"మరా ఫోటో ఏంటి? ఆ స్టూడియోలో నీ ఫోటో ఎలా వుంది? అది నా చేతుల్లోకి ఎలా వచ్చింది?" ఆనందంకి తిరిగి అనుమానం వచ్చింది.

 

    "ఒకసారి మా తాతయ్య, నేను, కాశీబాబు ఈ సిటీకొచ్చాం. అప్పుడు తాతయ్య తన సరదా కోసం నా ఫోటో తీయించారు. అది నీ చేతుల్లోకెలా వచ్చిందో నాకు తెలీదన్నయ్యా... నన్ను నమ్ము..." అంది కళ్ళు తుడుచుకుంటూ.

 

    "మా బిడ్డని మేం నమ్మకపోతే ఎవరు నమ్ముతారమ్మా? హరిహరదాసులే అడ్డుపడినా నిన్ను మానుంచి ఎవరూ వేరుచేయలేరు..." అంది భువనేశ్వరీదేవి తరణిని గుండెలకు హత్తుకుంటూ.

 

    "ఆ వీలునామాలో..." ఆమె మాటల్ని భుజంగరావు మధ్యలోనే కట్ చేశాడు.

 

    "మాకు అంతా తెలుసమ్మా! నీకు పెళ్ళి కాలేదు పంపించమంటే పంపించమని, పైగా పోలీసులకి కంప్లైంట్ యిస్తామని, అయిందని అబద్ధం ఆడాడు అప్పటికప్పుడు. అప్పటికి నువ్వెవరివో వాడికి తెలుసు మాకు తెలీదు. మాకిప్పుడే తెలిసింది" అన్నాడాయన ఆనందబాష్పాల్ని తుడుచుకుంటూ.

 

    ఈసారి తరణికి ఆశ్చర్యమేసింది.

 

    తనెవరో ఇప్పుడు తెలియటమేమిటి?!

 

    "నువ్వెక్కడికి రావాలో అక్కడికే వచ్చావమ్మా! ఈ బంగ్లా, ఈ ఆస్తీ అంతా నీదేనమ్మా! నీ కోసం సంపాదించిందే తల్లీ" ఆప్యాయంగా తరణి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది భువనేశ్వరీదేవి.

 

    తరణి మరింత ఆశ్చర్యపోయింది.

 

    ఈ బంగ్లా తనదా? ఈ ఆస్తి తనదా? తన కోసం సంపాదించిందా?

 

    "వద్దాంటీ! ఆస్తి మూలంగానే నేను ఇలా పారిపోయి వచ్చి తల దాచుకోవలసి వచ్చింది. ఆస్తి కోసమే ఆ శ్రీనివాసరావు నన్ను బలవంతముగానయినా తన కోడల్ని చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు..." అంది భయపడుతూ ఆమె.

 

    "ఇప్పటికయినా అసలు విషయం చెప్పకపోతే తరణి కన్ ఫ్యూజ్ అవుతుంది. ఇప్పటివరకు మేం అయినట్లే" భువనేశ్వరీదేవితో అని తరణి వేపు తిరిగాడు ఆంజనేయులు.

 

    "నువ్వెవరివో కాదు తరణీ! ఈ పుణ్య దంపతులకు బిడ్డవు నీ తల్లిదండ్రులు... మీ తాతగారు చెప్పినట్లు, ఆ శ్రీనివాసరావు చెప్పినట్లు చనిపోలేదు. ఎన్నో యేళ్ళుగా నీ రాక కోసం తపించిపోతూ ఎదురుచూస్తున్న నీ తల్లిదండ్రులే వీళ్ళు" అన్నాడు.

 

    తరణి కళ్ళు ఆనందంతో తడిదేరాయి.

 

    ఒక్కక్షణం ఆమెకు ప్రపంచమే అండగా నిలిచినట్టనిపించింది. కష్టాలన్నీ ఒక్కసారి తుడిచిపెట్టుకుపోయినట్లనిపించింది.

 

    "అంతా మన మంచికే జరిగింది ఇప్పటివరకూ...! ఎంత గొప్ప యాదృచ్చికం?! తెలీకనే మీ అమ్మాయి వెతుక్కుంటూ మీ యింట్లోకే రావటము... మిమ్మల్నే రక్షించమని కోరటం... మీరు తెలీకనే మీ అమ్మాయికి ఆంజనేయుల్లాంటి మంచి కుర్రాడ్ని ఎన్నుకోవటం అంతా ఘటన... దైవ ఘటన... మనం కాసేపు ప్రస్తుతానికొస్తే మంచిది. శ్రీనివాసరావు మీ అమ్మాయిని తన కోడలని చెప్పటం వెనుక ఆస్తిని కాజెయ్యాలనే దురుద్దేశ్యం వుంది. దాంట్లో అనుమానం లేదు.

 

     శ్రీనివాసరావు మీరు చెప్పిన దాన్ని బట్టి పెద్ద జాకాల్ అనిపిస్తోంది. అలాంటివాడు తన వాదన బలంగా వుండేందుకు ఏవో సాక్ష్యాధారాలు సేకరించే వుంటాడు. ముందు వాటి గురించి మనం ఆలోచించాలి. ఆపైన తరణికి, ఆంజనేయులికీ పెళ్ళి చేసేయాలి. అది చాలా ముఖ్యం" అన్నాడు గురుమూర్తి సాలోచనగా.

 

    అక్కడున్న అందరికీ అది నచ్చింది.

 

    వెంటనే ఆ పనుల్లో పడిపోయారు.


                                                    *    *    *    *


    ఉదయం సరిగ్గా ఎనిమిది గంటలకు శ్రీనివాసరావు నుంచి భువనేశ్వరీదేవికి ఫోన్ వచ్చింది.

 

    "హలో! వీరనారీ... రుద్రమదేవీ... ఏం నిర్ణయించుకున్నావు? మా కోడల్ని మా దగ్గరకు పంపించేయాలనుకున్నావా? లేక యుద్ధానికి దిగదల్చుకున్నావా?" నవ్వుతూ అన్నాడు ఫోన్ లో శ్రీనివాసరావు.

 

    భువనేశ్వరీదేవిలో కోపం సర్రున పొంగుకొచ్చింది.

 

    "నీకింకా బుద్ధి రానట్లుంది. వచ్చేలా చేస్తాను. తరణీ ణీ కోడలు కాదు, మా బిడ్డ మోహన! మా కూతురికి, కోతిగాడయిన నీ కొడుక్కి పెళ్ళయిందా? ఏం కలకంటున్నావా? పిచ్చివాడా! ఇప్పుడు... ఈ రోజు చేయబోతున్నాను. నా కూతురికి నచ్చినవాడితో, రంగరంగ వైభవంగా పెళ్ళి చేయబోతున్నాను. ఉంటాను" అంటూ రిసీవర్ ని విసురుగా క్రెడిల్ చేసింది భువనేశ్వరీదేవి.

 

    ఆవేశంలో ఆమె చేసిన తప్పది-ఆరోజు పెళ్ళి చేయబోతున్నట్లు బయటకు చెప్పటమే శ్రీనివాసరావుని ఎలర్ట్ చేసింది.


                                                *    *    *    *


    అందరూ పెళ్ళి ఏర్పాట్లలో ఊపిరి సలపకుండా వున్నారు.

 

    భుజంగరావయితే చిన్నపిల్లాడిలా పరుగులు పెడుతున్నాడు అటూ యిటూ.

 

    "మీరు పనులు చేయటం కన్నా, చేస్తున్నట్లుగా హడావిడి ఎక్కువ చేస్తున్నారేం అంకుల్?" తమాషాకి అన్నాడు ఆనందం.

 

    "పోరా జెడ్డి వెధవా! నా ఆనందం నీకేం తెలుసు?" కసురుకున్నాడు భుజంగరావు.

 

    "బాగా అన్నావు ఆనందం! పనికన్నా హడావుడి ఎక్కువ. ఉత్త హడావిడి మనిషి బాబూ! ఆయనతో పెట్టుకుంటే మనకి పనులు అవ్వవు కాని, కెమేరామేన్ వచ్చాడేమో చూడు. పనిలో పనిగా పూలదండలు వచ్చాయేమో కూడా చూడు. కళ్యాణ మండపం కట్టడం పూర్తయిందో లేదో చూడాలి" అంటూ భువనేశ్వరీదేవి పరిగెడుతున్నట్లుగా వెళ్ళిపోయింది.

 

    ఆ గుడి మొత్తం క్షణాల్లో పెళ్ళికి సిద్ధమైపోయింది.

 

    ఆంజనేయులి తరపున గురుమూర్తి పెద్దరికం వహించాడు.

 

    చకచకా పెళ్ళి ఏర్పాట్లు జరుగుతుండగా లోపల గదుల్లో గురుమూర్తి భార్యలిద్దరూ తరణిని ముస్తాబు చేస్తుంటే సుబ్రమణ్యం, మేరీ, అప్పలరాజు, ఆంజనేయుల్ని ముస్తాబు చేస్తున్నారు.

 

    క్రమంగా ముహూర్తం దగ్గర పడుతుండగా, బ్యాండుమేళం, పురోహితులు, భుజంగరావు బంగ్లా చుట్టూ ప్రక్కల వుండేవాళ్ళు రాసాగారు.