంగా ఓ ప్రత్యేక వైద్య విధానం కూడా ఉంటుంది. అందుకనే తాను ఈ విద్యలో ఎప్పటికీ విద్యార్థినే అని వినయంగా చెబుతారు మీనాక్షి.

 

తన భర్తలాగే, మీనాక్షి కూడా కలరిపయట్టుని నేర్పినందుకు పైసా కూడా అడగరు. విద్యార్థులు ఎంత ఇస్తే అంత పుచ్చుకుంటారు. గురుకులం నడిచేందుకు అవసరమయ్యే నిధుల కోసం ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. ఒక ప్రాచీన కళని కొనసాగించేందుకు, పదిమందికీ నేర్పేందుకూ మీనాక్షి అమ్మ పడుతున్న తపనని కేంద్ర ప్రభుత్వం సైతం గుర్తించింది. అందుకే ఈ ఏడాది ఆమెను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఇక కేరళ ప్రజలకు ఆమె ఎప్పటినుంచో సుపరిచితమే. లక్ష్యం పట్ల నిబద్ధత, ఆరోగ్యం పట్ల శ్రద్ధ, సంప్రదాయం పట్ల గౌరవం... వంటి లక్షణాలతో ఆమె ఎప్పటికీ ఆదర్శమే!

 

 

- నిర్జర.