"వీరేశలింగంగారి వితంతు వివాహాలకి వ్యతిరేకంగా ఓ మహిళ తెలుగు పత్రికని నడిపించింది. ఆ పత్రిక పేరు...ఆ మహిళ పేరు?" చెప్పలేకపోయాడు రోహిత్.
    
    నిమిషం గడువు తీరిపోవడంతో ఆదిత్య జవాబు చెప్పాడు "పత్రిక పేరు సావిత్రి... పత్రిక నడిపిన మహిళ పేరు పులుకూర్తి నరసమాంబ"
    
    టెన్షన్ గా చూస్తూంది ప్రణయ. గడిచిన ఏడు నిమిషాలలో ఆదిత్య అడిగిన చాలా ప్రశ్నలకి రోహిత్ జవాబు చెప్పలేకపోయింది ఒకే ఒక్క దానికి.
    
    "విజయనగర రాజుల కాలంలో ఆంధ్రాను దర్శించిన ఇటలీ యాత్రికుడెవరు?"
    
    అరనిమిషం తర్వాత అన్నాడు రోహిత్.... "నికోలే కాంటె."
    
    "అల్లూరి సీతారామరాజు ఆధ్వర్యంలో చింతపల్లి పోలీస్ స్టేషన్ పై ఏ సంవత్సరం దాడి జరిగింది?"
    
    "అబ్సర్డ్" అరిచాడు రోహిత్. "చింతపల్లి, సబ్బవరం గురించి ప్రశ్నలు అడగడం అన్యాయం."
    
    ఆవేశపడలేదు ఆదిత్య. మృదువుగానే అన్నాడు. "మైలు పొడవులో అంగుళాల్నీ, వందేళ్ళలో ఆదివారాలనీ అడిగిన మీరు ఓ స్వాతంత్ర సమరయోధుడి చరిత్రకి సంబంధించిన ప్రశ్న విషయంలో ఇలా రియాక్ట్ కావడము న్యాయంగా లేదు."
    
    "అదికాదు..." ఎలా తన వాదాన్ని సమర్ధించుకోవాలో తోచడం లేదు రోహిత్ కి..."ప్రశ్నలు రెలవెంట్ గా వుంటే బాగుంటుందని నా అభిప్రాయం."
    
    "మిస్టర్ రోహిత్....! నేను అడుగుతున్నది రెలవెంట్ గా వుండే ప్రశ్నలే. మీరు ప్రస్తుతం వుంటున్నది బ్రిటన్ లో అయితే, తెలుగువాడిగా బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాడిన సీతారామరాజు గురించి మరో తెలుగు వ్యక్తిగా మీరు తెలుసుకోవడం న్యాయం ఈ ప్రశ్నకి జవాబు 22 ఆగస్టు 1922"
    
    "ప్రొసీడ్....!" అసహనంగా అన్నాడు రోహిత్.
    
    "ఓ.కే! మీ పద్ధతిలోనే అడుగుతాను...." ఇందాక రోహిత్ ప్రయోగించిన మేథమెటిక్స్ ని మననం చేసుకుంటూ అడిగాడు ఆదిత్య.
    
    "ఒక రూపాయిని ఏభయ్ నాణేలుగా విభజించడమెలాగో చెప్పండి. రెండు పైసల నాణేన్ని వాడకూడదు."
    
    కష్టమయిన ప్రశ్నకాదు కాని రెండు పైసల నాణెం వాడకూడదనే సరికి కొంచెం ఇబ్బందిగా వుంది. అదీ కష్టంకాదు. అయినా ఒక నిమిషం గడువు చాల్లేదు.
    
    "నిమిషం అయిపోయింది" ప్రణయ చెప్పింది కొద్దిపాటి వుక్రోషంతో.
    
    ఆదిత్య జవాబు చెప్పాడు. "నలభై అయిదు ఒక పైసా నాణేలు, రెండు అయిదు పైసల నాణేలు, రెండు పదిపైసల నాణేలు, ఒకటి ఇరవై అయిదు పైసల నాణెం.... మొత్తం ఏభయ్ నాణేలు."
    
    "ఓ.కే." అంగీకరించాడు రోహిత్.
    
    "ఓ. 'జూ' లో పక్షులు, జంతువులు ఎన్ని వున్నాయి అని అడిగిన ప్రశ్నకి ముఫ్ఫై తలలున్నాయి, వంద కాళ్ళున్నాయి అన్న జవాబు వచ్చింది జూ ఇన్ ఛార్జి నుంచి చెప్పండి పక్షులెన్ని, జంతువు లెన్ని?"
    
    ముఫ్ఫై తలలూ, వంద కాళ్ళూ.    
    
    సగందాకా రోహిత్ ఆలోచించేసరికి ఓ నిముషం గడువు పూర్తయింది. "చెప్పండి జవాబు..." అన్నాడు రోహిత్.
    
    "పక్షుల సంఖ్య పది, జంతువుల సంఖ్య ముఫ్ఫై"
    
    "ఎలా?"
    
    వివరించాడు ఆదిత్య "జంతువుల సంఖ్య 'ఏ' గా పక్షుల సంఖ్య 'బి' గా ఊహించుకుంటే మొత్తం తలలు ఏ ప్లస్ బి ముఫ్ఫై అవుతుంది."
    
    అలాగే పక్షుల కాళ్ళను రెండుగా, జంతువుల కాళ్ళు నాలుగుగా అనుకుంటే 4ఏ ప్లస్ 2బి విలువ వంద. ఆ రెండు ఫార్ములాల్ని సింప్లిఫై చేస్తే ఫలితం వస్తుంది."
    
    "ఇదంతా ఓ నిమిషం వ్యవధిలో తేల్చుకునేది కాదు."
    
    "ఆ విషయం ఇందాక ప్రశ్నల్ని అడిగేటప్పుడు మీరూ ఆలోచించి వుండాల్సింది మిస్టర్ రోహిత్!"
    
    "ఇది అన్యాయం"
    
    నవ్వేశాడు ఆదిత్య "తెలుగు చరిత్ర అడగొద్దంటున్నారో పక్క లెక్కలు అడక్కూడదు..... మరి నేనేం అడగాలి?"
    
    రోహిత్ జవాబు చెప్పకముందే ఆదిత్య అడిగాడు "ఆల్ ఫ్రైడ్ హిచ్ కుకింగ్ అంటే? అర్ధం చెప్పండి."
    
    "వాట్?" రోహిత్ నొసలు చిట్లించాడు.
    
    అతనికి బాగా తెలిసింది ఆల్ ఫ్రైడ్ హిచ్ కాక్.
    
    "దీనికి అర్ధం లేదు."
    
    "అలా అని మీరంటే సరిపోదు మిస్టర్ రోహిత్! ఇది డిక్షనరీలో కనిపించే పదం కాదు. ఇందాక మీరడిగేరే స్నిగ్నెట్.... అలాంటిదే యిదికూడా."
    
    నిముషం అయిపోయింది.
    
    "చెప్పండి మీరే...." రోహిత్ నుదుట స్వేదాన్ని తుడుచుకుంటూ అన్నాడు.
    
    "వెజిటెబుల్స్ పాత్రలో ఉడకబెట్టేటప్పుడు అవి ముద్దగా మారితే తొందరగా ఉడకాలని ఆ ముద్దని కత్తిలాంటి గరిటెతో పొడవటం."
    
    ఆశ్చర్యంగా చూస్తున్నాడు రోహిత్.
    
    "అనుమానించనక్కరలేదు. కావాలంటే మీరు తరువాత వెరిఫై చేసుకోవచ్చు"
    
    ప్రణయ మనసు తేలికపడింది.
    
    ఆదిత్య తను అనుకున్నంత అమాయకుండేం కాదు.
    
    రోహిత్ లాగే తనూ అవసరాన్నిబట్టి ఓ యుద్దనీతిని అనుసరిస్తున్నాడు.
    
    అడిగిన పదహారు ప్రశ్నలలో ఇప్పటికే అయిదింటికి జవాబు చెప్పలేక పోయిన రోహిత్ మొహంలో ఉక్రోషాన్ని చూస్తుంటే ప్రణయకి ఆనందంగా వుంది.
    
    "పదిహేను నిముషాలు పూర్తయింది" గుర్తుచేసింది ప్రణయ.
    
    ప్రశ్నలు ఎక్కువ సంఖ్యలో అడిగిన ఆదిత్యకి బోధపడిపోయింది మిగిలిన పావుగంటలో ప్రశ్నల సంఖ్య పెరగడం తప్పనిసరి.