"మా అబ్బాయి సెల్ కి ఫోన్ చేసి పిలిపిస్తాను. అందాకా ఆగండి."
    
    "మీరు ఆవిడ్ని పంపించకపోతే మేం వెళ్ళి పోలీస్ లని పంపిస్తాం. పరువుగల ఇల్లని మేం వచ్చాం" అన్నాడు.
    
    జయంతి లోపల్నుంచి వచ్చి "ఈవిడ దొంగతనం చేసిందనా మీ అనుమానం?" అంది నాకేసి ఈసడింపుగా చూస్తూ.        
    
    "తెలీదు అందర్నీ చెక్ చెయ్యాలి. సుమతిగారూ - పదండి!"
    
    "ఛీ! ఛీ! మా పరువు, ప్రతిష్టలు మంట కలిపావే.... నీ వాళ్ళ ఎంత అప్రదిష్టా?" అత్తయ్య ముందుకొచ్చి నా బుగ్గలు పొడిచింది.
    
    "త్వరగా పోనీ...లేకపోతే ఈ విషయం నలుగురికీ తెలిసిపోతుంది" అంది జయంతి.
    
    నాకు అంత కంగారులోనూ పరువు అనే మాట వాళ్ళ నోట వచ్చినందుకు నవ్వొచ్చింది.
    
    ప్రదీప్ వెనకాల నేను నడిచి వెళుతుంటే వాళ్ళు అభ్యంతర పెట్టకుండా అదోలాంటి కసితో చూశారు.    
    
    ప్రదీప్ కాళ్ళకి దండం పెట్టాలనిపించింది.    
    
    మేం వైజాగ్ వెళ్ళే లగ్జరీ కోచ్ ఎక్కేవరకూ నాకు భయంగానే వుంది. ఏ మూలనుండో ఆనంద్ కానీ మావయ్యకానీ పరుగు పరుగున వస్తారేమోనని తలమీద నుండి కొంగు కప్పుకుని తలవంచుకుని కూర్చున్నాను.
    
    బస్ కదిలాక ప్రదీప్ వచ్చి నా ప్రక్కన కూర్చున్నాక ధైర్యం వచ్చింది.
    
    "ఇదిగోండి....టిఫిన్ చెయ్యండి" టిఫిన్ పొట్లం విప్పదీసి అందిస్తూ అన్నాడు.
    
    నా కుడి అరచేయ్యిలో మధ్యభాగం అంతా రక్తం గడ్డకట్టి చచ్చుబడి పోయినట్లయింది. అందుకన్నా తినలేను. నిస్సత్తువగా వుంది. తల అడ్డంగా వూపాను.
    
    "ఏం!" అతని దృష్టి నా అరచేతిమీద పడింది. చర్మం కమిలిపోయి, రక్తం నల్లగా వుంది.
    
    "అరెరే..." అతడు కర్చీఫ్ తీసి కట్టుకట్టాడు. "ఇప్పుడే వస్తా!" డ్రైవర్ తో చెప్పి హడావుడిగా మెడికల్ షాప్ వైపు కదిలాడు.
    
    వెనక్కివాలి కూర్చున్నాను. మాధవి గుర్తొచ్చే మనసంతా మసకబారుతోంది. కడుపాకలి ఎవరయినా తీర్చగలరు. మనసాకలిని తీర్చడానికి ఒక్క నేస్తమైనా మనిషికి అవసరం! అటువంటి మాధవికి ఏమైనా జరగరానిది జరిగితే....నాకు తెలిసిన దేవుళ్ళందరినీ ఆమెకి ఏమీ కాకూడదని వేడుకున్నాను.
    
    "ఈ టాబ్లెట్స్ వేసుకోండి. నెప్పి తగ్గుతుంది" తనే నోట్లో వేసి మినరల్ వాటర్ తాగించాడు.
    
    ఏ జన్మలోనో బాగా ఋణపడి వుంటాడు.
    
    ఇడ్లీముక్క తుంచి చట్నీతో అద్ది నోట్లో పెడుతుంటే నాకు తెలీని నా కన్నతల్లి గుర్తుకొచ్చి కళ్ళు రెండూ నిండు కుండలయ్యాయి.
    
    ఇంత చేస్తున్నాడు....ఇతడు నా నుండి ఏం ఆశిస్తున్నాడూ? నేనేం ఇవ్వలేను. ఇవ్వను!
    
    మనుషుల్లో కరువైన వాత్సల్యం అతను అందిస్తున్నాడు. ఒకసారి పరిచయమైతే చాలు ఎవరూ వదలలేనంతగా వెంపర్లాడేలాంటి ప్రేమని అతను పుష్కలంగా అందించగలడు. ఈ సమాజం అతనికి 'ప్లేబాయ్' అని 'ఫర్డ్' అని రకరకాల పేర్లు పెడుతుంది.
    
    అతను నా కట్టుకట్టిన చేతిని తన ఒడిలో పెట్టుకుంటూ అన్నాడు - "సుమతీ! మీది హేపీ మేరీడ్ లైఫా? జవాబు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పద్దు."
    
    ఇతను నాకు చాలాకాలంగా తెలుసు! అతనితో కొన్ని రాత్రులు ఒంటరిగా గడిపాను. నా ఎదమూలల్ని అతను వీణ మీటినట్లు మీటాడు. నా తనువు అతని స్పర్శలో వెన్నెల కురిసిన ధాత్రికిమల్లే పరవశించి ఆడింది. నా ప్రతి కష్టంలో తనకు చాతనైన విధంగా ఆలంబన నిస్తున్నాడు. అయినా నా మనసు అనే పుస్తకం అతని ముందు తెరవలేకపోయాను. ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడూ చెప్పలేనేమో! మాధవిలాగే....ఏమో!
    
    నా ముఖం అతని భుజానికి అదిమిపెట్టి దుఃఖాన్ని దిగమింగాను. ఆ తర్వాత అతి వేగంగా నా జీవితం మాటలతో మాలలా కూర్చి అతని పాదాల ముందు పరిచాను.
    
    అతని ముఖంలో అంతులేని జాలి.... విస్మయం.... బాధ..... భయం.....కోపం... నిరసన.... హేళన.... ప్రేమ.... తారట్లాడింది.
    
    ఏమీ తెలీని వయసులో అమ్మమ్మ సెక్యూరిటీకోసం పెళ్ళి....పెళ్ళికి ముందే సవతి... పెళ్ళయిన కొత్తలోనే బలవంతపు గర్భస్రావం.... అవమానాలు.... అనుమానాలు.... అవహేళనలు... పైశాచికత్వం.... మానసికహింసలు....శారీరకంగా నరకం!
    
    అతను నా తలమీద గెడ్డం ఆన్చి "ప్చ్...నీలాంటి సుమతులెందరో ఈ భారతంలో!" అన్నాడు.
    
    నేను చాలా రోజుల తర్వాత నిశ్చింతగా నిద్రపోయాను. నిశ్చింతగా! అదీ ఒక ప్రయాణంలో.... గమ్యం ఎలాంటి వార్తని తీసుకుని నా కోసం ఎదురు చూస్తోందో?
    
                                                               * * *
    
    నమ్మాలనిపించని ఎన్నో నిజాలు మనకోసం కర్కశంగా ఎదురు చూస్తుంటాయి.
    
    మాధవి నన్ను చూడగానే పరిగెత్తుకుని ఎదురురాలేదు. పలుచని పెదవులతో 'పిచ్చీ!' అంటూ నవ్వలేదు. నాతో ప్రదీప్ ని చూసి చిత్తరువుగా మారిపోలేదు. ఆశ్చర్యంతో పెద్దగా అరవలేదు!
    
    కట్టెలా బిగుసుకుని చాపమీద పడివుంది!
    
    మాధవి ఇంకలేదు! ఆమె చనిపోయింది.
    
    అతని నుండి ఒక్క ఫోన్ కాల్ కోసం ఎదురుచూసి, ఎదురుచూసి విసుగు చెందినదానిలా నిరసనగా కళ్ళు మూసుకుని పడుకుంది.
    
    ప్రదీప్ ఆమె తలమీద చెయ్యివేసి నిమిరాడు.
    
    ఆమెతో ప్రయాణం, బస్సులో అల్లరీ, పెళ్ళిలో పరాచికాలు.... ప్రేమ గురించిన ఆలోచనా గుర్తొచ్చివుంటాయి.... కన్నీళ్ళు కారడం ఆపలేక మొహం మరో పక్కకి తిప్పుకున్నాడు.
    
    "నా చిట్టితల్లిని ఎవరో కావాలనే పొట్టన పెట్టుకున్నారమ్మా "మాధవి తండ్రి చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. కలెక్టర్ కావలసిన పిల్ల కట్టెలా పడివుంది.
    
    కావాలనే.... కావాలనే.... నా మెదళ్ళో ఎన్నో రీళ్ళు గిరగిరా తిరిగి పోసాగాయి.
    
    ఆ రోజు మాధవి బుగ్గ నా ముందే గట్టిగా కొరికాడు రౌడీ... ఈసారికి వదిలేసాను. ఇంకోసారి పిచ్చివేషాలేస్తే నీ ఫ్రెండ్ శాల్తీనే గల్లంతు అయిపోతుంది. సవాల్ గా చెప్పాడు ఆనంద్.... అంటే ఇది ఒకవేళ ఆనంద్ పనేనా?
    
    "ఆనంద్... యూ బాస్టర్డ్!' నా గుప్పెళ్ళు బిగుసుకున్నాయి. కసిగా పళ్ళు పట పట కొరికాను. నా ఒళ్ళంతా కంపించసాగింది.
    
    ప్రదీప్ వచ్చి గట్టిగా పట్టుకున్నాడు.
    
    "వాడి పరువుమీద కొట్టు.... వాడిని బజారుకి ఈడ్చు ఏదైనా ఎఛీవ్ చెయ్యి" మాధవి మాటలు నా బుర్రలో తిరుగుతున్నాయి.