ఆ రాత్రి ఓ గంటా గంటన్నరసేపు నిద్రపోయాక ఎందుకో మెలకువ వచ్చింది గిరిజకు. ఆం ఎగదిలో కిటికీప్రక్కగా మంచం వాల్చుకుని పడుకుంది. కిటికీ అవతల వసారాలో రెండు మంచాలమీద సుందరం, అతనితల్లి పడుకున్నారు. సుందరం కిటికీవైపు వున్నాడు. వసారాలో సన్నగా ప్రసరిస్తూన్న బెడ్ లైటు వెలుతుర్లో అతని ముఖం తనవైపు తిరిగివున్నట్లూ, అతను కళ్ళు తెరచివున్నట్లూ, అని తనవైపే చూస్తున్నట్లూ గ్రహించింది. అతను నిద్ర పోకుండా తననే గమనిస్తూ పడుకున్నాడు గావును. పాపం! తనకు కోపం వచ్చిందని తల్లడిల్లిపోతున్నాడు. ఏం చేస్తాడో చూద్దామని కిటికీ చువ్వలగుండా చేతిని దూర్చి అటువైపు పెట్టింది. ఇలాంటి అవకాశం వృధా చెయ్యను అన్నట్లుగా అతను ఆమె మెత్తటివ్రేళ్ళను ఆశగా పట్టుకున్నాడు. అత్తయ్య అటుతిరిగి పడుకుని వుంది. ఆమె వ్రేళ్ళని అతనివ్రేళ్ళు మృదువుగా సవరిస్తున్నాయి. గిరిజకు నవ్వొస్తోంది. ఒక నిముషంలా వుంది. చేతిని లాక్కోబోయింది. అతను విడవకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఆమె కొంచెం శక్తి నుపయోగించి వొదిలించుకునేందుకు ప్రయత్నించింది. అతడు మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఆమె కసుక్కున తన వాడిగోరుతో అతన్ని గ్రుచ్చేసింది. ఉలిక్కిపడినట్లయి ఆమెచేతిని విడిచిపెట్టేశాడు. ఆమె చప్పున చెయ్యి ఇవతలకు తీసుకుని అటువైపు తిరిగి పడుకుంది.
    
    ఈ బావని తాను చిన్నప్పటినుంచి ఎన్నిసార్లో ఎన్ని సందర్భాలలోనో కలుసుకుంది. తనతో చనువుగా వుండే బావలు ఇంకా చాలామంది వున్నారు కాని, చిన్నతనంనుంచీ ఇతను కొంచెం అతిచనువు ప్రదర్శిస్తూనే వున్నాడు. తనకంటే నాలుగేళ్ళు పెద్దేమో తను నెలల పాప అయినప్పుడు తనని ఎత్తుకుని మోసివుంటాడు. అతన్ని అనేక దశల్లో తాను చూసివుంటుంది. మరీ చిన్న పిల్లాడిలా అర్ధంలేని పనులు చేస్తున్నప్పుడు, వంటిని బట్టలు లేకుండా వున్నప్పుడూ, తండ్రితో తన్నులు తింటూన్నప్పుడు, ఇలా ఎన్నో సందర్భాల్లో....అందుకే తనని అతనెంత కవ్విస్తున్నా తమాషాగా వుంటుంది. ఒక వయసులో వున్న అబ్బాయితో, ఓ యౌవ్వనంలో మిడిసిపడే పడుచు కుర్రాడితో సంచరిస్తున్నట్లుండదు. మామూలుగా వుంటుంది. ఒకోసారి నవ్వొస్తుంది. ఒకోసారి కోపమొస్తుంది అంతే ఇంకేం కలగదు. కలిగినా కలగనట్టే ఉంటుంది. తెలిసినా తెలియనట్లే వుంటుంది.
    
    అతను నిద్రపోతున్నాడో లేదో ఓసారి చూద్దామా అనుకుంది. మళ్ళీ ఏ చెయ్యో, కాలో పట్టుకుంటే గొడవనుకుని బలవంతంగా నిద్ర తెచ్చుకుని పడుకుంది.
    
                                                            3
    
    తెల్లవారింది. పుండరీకాక్షయ్యగారి ఇంటిలో మనుషులందరూ ఎవరి కార్యక్రమాల్లో వారున్నారు. ఆయనేమో సంధ్యావందనం, సూర్యనమస్కారాలు యధావిధిగా నిర్వహిస్తున్నారు. అనసూయమ్మగారు చీకటితోనే స్నానం ముగించుకువచ్చి అందరికీ కాఫీలూ, ఫలహారాలూ తయారుచేసే పనిలో వుంది. పెద్దకొడుకు ముఖ్యప్రాణరావు ఆదరాబాదరా ముఖం కడుక్కుని ఆరోజు ఇన్ కంటాక్స్ ఆఫీసరు దగ్గరకు తీసుకెళ్ళాల్సిన ఎకౌంటుపుస్తకాలు ముందేసుకు కూర్చున్నాడు. అతని భార్య సుభద్రమ్మ అప్పుడే ఏదో పిచ్చిపని చేసిన విస్సిగాడ్ని రెండు దరువులేసి ఈ కొంపనీ, తన సంసారాన్నీ తిట్టుకుని, యింటిపనిలో పడింది. రెండోకొడుకు ఆదినారాయణ బ్యాంకి ఏజంటు కావటంవల్ల ఎనిమిది గంటలకే తెమిలిపోవాలి కాబట్టి గబగబా స్నానంచేసేసి, గదిలో కూర్చుని భార్య అన్నపూర్ణ తెచ్చిన టిఫిన్ కానిస్తున్నాడు. అతని ముగ్గురుపిల్లలూ బల్లచుట్టూ చేరి తమకి కొనవలసిన పుస్తకాలగురించీ, క్రికెట్ బ్యాటుగురించీ ఏకరువు పెడుతూ తింటూన్న ఫలహారం వంటబట్టకుండా చేస్తున్నారు. అన్నపూర్ణ వాళ్ళని మధ్య మధ్య మందలిస్తోంది. మూడో కొడుకు అనంతమూర్తి మంచంమీద పడుకునే నిశ్శబ్దంగా పేపరు చదువుతున్నాడు. అతను తండ్రిలాగే ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటులో చేరి అప్పుడే గెజిటెడ్ ఆఫీసరయ్యాడు. పదిగంటల దాకా ఆఫీసుకెళ్ళే పనిలేదు. అందుకని నింపాదిగా తెములుతాడు. ఎవరితో ఎక్కువ మాట్లాడడు. చేతిలో సిగరెట్టుమాత్రం విధి విరామం లేకుండా వుండాలి. అతని భార్య మీనాక్షికి ఈ మధ్య పూసలతో బొమ్మలుచేసే పిచ్చి పట్టింది. ఇంట్లో మిగతా పనులు మానేసి అదేలోకం చేసుకుంది. నిన్న మొదలెట్టిన స్టాండ్ ఉయ్యాలబొమ్మ సగమే పూర్తయింది. అది పూర్తిచేసి ఎదురింటి కామాక్షమ్మగారికి చూపించి, ఆవిడకన్నా బాగా చేశానని మెప్పుపొందాలని పట్టుదలతో స్నానమన్నా చెయ్యకుండా పొద్దునే పూసలూ, నైలాన్ దారము ముందేసుకుని కూర్చుంది. నాలుగో కొడుకు రాఘవరావు రాత్రి క్లబ్బులో పేకాడి పొద్దుబోయి వచ్చాడు. అందుకని ఇంకా నిద్రలేవలేదు. అతనిభార్య కనకదుర్గ లేపటానికి మూడుసార్లు ప్రయత్నించి చివాట్లు తిని చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయింది. అయిదోవాడు మన్మధరావు బయట వసారాలో సుందరంతో బాతాఖానీ కొడుతూ కూర్చున్నాడు. అతని భార్య సామ్రాజ్యం రాత్రి వేసుకున్న నిద్రబిళ్ళల మత్తింకా వదలక గాఢసుషుప్తిలోన మిగిలివుంది. పిల్లలు చదువుకునేవాళ్ళు అల్లరి చేస్తున్నారు. గిరిజ మేడమీద తనగదిలో కూర్చుని హిస్టరీ టెక్స్ట్ చదువుకుంటోంది రోజూ ఉదయమే ఓ గంట చదువుకునే అలవాటు ప్రకారం రెండోకూతురు సత్యవతి నెలలు నిండటంవల్ల మొయ్యలేని బరువుతో ఆపసోపాలు పడుతూ ఏ మూలో పడుకుంది. తొమ్మిది గంటలకు పుండరీకాక్షయ్య గారు పూజా పునస్కారలనంతరం ఫలహారం ముగించి హాల్లోకి వచ్చి పడక్కుర్చీలో కూర్చుని తెలుగు పేపరు చేతిలోకి తీసుకున్నారు.
    
    యశోద లోపల్నుంచి మెల్లగా వచ్చి ఆయన ప్రక్కన నిల్చుంది. "అన్నయ్యా! పన్లో వున్నావా?" అంది ఎంతో అనురాగం ఉట్టిపడే కంఠంతో.
    
    పుండరీకాక్షయ్యగారు పేపరులోని మెయిన్ హెడ్డింగ్స్ చూస్తూ "లేదమ్మా చెప్పు" అన్నారు అనునయంగా.
    
    "మీ బావగారు నీతో మాట్లాడి రమ్మన్నారన్నయ్యా."
    
    పుండరీకాక్షయ్యగారు పేపరు చూసి బయటికెడితే మళ్ళీ ఒంటిగంటదాకా ఇంటికి తిరిగిరారు. తర్వాత భోజనం, నిద్రా, సాయంత్రమంతా ఎవరో ఒకరు వస్తూనే వుంటారు. ఇహ రాత్రికిగాని వీలుకాదు.
    
    "ఏమిటమ్మా"
    
    "అదేనన్నయ్యా, సుందరం పెళ్ళిగురించి"
    
    పుండరీకాక్షయ్య పేపరు ప్రక్కనపెట్టి, కళ్ళజోడు ముఖాన్నుంచి తీసి, పంచె చెంగుతో తుడుస్తూ "దాని గురించి మాట్లాడాల్సిందేముందమ్మా? సుందరం బేబీల గురించి వాళ్ళ చిన్నప్పట్నుంచి అనుకుంటున్నదేగా" అన్నాడు.