ఒక తరాన్ని ప్రభావితం చేసిన ‘లిటిల్ ఉమెన్‌’

 

 

నవంబరు 29, 2016- ఉదయాన్నే లేచి గూగుల్‌ని తెరిచినవారందరికీ ఒక వింత డూడుల్‌ కనిపించింది. ఏదన్నా ప్రత్యేక సందర్భాన్ని గుర్తుచేసేందుకు గూగుల్‌ సెర్చ్‌ మీద కనిపించేడాన్ని డూడుల్‌ అంటారు. ఇంతకీ ఆ రోజున కనిపించిన డూడుల్ దేని గురించా అని వెతికిన వారికి అది ‘లిటిల్‌ ఉమెన్‌’ అనే పుస్తకం రాసిన రచయిత్రి గురించని తేలింది. ఆమె పేరే ‘లూసియా మే ఆల్కట్‌’.

 

ఈ రోజుల్లో స్త్రీవాదానికి సంబంధించిన రచనలు చేయడం అసాధ్యం కాకపోవచ్చు. వాటిని చదివే వారూ, చదివి ఆదరించేవారికీ ఏ లోటూ లేదు. కానీ దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం స్త్రీవాదానికి సంబంధించిన భావాలను అక్షరబద్ధం చేయడం, తన భావాలకు అనుగుణంగా జీవించడం అనే అంశాన్ని ఊహించడం కూడా కష్టంగానే ఉంటుంది. అలాంటి రచయిత్రి కావడం వల్లే లూసియా తొలితరం స్త్రీవాద రచయిత్రులలో ఒకరుగా మిగిలిపోయారు.

 

 

1932, నవంబరు 29న అమెరికాలోని ఫిలడెల్ఫియా అనే నగరంలో జన్మించారు లూసియా. లూసియాతో కలుపుకొని వారి తల్లిదండ్రులకి నలుగురు కూతుళ్లు. వారి కుటుంబానికి ఓ చిత్రమైన ప్రపంచం. లూసియా తల్లిదండ్రులు ‘ట్రాన్స్‌డెంటలిస్ట్‌ మూమెంట్‌’ అనే ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండేవారు. ప్రతి మనిషిలోనూ మంచితనం ఉంటుందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మంచితనాన్ని కాపాడుకునేలా జీవించాలనీ చెబుతుంది ఈ ‘ట్రాన్స్‌డెంటలిస్ట్‌ మూమెంట్‌’. ఈ ఉద్యమం మీద హైందవ మత ప్రభావం చాలా ఎక్కువ.

 

 

తల్లిదండ్రుల ఆదర్శాల మధ్యా, అక్కాచెల్లెళ్ల అనుబంధాల మధ్యా పెరుగుతున్న లూసియాకి మొదటి నుంచీ రచన అంటే చాలా ఇష్టంగా ఉండేది. దానికి తోడు ‘ట్రాన్స్‌డెంటలిస్ట్‌ మూమెంట్‌’లో ఉన్న ఎమర్సన్‌, థోరో వంటి ప్రముఖ రచయితలతో ప్రత్యక్ష పరిచయాలు కూడా ఆమెకు సాయపడ్డాయి. తన మనసులో మెదిలిన ప్రతి భావానికీ అక్షరరూపం ఇచ్చేందుకు లూసియా ప్రయత్నించేది. వేర్వేరు కలం పేర్లతో కథలు, వ్యాసాలు, నవలలు రాయడం మొదలుపెట్టింది. ఆదర్శాల హోరులో పడి కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంతో తన వంతు సాయంగా లూసియా చిన్నా చితకా ఉద్యోగాలు చేయసాగింది. ఏం చేసినా రచనలు మాత్రం కొనసాగించేది. ప్రతి సందర్భాన్నీ ప్రశ్నించి, ప్రతి అణచివేతనీ ధిక్కరించే లూసియాకీ ఆమె తండ్రికీ మధ్య గొడవలు మొదలైనా కూడా... ఆమె తలవంచడం నేర్చుకోలేదు. ఇటు ఆర్థికంగానూ, అటు కుటుంబ సమస్యలతోనూ ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపు వచ్చినా కూడా... సాహిత్యమే ఆమెకు జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యాన్నిచ్చింది.

 

1861- బానిసత్వం మీద తలెత్తిన అభిప్రాయ బేధాలతో, అమెరికాలోని రాష్ట్రాలన్నీ రెండు విడిపోయిన కాలం. ఆ సమయంలో చెలరేగిన అంతర్యుద్ధంలో లూసియా నర్సుగా పనిచేసింది. బానిసత్వం గురించీ, ఆసుపత్రుల నిర్వహణా లోపాల గురించి కుండబద్దలుకొట్టినట్లుగా రాసింది. దాంతో లూసియా రచనలలోని నిజాయితీ, స్పష్టత జనానికి తెలియడం మొదలైంది. ఇక 1868లో లూసియా రాసిన ‘లిటిల్ ఉమెన్’ అనే నవల అయితే అమెరికన్‌ సాహిత్యంలో ఓ సంచలనంగా నిలిచిపోయింది.

 

 

నలుగురు అక్కాచెల్లెళ్ల జీవితాల చిత్రణే ‘లిటిల్ ఉమెన్’. ఇది పేరుకి మాత్రమే ఓ కాల్పనిక నవల. కానీ అందులోని పాత్రలన్నీ లూసియా చుట్టూ ఉన్నవే. తన చిన్నతనంలో పెరిగిన వాతావరణాన్నీ, ఎదుర్కొన్న సంఘటనలనీ చిన్నపాటి మార్పులూ చేర్పులతో పాఠకుల ముందు ఉంచింది లూసియా. లిటిల్‌ ఉమెన్ నవల ఊహించని విజయాన్ని సాధించడంతో దానికి కొనసాగింపుగా మరో రెండు నవలలు రాసింది లూసియా. వేర్వేరు మనస్తత్వాలు ఉన్న నలుగురు అక్కాచెల్లెళ్ల జీవితాలు ఎలా సాగాయో తెలిపే కథనమే ఈ పుస్తకాలలోని నేపథ్యం. ఇందులోని ‘జో’ పాత్ర స్వయంగా లూసియాదే! కాకపోతే నవలలో ‘జో’కి పెళ్లవుతుంఉది. లూసియా మాత్రం ఆజన్మం వివాహం చేసుకోలేదు.

 

ఒక తరం అమెరికా ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన పుస్తకంగా లిటిల్‌ ఉమెన్‌ను పేర్కొంటారు. తనదైన వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకోవడం, తనను తాను మలచుకుంటూ కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం... అంతస్సూత్రంగా సాగే లిటిల్‌ ఉమెన్ ఆనాటి స్త్రీలకి ఒక చెదిరిపోని ఆశని అందించింది. ఇప్పటికీ లిటల్‌ ఉమెన్‌ అమెరికా ప్రజలకి ఇష్టమైన 10 పుస్తకాలలో ఒకటిగా నిలుస్తోంది. స్త్రీవాదానికి సంబంధించిన తీక్షణమైన భావాలు ఇందులో లేకపోయినా... స్త్రీ హృదయానికి దగ్గరగా ఉండే భావోద్వేగాలను అక్షరబద్ధం చేయడంతో తరాలు గడిచినా కూడా ఆంగ్ల సాహిత్యంలో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరుచుకొంది.

 

- నిర్జర.