షోకేసు బొమ్మలు కూడా మోసం చేస్తాయి

 

ఆడవాళ్ల చర్మం రంగు ఎలా ఉండాలో, ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, ఎంత సన్నగా ఉండాలో... సూచించే ప్రకటనలకి కొదవే లేదు. మీడియాలో ఎక్కడ చూసినా ఇలాంటి ప్రకటనలు వెంటాడుతూనే ఉంటాయి. ఇలా కాకుండా వేరే విధంగా ఉండే ఆడవాళ్లని సమాజం పట్టించుకోదనీ, అసలు విజయమే దక్కదనీ హెచ్చరిస్తుంటాయ. మనం షాపులో చూసే నిలువెత్తు ప్లాస్టిక్ బొమ్మలు (mannequins) కూడా ఇందుకు మినహాయింపు కాదంటున్నారు పరిశోధకులు.

ఈ రోజుల్లో ఎంత చిన్న బట్టల షాపులోకి అడుగుపెట్టినా mannequins పలకరిస్తూనే ఉంటాయి. సన్నగా పీలగా ఉండే ఈ షోకేసు బొమ్మల్ని చూసి ఇంగ్లండులోని కొందరు పరిశోధకులకు అనుమానం వచ్చిందట. వెంటనే ఆ దేశంలోని రెండు పెద్ద నగరాల్లో ఓ సర్వేని నిర్వహించారు. అక్కడ రద్దీగా ఉండే బట్టల దుకాణాల్లోని mannequins కొలతలు తీశారు.

చాలా బట్టల దుకాణాల్లో కనిపించే mannequins పీనుగుల్లా ఉన్నాయని తేలింది. షాపులోకి అడుగుపెట్టిన ఆడవాళ్లని ఈ బక్కపలచ బొమ్మలు తప్పుదారి పట్టించడం ఖాయం. ఇది Body Image Problem అనే తరహా సమస్యలకి దారితీస్తుదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ సమస్య మొదలైనవారు, ఇలాంటి పోలికలు చూసి... తమ శరీరం ఆకర్షణీయంగా లేదేమో అని అనుమానించడం మొదలుపెడతారు. దాంతో ఆత్మన్యూనత, సరైనా ఆహారం తీసుకోకపోవడం వంటి లక్షణాలకు దారితీస్తుంది.

ఇప్పటికే సెలబ్రెటీల దగ్గర్నుంచీ న్యూస్ రీడర్ల వరకూ బక్కపల్చగా కనిపిస్తున్నారు. మన శరీరం కూడా ఇలా ఉండాలి కాబోసు అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ఆ జాబితాకి ఇప్పుడు షోకేసు బొమ్మలు కూడా తోడయ్యాయి! తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పరిశోధకులు. పైపై మెరుగులకంటే ఆరోగ్యమూ, ఆత్మవిశ్వాసమూ ముఖ్యమని హెచ్చరిస్తున్నారు.

- నిర్జర.