1948లో జవహర్ లాల్ నెహ్రూ పోలీస్ యాక్షన్ తరువాత మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ తన సింహాసనం నుంచి దిగిపోతే - ఆ లాండ్ ని బహుమతిగా పొందిన ఆ కుటుంబ సభ్యులు ఇండియాని వదిలి దుబాయ్ వెళ్ళి సెటిలయిపోయారు.
    
    ఇదిగో ఈ భూ కబ్జా జనార్ధన్ ఠాగూర్ - ఇతని మిత్రుడు రమేష్ చంద్ర తమ గూండాల సహకారంతో ఆ లాండ్ ని అక్రమంగా స్వాధీనం చేసుకొని తమ అధీనంలో పెట్టుకున్నారు.
    
    ఇప్పుడా లాండ్ ఎకరం కోతి రూపాయలు చేస్తుంది.
    
    ఈ కుంభకోణాన్ని పసిగట్టిన ప్రముఖ పాత్రికేయులు స్వర్గీయ జగన్నాయకుల్ని వీళ్ళే దారుణంగా చంపించారు.
    
    ఆ కేసుని ఇన్ వెస్ట్ గేట్ చేయబోయిన ఎ.ఎస్.పి. నిరంజనరావుగార్ని గుడ్డివాడ్ని చేసి - ఆయన కూతుర్ని పిచ్చిదాన్ని చేసారు. ఈమధ్య గుడ్డివాడైన నిరంజనరావుగార్ని కూడా ఒక హోటల్ లో దారుణంగా చంపించారు.
    
    ఈ లాండ్ విషయంలో జగన్నాయకులుగారు, సయ్యద్, యాదగిరి, సల్మా, సురేష్ చంద్ర, నిరంజనరావుగారి అవుట్ హవుస్ లో ఉంటున్న భార్యాభర్తలు - నిరంజనరావుగారు - రమేష్ చంద్ర - రబ్ జానీ- షీలా - నలుగురు కాల్ గరల్స్- ఇంతమంది చనిపోయారు - ఎందుకో తెలుసా? ఈ దుర్మార్గుడి స్వార్ధానికి - వీడు ముఖ్యమంత్రా? వీడు ముఖ్యమంత్రయితే రాష్ట్రంలో ఖాళీ స్థలాలు మిగులుతాయా? వీడికడ్డం వచ్చిన వాళ్ళు బతుకుతారా?
    
    ఇదిగో ఇక్కడ ముందు వరసల్లో గోతికాడ నక్కల్లా కూర్చున్న ఈ ఎమ్.ఎల్.ఏ.లు మంత్రులయితే రాష్ట్రం బూడిదగా మారకుండా ఉంటుందా?
    
    వీళ్ళు కోటి ఖరీదు చేసే ఒక ఎకరం - పది లక్షలు తీసుకుని ఈ భూ కబ్జాగాడ్ని సపోర్ట్ చేస్తున్నారు - డబ్బుకోసం వీళ్ళేదయినా చేయగలరు - వీలయితే రాష్ట్రాన్ని, దేశాన్నయినా అమ్మగలరు. వీళ్ళను మీరెందుకు ఎన్నుకొంది?
    
    పరిపాలించమనా?
    
    పంచుకు తినమనా?
    
    వీళ్ళు పేదవాళ్ళా? ఐదారు వందల గజాలస్థలాన్ని హైదరాబాదులో కొనుక్కోలేనంత పేదవాళ్ళా?
    
    ఈ రోజు ఏ ఎమ్.ఎల్.ఏ కయినా - మాజీ ఎమ్.ఎల్.ఏల కయినా యాభై లక్షల ఆస్తికి తక్కువ ఉంటుందా?
    
    ఎవరు ఎమ్.ఎల్.ఏ. అయినా వారి పదవీ కాలంలో వారి నివాసానికి హైదరాబాదులో ఎమ్.ఎల్.ఏ క్వార్టర్స్ ఉన్నాయి.
    
    మంత్రులయితే లంకంత కోటలున్నాయి.
    
    ఐదేండ్ల తరువాత వీళ్ళు మాజీలు - వీళ్ళ కేరాఫ్ లు.... వారి స్వంత నియోజక వర్గాలు మరి వీళ్ళకి హైదరాబాదులో ఖరీదైన స్థలాలు కారు చౌకధరకి ఎందుకిచ్చారు గతంలో....?
    
    ఎవడబ్బ సొమ్మది? వీళ్ళబ్బదా? ప్రజలదా? ప్రజల దగ్గర చందాలు వసూలు చేసుకొని - వారితోటే ఓట్లేయించుకొని - అసెంబ్లీకొచ్చి - పైరవీలుచేసి, తప్పుడు పనులు చేసి, లక్షలు సంపాదించుకుంటున్నారు.
    
    జూబ్లీ హిల్స్ లో ఉన్న పాత ఎమ్.ఎల్.ఏల కాలనీకి వెళ్ళి చూడండి - అన్నీ మీకు బంగ్లాలు - ప్యాలెస్ లే దర్శనమిస్తాయి.
    
    అంతంత ఇళ్ళు కట్టుకోటానికి వీళ్ళకు అంత సొమ్ము ఎక్కడ నుండి వచ్చింది?
    
    కొందరు ప్యాలెస్ లు కట్టుకొని ఏసీలు పెట్టుకొని విలాసవంతమైన జీవితం గడుపుతుంటే - ఇంకొంత మంది గజం రెండు వేలకు తమస్థలాన్ని అమ్ముకొని, సొమ్ము చేసుకొని తమ నియోజక వర్గాలకు వెళ్ళిపోయారు.
    
    ఇప్పుడు మరో కాలనీ - యూసఫ్ గూడాలో ఉన్న పోలీస్ ఫైరింగ్ రేంజ్ లాండ్ ని వీళ్ళు తమ స్వంతం చేసుకున్నారు.
    
    జూబ్లీ హిల్స్ ని ఆనుకుని ఉన్నా ఈ ఖరీదైన స్థలాన్ని కారు చౌక ధరకి కొట్టేసిన స్వార్ధపరులు వీళ్ళు.
    
    ఇప్పుడక్కడికి వెళ్ళి చూడండి - బుల్ డోజర్లు, లారీలు, వందలాది వర్కర్స్ రాత్రింబవళ్ళు నిర్విరామంగా శ్రమిస్తూ రోడ్లు, డ్రైనేజ్, వాటర్, కరెంట్, సౌకర్యాల్ని కల్పిస్తున్నారు.
    
    సౌకర్యాల గురించి ప్రజలడిగితే లేని డబ్బు న్యూ ఎమ్.ఎల్.ఏ కాలనీ అభివృద్ధికి ఎక్కడ నుంచి వస్తోంది?
    
    ఒక్కొక్క ఎమ్.ఎల్.ఏ.కి ఆరువందలగజాలు ఇచ్చిన ప్రభుత్వానికన్నా సిగ్గుండాలి. లేదా తీసుకొనే ఎమ్.ఎల్.ఏల కన్నా సిగ్గుండాలి. అదీ కాకపోతే రాష్ట్రాన్ని పంచుకు తినే వీళ్ళకు ఓట్లేసిన ప్రజలకన్నా సిగ్గుండాలి.
    
    కనీసం ఓట్లేసినందుకు సిగ్గు పడకపోయినా - ఇలాంటి పంచుకుతినే పనులు చేస్తున్నప్పుడు - తెలుసుకొని తిరగబడనందుకన్నా సిగ్గుపడాలి ప్రజలు.
    
    వీళ్ళు తమ తమ నియోజక వర్గాలకు వెళ్ళి ప్రజల బాగోగులు చూస్తారని అనుకుంటున్నారా? లేదు.
    
    పార్టీ మీటింగులని, సభలని, సంతాపాలని, సన్మానాలని చెప్పి ఆయా నియోజక వర్గాల్లో ఉండే వ్యాపారస్తుల్ని భ్రమపెట్టి ప్రలోభపెట్టి చందాలు వసూలు చేస్తారు.
    
    వీళ్ళ ఇండ్లకు కొందరు వ్యాపారులు ఉచితంగా వెచ్చాలు సప్లయి చేస్తే మరికొందరు ఫారెన్ లిక్కర్, త్రిబుల్ ఫైవ్ సిగరెట్స్ సప్లై చేస్తే ఇంకొందరు బట్టలు పెడతారు - మరికొందరు వీళ్ళ కార్లలో డీజిల్, పెట్రోలు ట్యాంకుల్ని నింపి పంపిస్తారు.
    
    నగలు, బట్టలు, విలాస వస్తువులు, వాహనాలు, వెచ్చాలు, మందు - సిగరెట్లు ఒకటేమిటి ప్రతిదీ, ఆయా నియోజక వర్గపు ప్రజలే భరించాలి.
    
    ఎందుకు - ఎందుకివన్నీ చేస్తున్నారీ ప్రజలు?
    
    వీళ్ళు మనల్ని పాలించే నాయకులా?
    
    వీళ్ళను తన్నకుండా వదలటం తప్పుకాదా?
    
    వీళ్ళకు గుండ్లు కొట్టించి, బొట్లు పెట్టించి గాడిదల మీద ఊరేగించక పోవటం ప్రజల తప్పు కాదా?
    
    "కొద్దిమంది నిజాయితీ పరులైన ఎమ్.ఎల్.ఏ.లు, మంత్రులు లేకపోలేదు. వారి శాతమెంత ఒకటా అరా..."? ఒకటిలో పావోవంతా?" ఆగ్రహావేశాలతో మాట్లాడుతూ ఒక్కక్షణం ఆగాడు వంశీ.
    
    అంత పెద్ద మైదానంలో ఉన్న లక్షలాది జనం విస్తుపోయి వింటున్నారే తప్ప రవ్వంత శబ్దం కూడా చేయటంలేదు.
    
    "ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన న్యూస్ ఒకటి చదువుతాను వినండి - ఇది విన్నాకయినా మీలో చలనం వస్తుందని నా ఆశ..." అని ఒక్కక్షణం ఆగి చదవటం ప్రారంభించాడు వంశీ.