దసరా సెలవులకు సుందరం వచ్చినప్పుడు ఎంతో విచారంగా, బరువుగా వున్నట్లు కనిపించాడు. మనిషిలో సహజమైన కళ రానురాను అంతరించి పోతోంది.
    
    "బేబి! నీతో ఓ విషయం మాట్లాడాలి."
    
    "మాట్లాడు బావా?"
    
    "బావా! బావా!! బావా!!!"
    
    లోపల్నుంచి ఉబుసుకు వస్తోన్న ఉద్రేకాలను అదిమిపట్టి తమాయించుకున్నాడు.
    
    "బేబి! నువ్వు నాతో సహజంగా ఎందుకుండవు?"
    
    "నేను సహజంగానే వుంటున్నాను బావా."
    
    "అదికాదు బేబి! నువ్వు కఠినురాలవు కాదని తెలుసు. మూర్ఖురాలివికూడా కాదు. ఇతరులని కష్టపెట్టేనే జగుణం కూడా కాదు అటువంటప్పుడు నాతో మనసువిప్పి ఎందుకు చెప్పవు?"
    
    మనసు విప్పి ఏం చెబుతుంది? ఎవరర్థం చేసుకుంటారు?
    
    "వద్దు బావా? ఈ చర్చ వద్దులే మనమధ్య"
    
    "కాదు యిది నాకు చాలా ముఖ్యమైన విషయం బేబీ! ఇది నా జీవిత సమస్య."
    
    "ఇది నాకూ జీవితసమస్యే బావా!" అనుకుంది మనసులో.
    
    "మాట్లాడు బేబీ! మౌనం నేను భరించలేకుండా వున్నాను. మొదట్నుంచీ యిలా లేవు నువ్వు హఠాత్తుగా ఏదో మార్పు వచ్చింది. నీలో నువ్వు నలిగి పోతున్నావు. ఈ పరిస్థితి నీకూ సుఖంగా లేదని తెలుసు. కాని ఇలా ఎందుకు జరుగుతోంది? మనం మామూలుగా ఎందుకు వుండటంలేదు? నాపట్ల యింత వైముఖ్యం వున్నట్లయితే మొదటే ఎందుకు చెప్పలేదు? మొదటే ఈ పెళ్ళికి ఎందుకు నిరాకరించలేదు? బేబి! నీ జీవితాన్ని పాడుచేసుకోవడంతో బాటు నా జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావని తెలుసుకుంటున్నావా?"
    
    "తెలుసు అందుకే, నేను రెండురకాలుగా నలిగి నశించిపోతున్నాను" ఆమె కళ్ళనుండి నీళ్ళు కారుతున్నాయి.
    
    "బేబి! నీ మనసులో వేరే ఎవరైనా వున్నారా?"
    
    ఆమె ఉలిక్కిపడింది!
    
    "ఎవరినైనా ప్రేమించావా?"
    
    "లేదు లేదు, లేదు" అని చెప్పాలనుకుంది.
    
    "చెప్పు నాతో? నిజం చెప్పు బేబీ!"
    
    లేదన్నట్లు తలవూపింది.
    
    "నేనంటే అసహ్యమా?"
    
    కాదన్నట్లు తలవూపింది.
    
    "బేబి! నువ్వు నాకర్ధం కావడంలేదు. నువ్వంటే నాకు చాలా చాలా యిష్టం. పిచ్చి. అందుకే నిన్ను ఏం చెయ్యలేకపోతున్నాను. నీపట్ల దుడుకుగా ప్రవర్తించలేకపోతున్నాను."
    
    అంతలోనే గిరిజకు కసి వచ్చేసింది. 'బలాత్కారం చేస్తే నా శవాన్నే చూస్తావు' అనుకుంది దహించుకుపోతూ.
    
    "అంతరంగికమైన మన సమస్య రచ్చకీడ్వడం నాకిష్టంలేదు. నువ్వు మారతావనీ మనకి మంచిరోజులు వస్తాయనీ నమ్మకముంది బేబీ! ఆ ఆశతోనే నేను రోజులు వెళ్ళబుచ్చుతున్నాను" అతని గొంతు వణికింది.
    
    తర్వాత సుందరం వెళ్ళిపోయాడు.
    
                                                        * * *
    
    రెండునెలలు గడిచాక యశోద ఉత్తరం రాసింది. తనకు ఒంట్లో సుస్తీగా వుంటున్నదనీ, మరో మనిసి సాయం అవసరం అయేలా వుందనీ, గిరిజ ఎలాగూ కాలేజీ మానేసింది. కాబట్టి కాపరానికి పంపిస్తే బాగుంటుందనీ.
    
    పుండరీకాక్షయ్యగారు, అనసూయమ్మగారు చర్చించుకుని కూతుర్ని యశోద రాసిన ప్రకారం పంపించటానికే నిర్ణయించారు.
    
    ఈ నిర్ణయం గిరిజ చెవులకి సోకింది. ఆ రాత్రి ఆమెమనసులో భయంకర మైన తుఫానులు చెలరేగాయి.
    
    ఆమె అంతరాత్మ అనేకరకాలుగా ఘోషిస్తోంది. ఉద్బోధిస్తోంది.
    
    ఇన్నాళ్ళగా అయితే అతను రావటం, పోవటం, యిద్దరిమధ్యా మౌనంగా గడిచిపోవటం జరిగిపోతోంది. ఇహ జీవితపర్యంతం అతనితో గడిపే ఘడియలు సమీపిస్తున్నాయి. ఒకరోజుకాదు, రెండురోజులుకాదు, నెలలుకాదు, సంవత్సరాల తరబడి ఈ బరువును, సంఘర్షణను భరిస్తూ ఎలా గడుపుతుంది? ఇది సాధ్యమా? తన జీవితం ఇలా చివికిపోవల్సిందేనా? ఈ ప్రళయం, అగ్నిజ్వాలనుంచి తనకి విముక్తిలేదా?
    
    ఇందులో తనపొరపాటు వుంటే వుండవచ్చు. మొదట్లోనే తన హృదయం అట్టడుగునుంచీ కాస్త కాస్తగా పొంగుకువచ్చే ఆలోచనలు గ్రహించలేకపోవటం అశక్తతే కావచ్చు. ఈ వివాహాన్ని ఆదిలోనే ఖండితంగా నిరాకరించకపోవడం అసమర్ధతే కావచ్చు. అందుకని దీన్నించి విడివడి, స్వేచ్చపొంది తన మనసు శాసించిన రీతిగా జీవించే హక్కు శాశ్వతంగా పోగొట్టుకున్నట్లేనా? అనుదినగండంగా ఈ రంపపుకోత, ఈ శిక్ష జీవితాంతం అనుభవించాల్సిందేనా!
    
    మరి ఏంచెయ్యాలి?
    
    అతన్ని భరించలేకపోతే... అతన్ని భరించలేకపోతే... దూరంగా వుండాలనుకోవటం తప్పా? సంప్రదాయం అంత కఠినమైనదా?
    
    ఆమె తల్లో ఏదో ఆలోచన మెరిసింది.
    
    వెంటనే 'అమ్మో' అనుకుంటూ భయంతో వణికిపోయింది.
    
    తగునా? ఈ నిర్ణయం తగునా?
    
    "అంతే, అంతకుతప్ప మరోమార్గంలేదు" అని అంతరంగం ప్రబోధిస్తోంది.
    
    అలసటగా, దుఃఖంగా, బలహీనంగా, అనుభూతులు పొంది పొంది ఎప్పటికో కన్నుమూసింది.
    
    మరునాడు తల్లిదగ్గరికెళ్ళింది. అనసూయమ్మగారు ఆరోజు శనివారం కావటంచేత రాత్రి ఫలహారాలకు పిండి నానబోస్తోంది.