ఆడవాళ్లలో ప్రేమ పాళ్లు ఎక్కువట

 

 

కుటుంబసభ్యులతో కానీ.. సన్నిహితులతో కానీ.. సహచరులతో కానీ ప్రేమానుబంధాలు బలంగా ఉండాలంటే మీరు ముందుగా ప్రేమను పంచటం లేదా ప్రేమగా మాట్లాడటం అత్యంత ఆవశ్యకం.. అయితే ప్రేమను ఆడవాళ్లు బాగా పంచుతారా...? మగవాళ్లు పంచుతారా..? అన్న ప్రశ్న చాలా సందర్భాల్లో.. చాలా వేదికల మీద విని ఉంటాం. ఆడవాళ్లది ఏముందండి..? మేమే బాగా చూపించగలమని మగవాళ్లు.. కాదు.. కాదు మేము అని ఆడవాళ్లు ఇలా రకరకాలుగా వాదించుకుంటూ ఉంటారు. ఇలాంటి వారికి సమాధానం చెప్పడానికి యూనివర్శిటీ ఆఫ్ జ్యూరిచ్ పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు.

 

సహాయగుణం, ప్రేమతత్వం మగవారిలో కంటే ఆడవారిలోనే ఎక్కువని తేల్చారు. మగువల మస్తిష్కంలో ఎల్లప్పుడూ స్నేహపూర్వకమైన, ప్రేమపూర్వకమైన ఆలోచనలు మెదులుతూ ఉంటాయని.. పరిశోధకుల బృందం తేల్చింది. కాగా, ఇదే సమయంలో మగవారి ఆలోచనలు మోసపూరితంగా, లాభాపేక్షతో కూడినవిగా ఉంటాయని తెలిపింది. మగవారి కంటే ఆడవారు మృధు స్వభావం కలిగినవారని, నలుగురితో కలుపుగోలు తనంగా ఉండటమే కాకుండా.. వారి శ్రేయస్సును కాంక్షిస్తారని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు తేల్చాయని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్ అలెగ్జాండర్ సౌట్స్‌చెక్ చెప్పారు. లాభం కోసం నిర్ణయాలు తీసుకోవడంలో మగవారు ముందుంటారని ఆయన అన్నారు. మెదడు పనితీరు, ఆలోచనా విధానం వల్లే స్త్రీ, పురుషుల మధ్య ఇలాంటి వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ సర్వేలో వివిధ దేశాలకు చెందిన 27 ఏళ్ల పురుషులు, 26 ఏళ్ల మహిళలు పాల్గొన్నారు.