"ఇతనెవరో రోడ్డుమీద అడ్డంగా బండి ఆపి న్యూసెన్స్ చేస్తున్నాడు. వెంటనే రండి. నాన్నగారి దాకా ఈ గొడవ తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఓ.కే!" అని ఆఫ్ వ్హేసి సిద్దార్థ వైపు చూసింది.

 

    సిద్దార్థ మొహం ఎర్రబడింది.

 

    "ఇంతదానికి ఎందుకింత గొడవ?" అన్నాడు.

 

    "మరి నేను అడగగానే నువ్వు కారు తీసి ఉండవచ్చుగా!" అంది.

 

    "షిట్..." అని విసురుగా వెళ్ళి కార్లో కూర్చుని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు.

 

    "ఎక్కడికి పోతావు...నీ కార్ నెంబర్ పోలీస్ లకి చెప్పేశాను" నవ్వింది ఆ అమ్మాయి.

 

    ఆ అమ్మాయి తన కళ్ళకున్న గాగుల్స్ తీసి "ఆపద రాగానే హెల్ప్ కోసం చుట్టుప్రక్కలా చూడడం ఇంకా మానలేదన్నమాట! ఓ... ఆంధ్రదేశపు అచ్చతెనుగు ఆడపిల్లా... పద... కారెక్కు" అంది చిన్నగా నవ్వుతూ.

 

    "మీరూ..." అన్నాను. ఆ కళ్ళూ, ఆ బుగ్గల్లో నవ్వినప్పుడు పడే చిన్న చిన్న సొట్టలూ ఎక్కడో బాగా చూసినట్లే గుర్తు!

 

    "ఆముక్తా... ముందు కారెక్కమ్మా" అని నా చేతిని పట్టుకులాగింది.

 

    నేను మంత్రముగ్దలా ఆమె వెంట నడిచి కారెక్కాను. స్టీరింగ్ ముందు కూర్చుని, "సేఫ్టీ ఫిన్ కి ఆ పేరెందుకొచ్చిందో తెలుసా?" అంది.

 

    "ఎందుకూ?" ఆశ్చర్యంగా అడిగాను.

 

    "ఆడపిల్లకి సేఫ్టీ ఇవ్వడానికి అది తయారయింది కాబట్టి. శరీరానికి ఆచ్చాదన ఇచ్చే జాకెట్టుకి, పైటకీ పెట్టుకోవచ్చు...అవసరమైతే ఏడిపిస్తున్న మగవాడికి ఎక్కడైనా మూడో కంటికి తెలీకుండా కసుక్కున గుచ్చేయచ్చు...ఇంతకి సేఫ్టీ ఫిన్ దగ్గర పెట్టుకునే హాబిట్ లేదా?" అని అడిగింది.

 

    నాకు ఏదో స్ఫురించి "నువ్వు... నువ్వు లిల్లీవి కదూ!"

 

    "కాకపోతే నీకెందుకు పాఠాలు చెప్తానూ?" సీరియస్ గా అడిగింది.

 

    "లిల్లీ...నువ్వూ ఈ ఊళ్ళోనే ఉంటున్నావా?" నాకు నా చిన్ననాటి నేస్తాన్ని చూడగానే ఆ సమయంలో చెప్పలేనంత ఆనందం కలిగింది.

 

    "ఈ మధ్యే స్టేట్స్ నుండి వచ్చాను. సగటు భారతదేశపు ఆడపిల్లల పరిస్థితి ఏమీ మారలేదని నిన్ను చూస్తుంటే - ఇప్పుడే తెలిసింది" అంది.

 

    "ఆర్మీలోకి వెళ్తానన్నావు?" అన్నాను.

 

    "మరి ఎస్.పి.గారి అమ్మాయినన్నావు?" అనుమానంగా అడిగాను.

 

    "అవును మా నాన్నగారి పేరు శంభుప్రసాద్...అంటే ఎస్.పి.గా షార్ట్ ఫార్మ్ లో. తప్పేంచెప్పాను" అని నవ్వి "ఎలా ఉంది తెలివి?" అంది.

 

    "వండర్ ఫుల్!" చిన్నగా తలమీద కొట్టి నవ్వాను.

 

    "నువ్వేమిటీ ఈ ఉద్యోగం...చదువుకోవడంలేదా?"

 

    "ఆ! బి.ఎస్.సీ. చేస్తున్నాను! పార్ట్ టైం ఉద్యోగం ఇది"

 

    "మరి అతనెవరూ? నీ బోయ్ ఫ్రెండా?" అడిగింది.

 

    నేను విరక్తిగా "ఒకప్పుడు. ఇప్పుడు వెంటపడి వేధిస్తున్నాడు" అన్నాను.

 

    ఆమె డ్రైవ్ చేస్తూనే "కేసేమిటో చెప్పు" అంది.

 

    నేను టూకీగా సిద్దార్థ గురించి చెప్పాను.

 

    "బావుంది. దొంగిల్లబోతే మంగళం దొరికిందనీ నీలాంటి అమ్మాయిలకి ఇలాంటివాళ్ళే తగుల్తారు. తప్పు వాళ్ళదికాదు. అమాయకంగా ఉండే మీది!" అంది.

 

    "ఔను వాడు మొదటివాడు కూడా కాదు. రెండోవాడు..." అని సందీప్ గురించి కూడా చెప్పాను.

 

    "బాదంకాయలూ, జామకాయలూ ఇస్తే ముద్దు పెట్టుకోనిస్తుంది అని శివ చెప్పినప్పుడే నువ్వు ఎంత అమాయకురాలివో నాకు తెలిసింది.

 

    కానీ వయసుతోబాటు బుద్ధికూడా పెరుగుతుందనుకున్నా, ఏమీ పెరగలేదన్నమాట!" అంది.

 

    "నా గురించి శివ అలా చెప్పేవాడా?" అవమానంగా ఫీలవుతూ అడిగాను.

 

    "మగవాళ్ళు అలాగే చెప్తారు. నీ గురించి ఉదాత్తంగా చెప్తారనుకున్నావా? ఇంతకీ ఇల్లెక్కడ?" అడిగింది.

 

    నేను చెప్పాను.

 

    "శివ నన్ను యిష్టపడిన విషయం మాత్రం నిజమే. అందులో అబద్ధంలేదు. మీరు వెళ్ళిపోయాక మీ అడ్రెస్ కోసం చాలా ప్రయత్నించాడు. తర్వాత ఆర్మీలోకి వెళ్ళిపోయాడు. శెలవులకి వచ్చినప్పుడు నన్ను కాంటాక్ట్ చేస్తుంటాడు" అంది.

 

    "శివ చాలా మారిపోయాడా?" అడిగాను.

 

    "అబ్బే...పొట్టి లాగులు వేసుకుని అలానే ఉన్నాడు. నువ్వు మాత్రమే చీరల్లోకి వచ్చి ఇంతపొడుగైపోయావు!" అని చిన్నగా నవ్వింది.

 

    ఆమె అలా ఆటపట్టిస్తుంటే ఎంతో హాయిగా అనిపించింది. చిన్నప్పటి పొట్టి గౌన్లూ, చిన్నవైపోయిన చెప్పులూ దాచుకుని పెద్దయ్యాక చూసుకుంటున్న అనుభూతి కలిగింది!

 

    మా ఇంటి దగ్గర కారు ఆపింది.

 

    "లోపలికిరా...నాన్నగార్నీ, అమ్మనీ పలకరిద్దువుగానీ" అన్నాను.

 

    లిల్లీ నాతోపాటు లోపలికి వచ్చింది.

 

    అమ్మా, నాన్నా లిల్లీని చూసి చాలా సంతోషించారు.

 

    అమ్మ చిన్నక్క జ్ఞాపకాలను తవ్వుకోకుండా ఉండదు.

 

    లిల్లీ అమ్మ చేతిని పట్టుకుని "అమ్మా నే వచ్చేశాగా! మీ కాళిందే మీ దగ్గరకి వచ్చేసింది అనుకోండి. ఇంకెప్పుడూ ఏడవద్దు" అంది.

 

    ఆ మాటలకి అమ్మతోబాటు నాన్నగారు కూడా కంట తడిపెట్టారు.

 

    లిల్లీని ఆ పూట మాతో భోంచేసి వెళ్ళమంటే "ఇప్పుడు కాదు...మరోసారి" అని బయల్దేరింది.