తరువాత ఆలోచనలు మరీ విచిత్రంగా సాగాయి. ఒక్కోసారి అవి వికృతంగా కూడా ధ్వనించాయి. ఇహ ఆలోచించకూడదనుకున్నాడు.

    మరునాడంతా చాలా సరదాగా గడిచింది. ఉదయం అతను లేవటం పూర్తయ్యేసరికి బావగారు కాఫీ త్రాగటం ముగించి కూర్చున్నారు. ఆయనకు మీసం వుంది. వయస్సు ముప్ఫయి అయిదు దాటింది. కానీ తలా, మీసంలోని వెంట్రుకలు కొన్ని అప్పుడే నెరిశాయి. "నీ మీసం తీసెయ్యి బావా! అప్పుడు చిన్నవాడివవుతావు" అని అనేవాడు రవి రెండు మూడేళ్ళ క్రితంవరకూ.

    ఆయన మాట్లాడకపోవటం అలావుంచి గంభీరంగా నవ్వేవాడు.

    "ప్రాక్టీస్ మీ ఊళ్ళోనే పెడతావా?" అనడిగారు బావగారు.

    "మా ఊరువదిలి నేనెక్కడికి పోతాను బావా! లేకపోతే?"

    "మరి పెళ్ళెప్పుడు?"

    రవి ఏమీ మాట్లాడకుండా తల వంచుకునేసరికి తమ్ముడికి కాఫీ, ఫలహారం తీసుకువస్తున్న శారద కల్పించుకుని "అదేం ప్రశ్నండీ? మీరే పూనుకుని, పట్టుబట్టి వాడికి పెళ్ళిచేయవలసింది పోయి వాణ్ణడిగితే వాడేం చెబుతాడు?" అని, అవి అక్కడపెట్టి కొంచెం దూరంలో కుర్చీకి చేతులు ఆనించి నిలబడింది.

    "అవునవును. నాకు తట్టలేదు సుమా! అయిదారుగురు నా దగ్గరకువచ్చి మీ బావమరిది పెళ్ళివిషయమేమిటన్నారు. నాకంతగా తెలియదనీ, అతన్నే అడగమనీ పంపించేశాను" అని ఆయన తాను చేసిన పని సబబా, కాదా అని ఆలోచిస్తున్నట్లున్నారు.

    శారద చిన్నబుచ్చుకుని "అయ్యో! నాతో మాటవరుసకైనా చెప్పారు కాదు. తమ్ముడివిషయం మీకు తెలుసుకదా! అదీగాక వాడికి పెద్దవాళ్ళు ఇంకా ఎవరున్నారని అలా పంపించారండీ?" అంది విచారంగా.

    "అయినా అన్నగారున్నారు కదా అనుకున్నాను. ఆయన పెద్దవారు కదా!"

    ఆమె ఏమీ పలకక లోలోపల బాధపడి ఊరుకుంది. కొంచెం ఆగి రవి ఇలా అన్నాడు "బావా! నీకేమిటి జబ్బు?"

    "ఏమో, డాక్టర్లకి కూడా సరిగా తెలియదు. ఒకరు ఫ్లోరసి అన్నారు. మరొకరు నరాల బలహీనత అన్నారు."

    "ఏది ఏమయినా నువ్వు చాలా జాగ్రత్తగా వుండాలి."

    "నేనసలు కుర్చీలోంచి కాలే క్రిందపెట్టటంలేదు కదా! ఇలాగే ఓ ఆరునెలలు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని చెప్పారులే."

    మధ్యాహ్నం భోజనాలయాక రవి దిగులుగా చిన్నక్కతో అన్నాడు "అక్కడకు పోవాలంటే ఎలాగో వుంది. ఒక్కడినీ గడపాలి. ఏమీ తోచదు. చిన్నక్కా! పోనీ నువ్వు వచ్చేయకూడదూ నాతో. కొంతకాలం వుండి వచ్చేద్దువుగానీ...

    "నేను ఎలా రానురా? ఆయన ఆరోగ్యమూ అంతంతమాత్రంగానే వుందికదా. నువ్వే వుండు, ఓ పదిహేను రోజులపాటు."

    "నేను ఇక్కడ ఎలా వుండేది చిన్నక్కా? నువ్వు వున్నావని వుండటమేగానీ నాకు ఇక్కడ ఏమీ బాగుండదు. మన ఇల్లువదిలి ఎక్కడా ఉండబుద్ధి కాదు."

    అతని మూగవేదన అంతకన్నా స్పష్టీకరించి ఆమెకు చెప్పనక్కరలేదు.

    పూర్వకాలంలో వున్న కుటుంబాలు పెద్దపెద్దవి అయివుంటే కాలం హరించిన కొద్దీ మనుషులు తగ్గిపోతున్నా ఆ కాలంలో కట్టిన ఇళ్ళూ వాకిళ్ళూ దెయ్యాల్లా అలానే చారిత్రాత్మకంగా నిలిచిపోతాయి. గోవిందరావుగారి పూర్వికులు ఎంత పెద్ద పెద్ద సంసారాలు చేస్తేనేమి? ఈయన హయాం వచ్చేసరికి ఒక్క భార్యా, తనూ మిగిలారు. పిల్లలా లేరు. ఒకరికి తెలియకుండా ఒకరు రెండుమూడు కుటుంబాలు అతి సులభంగా నివాసం చేయదగ్గ ఆ దెయ్యమంత భవనంలో ఈ దంపతులిద్దరూ, ఇద్దరుముగ్గురు నౌకర్లను పెట్టుకుని కాలంగడపటం కష్టసాధ్యమైన విషయమే. అందుచేత ఎవరైనా బంధువులు వచ్చిన రోజున ఆనందానికీ, కులాసాకీ అంతే ఉండదు. మళ్ళీ ఒంటరితనం, దిగులు, జుగుప్సా కలిగిస్తుంది. ఈ భావం వాళ్ళకొక్కరికే కాక రవికీ కలిగి మూర్తీభవించిన దైన్యంలా అయాడు. శోకంనుంచి శోకంలోకి పయనించటం అతి ఘోరం. తీరా ఇక్కడినుంచి తను ఊరికి వెళితే అక్కడ కన్పించేది ఆ లంకంత కొంపే. ఒకే ఒక మనిషి రాత్రిళ్ళు నిశాచరుడిలా తిరుగుతూ అందులో జీవిస్తాడు.
                                                  5

    పదిహేను రోజులు గడిచాయి. చాలారోజుల క్రిందటే రవి తన ఊరికి తిరిగి వచ్చేశాడు. తను ఒక్కడికోసం ఒక వంటమనిషిని పెట్టుకుని భరించటం అనవసరమే అయినా హోటలుకూడు తినలేక దీనికే సిద్ధపడ్డాడు. వంటవాడు కూడా పాతవాడే. తను ఈ ఊరు వచ్చినప్పుడల్లా అతనే వచ్చి ఈ ఇంట్లో కుదిరేవాడు.

    ఒకనాడు పనివాడు కేశవులు గబగబా పైకివచ్చి "ఈ వంటవాడ్ని తీసెయ్యాలయ్యగారూ!" అన్నాడు.

    "ఏమిరా?"

    "నిన్న నా కళ్ళారా చూశాను. వెండిగిన్నె ఉత్తరీయంలో చుట్టుకుంటుంటే."

    కేశవులైతే ఇరవైఏళ్ళనుంచీ పనిచేస్తున్న మనిషి. విశ్వాసపాత్రుడు. వంటవాడు అయిదారు సంవత్సరాలనుంచి మాత్రమే వస్తున్నాడు. అతను చేస్తున్న పనులు కూడా రవికి తెలియకపోలేదు. కానీ ఇతన్ని తీసివేస్తే ఆ వచ్చేవాడు బుద్ధిమంతుడు అయివుంటాడని నమ్మకం ఏమిటి? అదీగాక మనిషి ఎలాంటివాడయినా, ఇతని చేతివంట అమృతతుల్యం. మరి ఆ పాపిష్టి చేతులు అంతటి పనితనాన్ని ఎలా అలవరుచుకున్నవోగానీ ఇదీ లభ్యం కాకపోతే?"

    అందుకే రవి శుష్కహాసం చేసి "అబ్బ! నీ గొడవ నువ్వు చూసుకోకూడదూ? వీళ్ళనిగురించి నీకెందుకు?" అన్నాడు కొంచెం మందలింపుగానే.

    "ఏమో అయ్యా! ఈసారి వాడు చేసే దుండగం నా కళ్ళబడిందంటే తన్ని తగలేసేది ఖాయం."