"వస్తాడా మీ బావ?"
    
    "వస్తాడనే అనుకుంటాను తల్లికి సీరియస్ గా వుంటే రాకుండా ఎలా వుండగలడు?"
    
    ఎమ్.బి.బి.యస్. ప్యాసయ్యాక యు.కె.లో ఉద్యోగంవచ్చి వెళ్ళిపోయాడు సరోజ బావ కృష్ణకిశోర్ వీలయితే అక్కడ రీసెర్చ్ లాంటిది చెయ్యటం, లేకపోతే పై చదువులకు వెళ్ళి పోస్టుగ్రాడ్యుయేషన్ డిగ్రీలు సంపాదించుకోవటం అతని అభిమతం.
    
    "అప్పుడే బావ వెళ్ళి ఏడాదయిపోయింది" అంది సరోజ, తనలో తాను అనుకుంటున్నట్లుగా.
    
    బావ ప్రసక్తి వచ్చినప్పుడల్లా సరోజలో కలిగేమార్పు, ఆమె ముఖంలోకి వచ్చే ఎరుపు గిరిజకు తెలియకపోలేదు. అతనక్కన్నుంచి నెలకో ఉత్తరమైనా ఆమెకు రాస్తూ వుంటాడు. ఉత్తరాలు ఎంతో ఆత్మీయంగా, మమకారంతో, ప్రేమపూరితంగా వుంటాయి. అక్కడ విశేషాలు అక్కడికి చేరుకున్న కొత్తలో తన అనుభవాలు, తాను చూసిన విశేషాలు అక్కడి మంచి చెడు... అన్నీ వివరంగా రాసేవాడు. తన అలవాట్లని చెప్పటం దాచలేదు. 'ఇక్కడికి వచ్చాక విస్కీ బ్రాందీలకు కొంచెంగా అలవాటుపడ్డాను. క్యాబరే డ్యాన్సులు కొన్ని కొన్నిచోట్ల నువ్వు నమ్మలేనంత విచ్చలవిడిగా వుంటున్నాయి. నీకు కోపమొస్తుందా నేనిలా చేస్తోంటే? అదంతే జీవితానికి కొన్ని కొన్ని కావాలి. అని చివర్లో ఆమెను కవ్విస్తూ వుండేవాడు.
    
    స్నేహితురాళ్ళిద్దరూ సరోజ ఇల్లు చేరారు. గిరిజను తనగదిలో కూర్చోబెట్టి యిప్పుడే వస్తానని లోపలకు వెళ్ళింది సరోజ. అయిదు నిమిషాలు గడిచాక రెండు కాఫీకప్పులతో వచ్చింది.
    
    ఇద్దరూ పొడుగాటి సోఫాలో ప్రక్కప్రక్కన కూర్చుని వేడి వేడి కాఫీ ఎంజాయ్ చేస్తూ త్రాగుతున్నారు.
    
    "ఏమిటి చాలా మాట్లాడాలన్నావు?"
    
    "బావ వచ్చేస్తున్నాడు" అంది సరోజ.
    
    "అవునది యిందాకే అనుకున్నాంగా."
    
    "అదికాదే, అత్తయ్యకి హార్ట్ ఎటాక్ వచ్చిందేమో! పట్టుబడుతోంది. బావ రాగానే మా యిద్దరికీ..." అని గబుక్కున ఆగిపోయింది.
    
    "మీ యిద్దరికీ..."
    
    "పెళ్ళి చేస్తానంటోంది" సరోజ తలెత్తి స్నేహితురాలి ముఖం చూడలేక పోతోంది.
    
    "మంచిదేగా" అంది గిరిజ కాఫీకప్పు టీపాయ్ మీద పెట్టి.
    
    "మంచిదేలే ఇవతల అమ్మావాళ్ళుకూడా తొందరపడుతున్నారు. కాని నాకే భయంగావుంది."
    
    "ఎందుకే భయం? అది మొదటినుంచీ అనుకుంటున్నదేగా."
    
    "అవుననుకో కాని ఆ సమయం ముందింకా ఎప్పుడో వుంది. తర్వాతెప్పుడో వస్తుందనుకుంటున్నాను. ఆవిడకి సుస్తీ చేసిందేమో, ఇహ ఆగేటట్టు కనబడటంలేదు. ఈసారి యిద్దరికీ తప్పకుండా ముడిపెట్టేస్తారు. బావకేమో యు.కె.లోనే సెటిల్ అయిపోవాలని వుంది. అతన్తోపాటు నేనుకూడా అక్కడే స్థిరపడిపోవాలి."
    
    "అవన్నీ పెళ్ళయ్యాక జరిగే సంగతులు. అక్కడ మీరుండిపోవటంకూడా బాగానే వుంటుందని నేననుకుంటున్నాను. అసలు నీకు మీబావని చేసుకోవాలని వుందా, లేదా చెప్పు."
    
    సరోజ పెదవులమీదకి సిగ్గుతోకూడిన నవ్వొకటి వచ్చింది. 'పో' అంది.
    
    "పో అంటే యిష్టమనే అనుకోవాలా?"
    
    "ఏమో బాబూ! నాకు తెలీదు."
    
    "ఉత్తరాలు రాయటం మాత్రం తెలుసునేం?"
    
    "అవి వొట్టి ఉత్తరాలేగాని, ప్రేమలేఖలేమిటి?"
    
    "ఆడవాళ్ళూ మొగవాళ్ళూ రాసుకునే వాటిలో వొట్టి ఉత్తరాలకూ ప్రేమలేఖ లకూ మధ్య వుండేదూరం చాలా తక్కువ."
    
    "అదిగో, అవన్నీ నాకు తెలీదు."
    
    "పో" 'ఏమో బాబూ' 'నాకు తెలీదు' యివ్వన్నీ యిష్టానికి పర్యాయపదాలు. అదీ ఎంత తక్కువగా వాడితే అంత యిష్టమన్నమాట. సరోజా! మీరిద్దరూ బావామరదళ్ళు యిష్టాలున్నాయి. మారు మాట్లాడకుండా చేసేసుకో."
    
    "అంతేనంటావా?" అంది సరోజ నిస్సహాయంగా అన్నట్లు కొంత చిలిపి తనంకూడా మేళవిస్తూ.
    
    అలాగే మాట్లాడుతూ కూర్చునేసరికి చీకటిపడిపోయింది. ఇహ వస్తానని సరోజ తల్లిగారి దగ్గరకూడా సెలవుతీసుకుని బయటకువచ్చి రిక్షా ఎక్కింది గిరిజ.
    
    ఇంటికొచ్చేసరికి బయట వసారా అంతా మనుషులతో నిండిపోయి కనిపించింది. తండ్రి ఓ ప్రక్కన పడక్కుర్చీలో కూర్చుని వున్నాడు. చిన్నన్నయ్య తప్ప మిగతా అన్నయ్యలంతా కుర్చీలో కూర్చుని నవ్వుతూ, కులాసాగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు సరే ఊరినించి ఎప్పుడొచ్చారో గాని యశోదత్తయ్యా, సుందరంబావకూడా వున్నారు.
    
    "అదిగో, బేబీ వచ్చేసింది" అన్నాడు ఉత్సాహంగా సుందరం లోపల కడుగుపెడుతూన్న ఆమెను చూసి.
    
    "ఏమమ్మా! యింత ఆలస్యమయిందేం?" అన్నాడు పుండరీకాక్షయ్యగారు.
    
    ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్ లో ఎకౌంటెంట్ సెక్షన్ లో గెజిటెడ్ ఆఫీసరుగా పనిచేసి నిరుడే రిటైర్ అయ్యాడాయన. రిటైరైనప్పటినుంచీ రామకోటి స్మఘంలో ముఖ్య కార్యకర్తగా చేరాడాయన. ఆ సంఘం ఏర్పాటుచేసే సప్తాహాలు, సభలు, గుళ్ళు కట్టించడం, వీటి నిర్వహణలో ఏదో పనిపాటల్లోనే వుంటాడు.
    
    "సరోజ వూరినుంచి వస్తే, వాళ్ళింటికి వెళ్ళొచ్చాను నాన్నా!" అని సుందరం వైపు తిరిగి వెక్కిరించి లోపలకు పారిపోయింది.
    
    "ఆసి భడవా! దీని బుద్దులింకా పోయాయికాదు" అంటూ సుందరం లేచి ఆమె వెనుకనే లోపలకు వెళ్ళాడు.
    
    అల్మైరాలో పుస్తకాలు పెడుతూన్న గిరిజ వెనకనుంచి జడ గట్టిగా లాగినట్లయ్యేసరికి "అబ్బ!" అంది వెనుదిరుగుతూ.