నాకేం జరిగింది? నాకేం జరిగింది?"

 

    ఆమె  మళ్లీ సొమ్మసిల్లిపోయింది.

 

    అది సృష్టికి మొదలు అయినా కావచ్చు అంతమైనా కావచ్చు. సముద్రాలు పొంగుతున్నాయి. అరణ్యాలు అకాశమెత్తున పెరిగాయి. పెనుగాలులు వీస్తున్నాయి. ఎడారుల్లో యిసుక ఉవ్వెత్తున లేచి ఇష్టం వచ్చిన రీతిగా యెగిరిపోతోంది.

 

    చిరిగిపోయిన దుస్తులతో, చెదిరిన శిఖలుగా వ్రేలాడుతూన్న జుట్టుతో, పెరిగిన గడ్డంతో, రక్తసిక్తమైన కాళ్ళతో నడిచివెళ్ళిపోతున్నాడు ఓ పధికుడు.

 

    అతన్ని సమీపించాలని వేదితా తాపత్రయపడుతూ వేగంగా వెన్నంటుతోంది. ఎంత పరిగెత్తినా, అలసిపోయి చెమటలు గ్రక్కుతున్నా, ముళ్ళూ, రాళ్ళూ గుచ్చుకుని పాదాలు రక్తసిక్తమవుతున్నాయే గాని అందటం లేదతను.

 

    ఆఖరి క్షణం వరకూ ప్రయత్నించింది. ఇహ ఆమెలో శక్తి ఉడికిపోయింది. ఎలాగో, ప్రాణాలన్నీ కూడదీసుకుని "కళ్యాణ్" అని అరిచింది.

 

    ఆ పిలుపు అతనికి చేరింది వెనక్కి తిరిగి చూశాడు. ఆశ్చర్యంతో కళ్లుపెద్దవైనాయి. ఏమీ తొట్రుపాటు లేకుండా మెల్లగా వెనుదిరిగి వచ్చి ఆమెను సమీపించాడు.

 

    "ఎవరు కావాలి మీకు?"

 

    "నువ్వే? నువ్వు నా కల్యాణ్ వి. ఎందుకు మారిపోయావు?"

 

    "మీరెవరో నాకు తెలియదు. నాపేరు కల్యాణ్ కాదు. నన్ను వెళ్ళనివ్వండి."

 

    ఆమె ఆతృతతో అతని చెయ్యి పట్టుకుంది. కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి. "ఉహు! నిన్ను కలుసుకుందామని ఎన్నో ప్రపంచాలు తిరిగి యిక్కడికి వచ్చాను. ఎలాగో కలుసుకున్నాను. ఇహ విడిచిపెట్టను" అంది.

 

    అతనేం మాట్లాడలేదు.

 

    "నా అవస్థ చూడు. నేనెంతగా నలిగిపోయానో చూడు. నన్ను చూస్తే జాలి వేయటంలేదూ?" ఆమె దీనంగా అడిగింది.

 

    "మీరెవరో తెలియకుండా, మీరెవరికొరకో అన్వేషిస్తూంటే మిమ్మల్ని చూసి జాలి ఎందుకు? మీరు చాలా దారుణంగా పొరబడ్డారు. నన్ను గురించి వెదికేవారు ఈ విశాల విశ్వంలో ఎవ్వరూలేరు. నాకెవరూ లేరు. నేను వొంటరి వాడ్ని" అతను చెప్పుకుపోతున్నాడు.

 

    "నేనున్నాను!" మధ్యలో ఆపుతూ అంది ఆమె "నేను వేదితను గుర్తుపట్టలేదా?"

 

    అతను తల అడ్డంగా ఊపుతూ "ఉహు. ఎప్పుడూ చూడనుకూడా చూడలేదు మిమ్మల్ని. క్షమించండి ఇప్పటికే నాకు వేళాతీతమైంది. మీతో అనవసర ప్రసంగం చేస్తూ నా కాలాన్ని వృధా చేసుకోలేను. సెలవు" అంటూ అతను బలవంతంగా ఆమె చెయ్యి విడిపించుకుని ఆమెవంక చూడనైనా చూడకుండా ముందుకు వెళ్ళిపోయాడు.

 

    "అంతేనా?" అనుకుంటూ హతాశురాలై, నిస్పృహగా వెళ్ళిపోతూన్న అతని వంకే చూస్తూ నిలబడింది. అతనసత్యమాడుతున్నాడు. ఆ మూర్తి కల్యామమూర్తే. సందేహంలేదు. కాని అతన్నాపే శక్తి తనకు లేదు.

 

    అతను ముందుకు వెళ్ళిపోతున్నాడు. దూరమైపోతున్నాడు. అంతకంతకూ కనుమరుగౌతున్నాడు.

 

    అభాగినిలా చూస్తోంది ఆమె.


    ఇంతలో అతను "వేదితా!" అని పెద్ద గావుకేక పెట్టాడు. ఏదో మాయ జరిగినట్లు అతని రూపం కళ్ళముందు నుండి అదృశ్యమైపోయింది.

 

    "అయ్యో!" అనుకుంది. ఆమెకు ఎక్కడలేని బలమూ వచ్చింది. "కల్యాణ్!" అని అరుస్తూ ముందుకు పరిగెత్తింది.

 

    అట్లా పరుగిడి అతను అదృశ్యమైన ప్రదేశం చేరుకున్నాక ఎవరో వెనక్కి లాగినట్లు ఆమె హఠాత్తుగా ఆగిపోయింది. పాదాల క్రింద అగాధం లాంటి గొయ్యి ఉంది.

 

    అందులోకి చూసేసరికి, అతను ఎక్కడో అడుగున మసగ్గా నలుసులా గోచరిస్తున్నాడు ఆ నూతిలో.

 

    "వేదితా! నువ్వు వచ్చావా?" అంటున్నాడు లోపలినుండి. అతడి కంఠం వినిపించీ వినిపించనట్లు వినిపిస్తోంది.

 

    "వచ్చాను కల్యాణ్! నీ కోసం వచ్చాను. రా త్వరగా పైకిరా. తనివితీరా నీలో కరిగిపోనియ్యి."

 

    "ఉహు! లాభంలేదు వేదితా! ఎటుచూసినా అయోమయంగా ఉంది. పైకి వచ్చే మార్గం కనబడటం లేదు".

 

    "ఎలా కల్యాణ్! నిన్ను విడిచి ఉండలేకపోతున్నాను. వచ్చెయ్యి, వచ్చెయ్యి."

 

    "దారిలేదు వేదితా!" నాకీ తావునుంచి విముక్తిలేదు. ఇక్కడే చివికి చివికి అంతమొందిపోవలసిందే"

 

    "అలాగనకు కల్యాణ్! నేను భరించలేను."

 

    "వేదితా! నా కిక్కడ చాలా భయంగా వుంది. ఊపిరి సలపటంలేదు."

 

    "కల్యాణ్! కల్యాణ్! నీ కోసం నన్నేం చేయమంటావు చెప్పు? వెంటనే చేస్తాను.

 

    "ఇక్కడేవో దుష్ట శక్తులు నన్ను చుట్టుముట్టుతున్నాయి. బాధిస్తున్నాయి - చంపేస్తున్నాయి."

 

    "అయ్యో! నా కల్యాణ్! ఎంత బాధపడిపోతున్నావు? ఇదిగో నేనుకూడా వచ్చేస్తున్నాను. దూకేస్తున్నాను."

 

    "వద్దు వేదితా! ఇక్కడ దుష్టశక్తులు నిన్నుకూడా చంపేస్తాయి. రావద్దు.'

 

    "నిన్ను విడిచి నేను ఉండలేను. వస్తున్నాను."