తెల్లవారుతూండగా లేచి ఇంటి పనులు చెయ్యసాగాను. అమ్మ ఆదమరిచి నిద్రపోతోంది.

 

    నాన్న మార్నింగ్ వాక్ కి వెళ్ళిపోయారు.

 

    గేట్ మీద టక...టకా...చప్పుడైంది. పాల అబ్బాయి ఆనుకుని గిన్నె పట్టుకుని వెళ్ళాను.

 

    పక్కింటి అబ్బాయి "మీకు ఫోన్ వచ్చింది...హాస్పిటల్ నుండి" అన్నాడు.

 

    నా గుండె వేగంగా కొట్టుకుంది.

 

    "మీ వాళ్ళు ఎవరో పోయారుట!" అని అంతకన్నా చెప్పడం ఇష్టంలేనట్టు తలవంచుకున్నాడు.

 

    'భగవాన్...సిద్దార్థ అన్నంత పనీ చేసినట్లున్నాడు!' నా కాళ్ళు తడబడ్డాయి. వేగంగా చేతిలో గిన్నె పారేసి అతనితో వెళ్ళిపోయాను.

 

    వాళ్ళింట్లో నన్ను సానుభూతిగా చూశారు. అందరివైపూ భయంగా చూస్తూ మౌనంగా ఫోన్ అందుకున్నాను.

 

    "హలో...ఎవరు మాట్లాడ్తున్నారు?" అడిగాను.

 

    "మీరు రాఘవరావుగారి ఇంటినుండేనా?" అడిగారు.

 

    "ఔను! వారి మూడో అమ్మాయిని మాట్లాడుతున్నాను. చెప్పండి." అన్నాను.

 

    "కాళింది...మీ అక్కయ్యేనా?"

 

    "ఔను! ఏం?"

 

    "కాళింది తెల్లవారుజామున మరణించింది. ఈ విషయం తెలియజేయడానికి విచారిస్తున్నాం"

 

    "నో! నో! ఏమిటి మీరు అనేది? నిక్షేపంలా ఉన్న మా అక్క చనిపోవడం ఏమిటి?" అరిచేశాను.

 

    "కాళింది కిడ్నీలు ఫెయిలయ్యాయి!"

 

    "మా కాళింది అయివుండదు! మా అక్క డాక్టర్. మా అక్క సంపూర్ణ ఆరోగ్యవంతురాలు" ఏడుస్తూనే ఆశగా అడిగాను.

 

    "రాఘవరావుగారు, గౌతమ్ నగర్, రోడ్ నెంబర్ మూడు...ఇది మీ అడ్రసేనా?"

 

    "ఔను!" పాతాళంలోకి కృంగిపోతూ అన్నాను.

 

    "ఎవరైనా పెద్దవాళ్ళు వుంటే వెంటనే బయల్దేరి రమ్మనండి. బాడీని తీసుకెళ్ళచ్చు! వి ఆర్ వెరీ సారీ!" చెప్పి ఫోన్ పెట్టేశాడు.

 

    నేను అక్కడే నిస్సత్తువగా కూలబడిపోయాను.

 

    చేతిలోంచి ఫోన్ జారిపోయింది.

 

    గబుక్కున వచ్చి ఇల్లుగలావిడ పట్టుకుంది.

 

    "చిన్నక్క చచ్చిపోయిందా? ఈ విషయం ఎలా నమ్మడం? కళ్ళజోడు సర్దుకుంటూ జీవితం గురించి చాలా లోతుగా మాట్లాడే చిన్నక్క జీవితం అప్పుడే అయిపోయిందా? మొన్న పిల్లలతో కలిసి బెలూన్లు పగలకొడ్తూ అల్లరిగా నవ్వినా అక్క...ఇంక లేదా? నాన్నకు తనే గురువుగా మారి సలహాలిచ్చే అక్క! ఇంక మీ బాధ్యతలన్నీ నావే...అంటూ మాకు ఆశలురేపి పెట్టిన అక్క! 'నిన్ను నాతో తీసుకుపోతాను' అని, చెప్పకుండా మోసం అందరాని దూరాలకు వెళ్ళిపోయిందా?"

 

    ఈ విషయం విని ఆ ముసలి ప్రాణాలు ఎలా తట్టుకుంటాయి? "డాక్టరమ్మా నాకు టికెట్ ఇప్పించవూ! అనే ముసలి వగ్గు తాతయ్య తన ముందే కసుగాయ రాలిపోవడం ఎలా భరించగలడు?"

 

    "నా కూతురు డాక్టర్!" అని గర్వంగా చెప్పుకునే నాన్న ఏమైపోతాడు?

 

    "భగవాన్! మా ఇంటి జ్యోతిని ఇంత నిర్దయగా ఎందుకు ఆర్పివేశావు?" గుండె పగిలేలా ఏడుస్తూ ఉండిపోయాను.

 

    "సంబాళించుకో తల్లీ! మీ వాళ్ళు ఎవరైనా వుంటే ఫోన్ చెయ్యి" అందావిడ.

 

    ఎవరున్నారు? మాధవ్ గుర్తొచ్చాడు. అతనైతేనే నాన్నకీ అమ్మకీ ఈ విషయం చెప్పగలడు.   

 

    అతను నాన్నతో కర్నూలు వెళ్ళి జరగవలసినవి చూస్తాడు. అన్నీ సరిగ్గా జరిగితే కాళిందికి కావలసిన భర్త! ఏడుస్తూనే మాధవ్ కి ఫోన్ చేశాను.

 

    "హలో..." మాధవ్ గొంతు వినిపించగానే పెద్ద పెట్టున ఏడ్చేస్తూ "నేను ఆముక్తని!" అన్నాను.

 

    "ఏమైందమ్మా? నాన్నగారు బావున్నారా?" ఆదుర్దాగా అడిగాడు అతను.

 

    "కాళింది...కాళింది చనిపోయిందిట. ఇప్పుడే వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు" వెక్కుతూనే చెప్పాను.

 

    "ఛ"! అన్నాడు.

 

    "ఔను. ఇంకా ఈ విషయం అమ్మా నాన్నలకి తెలియదు. మీరు వెంటనే బయల్దేరి రండి" అన్నాను.

 

    "ఇదిగో...వచ్చేస్తున్నాను" అని పెట్టేశాడు.

 

    నాన్న ఉదయపు వ్యాహ్యాళికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆయన జీవితంలో రాత్రి దారుణంగా తిష్టవేసుకుని కూర్చుంది! పెరట్లో తన చేత్తో పెరిగిన మొక్క వాడిపోతేనే తట్టుకోలేని వెర్రిబాగుల అమ్మ...ఈ కడుపుకోత ఎలా భరిస్తుంది?

 

    మాధవ్ వచ్చేదాకా అలాగే ఏడుస్తూపడి ఉన్నాను.


                                                             *  *  *


    మా ఇంటికి వెలుగిచ్చే దీపం ఇంటి ముందు నిప్పై మండుతోంది. వార్థ తెలిసిన బంధువులంతా వచ్చారు. పెద్దక్క గుండెలు బాదుకుని ఏడుస్తోంది. అమ్మనీ నాన్ననీ పట్టుకోవడం ఎవరితరం కావడంలేదు.

 

    మాధవ్ మా నాన్నగారికి ఈ వార్త చెప్పగానే ఆయన క్రిందపడి గుండె పట్టుకుని గిలగిల తన్నుకుంటూ ఏడవడం...నేను జీవితంలో మరువలేను!

 

    ఎన్నో అల్పమైన విషయాలకే, పెద్దవాళ్ళు తిట్టారనీ, అలిగి ఆవేశంతో ఆత్మహత్యా ప్రయత్నాలు చేసే పిల్లలు ఆ దృశ్యం చూస్తే తమ ఆలోచనలు ఎంత భయంకరమైనవో తెలుసుకుంటారు! కన్నవాళ్ళకి కడుపుకోతని మించిన శిక్ష మరొకటి లేదు.