లోపలకెళ్ళిన తరణి పరుగెత్తుకు వచ్చింది.

 

    అప్పుడే వరండాలో ష్యూస్ తొడుక్కుంటున్న ఆనందం దడుచుకున్నాడు.

 

    అంతా జరిగాక అప్పుడు భువనేశ్వరీదేవి చెట్టు చాటునుంచి ఔట్ హౌస్ దగ్గరకొచ్చింది.

 

    "అరిచింది మీరా తల్లీ...? ఇంకా నయం..." అంటూ కోపంగా చూశాడు ఆనందం.

 

    "ఆ... నేనే... అదేంటమ్మాయ్... మీ ఆయనకేం యివ్వకుండా పంపిస్తున్నావ్?" అంది తరణికేసి చూస్తూ.

 

    తరణికి ఓ క్షణం ఏం అర్ధం కాలేదు.

 

    "టిఫిన్ బాక్స్ యిచ్చాను గదా ఆంటీ..." అంది తరణి తేరుకుంటూ.

 

    "అప్పుడప్పుడు పుస్తకాల్లో చదువుతుంటాన్లే... ఆఫీస్ కెళ్ళే భర్తకి, భార్య సాగనంపే ముందు ఒకటిస్తుందట. సాయంత్రం ఇంటికి క్షేమంగా తిరిగి రావటం కోసం" నవ్వుతూ అంది.

 

    "ఏమిటిస్తుంది నా బొంద... గోతికాడ మట్టి పెడ్డేదన్నా ఇవ్వదు? ఇది చెప్పటానికి పాకిస్తానోడు బాంబు ఎత్తుకొని మీ మీద కొస్తున్నంత లెవెల్లో అరవాలా? దడుచుకు చచ్చాను. అసలు మీ ఇంట్లోకి వచ్చిన దగ్గర్నుంచీ ఇంతే... ఇక్కడ ఎవరు ఎలా ప్రవర్తిస్తారో... ఎవరు నిజం చెబుతారో... అసలేది నిజమో తెలీక పిచ్చెక్కి చస్తుంటే మధ్యలో ఈ కేకలొకటి..." అంటూ విసుక్కున్నాడు ఆనందం.

 

    ఆమె ఆనందం మాటల్ని ఏమాత్రం పట్టించు కోలేదు. "చెప్పు... అదేమిటో...?" తిరిగి అడిగింది భువనేశ్వరీదేవి.

 

    తరణికి అర్థంకాక ఆంజనేయులికేసి ప్రశ్నార్ధకంగా చూసింది.

 

    ఆంజనేయులు కళ్ళు తేలేశాడు.

 

    తరణి నిస్సహాయంగా భువనేశ్వరీదేవి కేసి చూసింది చెప్పమన్నట్లుగా.

 

    "నాకు సిగ్గేస్తోంది... ఈ కాలం పిల్లలుక్ మా కాలం వాళ్ళు చెప్పాలా? విడ్డూరం కాకపోతే..." అంది భువనేశ్వరి ముసిముసిగా నవ్వుతూ.

 

    దాంతో ఆనందానికి చిర్రెత్తుకొచ్చింది.

 

    "విడ్డూరమే... మీ కిలాంటి కోరికలు కలగటం విడ్డూరమే... వేరేవాళ్ళ మీద పెట్టి తీర్చుకోవటమూ విడ్డూరమే..." అన్నాడు ఆనందం అసహనంగా.

 

    "మాట్లాడితే నువ్వు ముందుకొచ్చావంటే నీ డొక్క చీరేస్తాను... నువ్వు నోర్ముయ్..." ఆనందాన్ని కసురుకుంది భువనేశ్వరి.

 

    కొంపదీసి తమ మీద అనుమానం వచ్చిందా? ఆంజనేయులికి చొక్కా తడిసిపోయింది భయంతో.

 

    "ముద్దు ఇచ్చి పంపిస్తారట..." అంది భువనేశ్వరి సిగ్గుతో.

 

    "ముద్దా...!?" అంటూ మిగతా ముగ్గురూ ఒక్కసారి తెల్లబోయారు.

 

    "మరే..." అందామె తన్మయంగా.

 

    "కడుపుతో ఉన్నవాళ్ళకి వేవిళ్ళ కోరికలు పుట్టికొచ్చినట్లు ఈ దిక్కుమాలినవన్నీ పుట్టుకొస్తున్నాయేం పిన్నిగారూ?" అన్నాడు ఆనందం కసిగా.

 

    ఆనందం కేసి పీక పిసికి చంపేంత గుర్రుగా చూసింది భువనేశ్వరి.

 

    తరణికి, ఆంజనేయులికి ఇద్దరికీ ఇబ్బందిగా వుంది ఆ సందర్భం. కాదంటే ఆమెకి అనుమానం... అవుననుకుంటే తప్పు... ఎలా...?

 

    తరణి మెదడులో ఫ్లాష్ లా ఓ ఐడియా...

 

    తరణి చరచరా వెళ్ళి, ఆంజనేయులి చేయి పట్టుకొని అక్కడే వున్న ఓ చెట్టు చాటుకి తీసుకెళ్ళింది.

 

    "ఇవ్వనా?" అంది మెల్లగా తరణి చిలిపిగా కన్ను గీటుతూ.

 

    ఆంజనేయులు ఆగిపోయాడు ఆమె చొరవకి.

 

    నాలిక కొనతో తన పెదాల్ని స్పృజించుకుంటూ కవ్వింపుగా చూసింది.

 

    ఆంజనేయులి కళ్ళల్లో ప్రేతకళ....

 

    "బుద్దూ... మిమ్మల్నెవరూ బాగు చేయలేరు..." అని తనే పెద్దగా శబ్దం వచ్చేలా తన పెదాల్ని కదిలించింది.

 

    "వామ్మో... వామ్మో... కొంప మునిగిందిరా దేవుడో..." ఆ సౌండ్ వింటూనే అరిచి క్రింద పడిపోయాడు ఆనందం.

 

    భువనేశ్వరీదేవి నవ్వుకుంటూనే వెళ్ళిపోయింది.

 

    ఆంజనేయుల్ని వెక్కిరిస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది తరణి.

 

    దెయ్యం పట్టిన వాడిలా అలానే చూస్తుండిపోయాడు ఆనందం.

 

    అసలేం జరుగుతోందో... జరగబోతోందో తెలీని అయోమయంలో బయటకు నడిచాడు ఆంజనేయులు.  


                            *    *    *    *


    ఆఫీస్ ఆవరణలోకి ఎంటరవుతుండగానే పల్లెటూరి పంచె కట్టు వ్యక్తి ఏడుపు మొహంతో ఎదురొచ్చి ఏదో చెప్పాడు.

 

    దాంతో ఆంజనేయులి మొహం కళాహీనమయిపోయింది.


                                                 *    *    *    *


    ఆఫీసులోకెళ్ళి తన సీటులో కూర్చున్న అరగంటకిగాని ఆంజనేయులు మనిషి కాలేకపోయాడు.

 

    అంతలో వచ్చింది మేరీ-

 

    వాళ్ళిద్దర్నీ గమనిస్తూ అప్పలరాజు బావమర్ది ఓ స్తంభం మాటున నించున్నాడు. అతనికి ఎప్పట్నుంచో మేరీ అంటే తగని మోజు... తగని ప్రేమ...

 

    మేరీకేమో ఆంజనేయులి మీద ఆపేక్ష.

 

    మేరీ ఏదో అడుగుతోంది....

 

    ఆంజనేయులు అన్యమనస్కంగానే ఏదో సమాధానాలిస్తున్నాడు...

 

    అంతలో ఆంజనేయులికి బాస్ రూమ్ నుంచి కబురొచ్చింది.

 

    హడావిడిగా లేచాడు ఆంజనేయులు.

 

    బాస్ ని అప్పడిగితే...? వుహు... లాభం లేదు. ఇచ్చినా పాతిక వేలెలా ఇస్తాడు?

 

    "నా సంగతి నీకు బాగా తెలీదు.. మేరీని దూరంగా ఉంచకపోతే, నీ ఉద్యోగం ఊడబీకించడమే కాదు.. ఏదయినా చేస్తాను" అని బెదిరించాడు మెల్లగా అప్పలరాజు బావమర్ది.

 

    అసలే కష్టాల్లో వున్న ఆంజనేయులు ఆ మాటలకి బెదిరిపోయి, బేలగా చూశాడు.

 

    లోపలకెళ్ళిన ఆంజనేయులి చేతికి అప్పలరాజు పాతిక వేలిచ్చి... "పార్వతీశం అని నా ఫ్రెండొకరున్నారు. వాడికి ఈ డబ్బిచ్చి రావాలి. అడ్రస్ ఆ డబ్బుతో పాటే వుంది..." అన్నాడు అప్పలరాజు సితారలోని అక్షరం కూడా వదిలిపెట్టకుండా చదువుతూ.

 

    అలాగే అని చెప్పి డబ్బు జేబులో పెట్టుకొని బయలుదేరాడు ఆంజనేయులు.


                                                 *    *    *    *