"చిన్నపుడు..." ఏదో చెప్పబోయాడు....
    
    హెవీ లైట్ ఫోకసింగ్ లో పళ్ళను, దంతాల్నీ పరీక్షిస్తున్న పర్నేష్.
    
    "పిస్టల్ బుల్లెట్స్ తగిలి... ఈ పళ్ళు విరిగిపోయాయి అవునా..." అడిగాడు.
    
    తల తిరిగి పోయింది బబ్లూకి.
    
    డాక్టర్ పర్నేష్... తెల్లరంగు ఐబ్రోస్ వేపు చూసాడు...
    
    పిస్టల్ బుల్లెట్స్ తగిలినట్టు ఈ డాక్టర్ కెలా తెలుసు? ఆలోచిస్తున్నాడు బబ్లూ.
    
    "ఏంటాలోచిస్తున్నావ్.... ఈ విషయం నాకెలా తెల్సిందనా... సీ మిస్టర్... నువ్వు... పోలీసువా... సోల్జర్ వా... క్రిమినల్ వా... సిన్సియర్ గా ఆన్సర్ చెప్పు..." అడిగాడాయన.
    
    రెండు సెకన్లు నిశ్శబ్దం.
    
    తర్వాత పెదవి విప్పాడు బబ్లూ.
    
    "అయామ్ ఎ క్రిమినల్.... ఎస్..... క్రిమినల్.... డెడ్ లీ.... డేంజరస్ విషస్....క్రుకెడ్... ఇంటిలిజెంట్... హండ్రెడ్ పర్సెంట్ హోల్ హార్టెడ్ క్రిమినల్..." ఒక్కొక్క పదం వెనక... కసి... అంతులేని కసి... ఆ కసి దేనిమీదో డాక్టర్ పర్నేష్ కి అర్ధం కాలేదు.
    
    "నా నర్సింగ్ హోంలో వారంరోజులు ఉండాలి నువ్వు...." చెప్పాడు డాక్టర్ పర్నేష్.
    
    "ఎందుకు...." వెంటనే అడిగాడు బబ్లూ!
    
    "బికాజ్ ఆఫ్ ఇన్ ఫెక్షన్..." వెంటనే చెప్పాడాయన.
    
    "ఇన్ ఫెక్షన్... తగ్గలేదా.... ఆ మధ్య టేబ్ లెట్స్ యూజ్ చేసాను.....నొప్పిలేదు" అన్నాడు బబ్లూ.
    
    "ప్లాస్టిక్ పళ్ళద్వారా నొప్పి తెలీదు....స్టీల్ రాడ్ ద్వారా తెల్సి ఉంటుంది యామై రైట్...."
    
    "యూ ఆర్ ఫర్ ఫెక్ట్ లీ రైట్..." అన్నాడు బబ్లూ.
    
    "నర్సింగ్ హోమ్ పక్కన ఉంది.... ఫోన్ చేసి చెప్తాను.... ఏ.సీ. రూమ్ లో ఉండు.....ఇప్పుడీ ఇంజక్షన్ తీసుకో.... ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ట్రీట్ మెంట్ స్టార్ట్ చేస్తాను...."
    
    ఏం మాట్లాడలేదు బబ్లూ.
    
    ఇంజక్షన్ చేసాడు డాక్టర్ పర్నేష్.
    
    "ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నర్సింగ్ హోమ్ కొస్తాను..." లేచి నిలబడ్డాడు బబ్లూ.
    
    "ఏం" ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్ పర్నేష్.
    
    "జస్ట్ నౌ ఐ సెడ్... దట్ అయామ్ ఏ డేంజరస్... అండ్ జీనియస్ క్రిమినల్.... నేనెవర్నీ నమ్మను..... అందుచేత..." బబ్లూ మాటలు విని నెమ్మదిగా నవ్వాడు ఏభై ఎనిమిదేళ్ళ పర్నేష్.
    
    "నీ లాంటి వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు మోసపోయేది ఎవరిచేతుల్లో తెలుసా...." అడిగాడాయన.
    
    "చెప్పండి...." కోపంగా అన్నాడు బబ్లూ.
    
    "ఆడవాళ్ళ చేతుల్లో..." నవ్వుతూ అన్నాడు పర్నేష్.
    
    ఆశ్చర్యంగా ఆయన వేపు చూసాడు బబ్లూ! ఆ క్షణంలో బబ్లూకి ఒకమ్మాయి జ్ఞాపకం వచ్చింది. ఆ అమ్మాయి బబ్లూ ప్రేయసి కాదు.
    
    ఆ అమ్మాయి బబ్లూ అక్కగానీ, చెల్లెలు గానీ కాదు.
    
    మరో రెండు నిమిషాల తర్వాత బబ్లూ బయటికి వస్తుండగా అడిగాడు పర్నేష్.
    
    "పోలీసు కాల్పుల్లో నీ రెండు పళ్ళూ పోయాయి కదూ.... నీకు తెలీదు..... ఆ బుల్లెట్స్ తగిలి... నీ పై పెదవి చిన్న దెబ్బతింది..."
    
    ఆ విషయం బబ్లూకి తెలీదు.
    
    పై పెదవి మీసం చాటున ఉండడం వల్ల బబ్లూకి ఆ విషయం తెలీలేదు.
    
    అదే సమయంలో-
    
    బాబ్లూకి ఓ చిన్న విషయం తట్టింది.
    
    "థాంక్యూ డాక్టర్...." ఆ క్లినిక్ కమ్ రెసిడెన్స్ లోంచి బయటపడ్డాడు బబ్లూ.
    
    బబ్లూ ట్రీట్ మెంట్ కోసం దకతర్ పర్నేష్ కి, రెండురోజుల క్రితం ముట్టిన ఎమౌంట్ యాభై వేలు.
    
                                                   *    *    *    *    *
    
    కూరగాయల నర్సింహ - పాన్ షాపు పాండు - కిరాణా మర్చెంట్ వెంకటేశం - ఎక్కడా ఏవిధమైన క్లూ లభించలేదు సూర్యవంశీకి.
    
    ఆఖరుకు మిగిలిన వ్యక్తి హెయిర్ కటింగ్ సెలూన్ కట్టర్ రబ్ జానీ...
    
    "జగన్నాయకులు గురించి నీకు తెల్సింది మొత్తం చెప్పాలి...." అలా అడుగుతున్న సూర్యవంశీ వేపు, నలభైఏళ్ళ రబ్ జానీ హుషారుగా చూసాడు.
    
    "అదేఁటి సార్... నాయకులు సాబ్... మా గురువుగారు.... ఈ షాపుని నాకెవరు ఇప్పించారనుకున్నారు.... ఆయనే... నా సామాను కొనుక్కోవడం కోసం లోన్ ఎవరు ఇప్పించారనుకున్నారు....ఆయనే... నా సామాను కొనుక్కోవడం కోసం లోన్ ఎవరు ఇప్పించారనుకున్నారు....ఆయనే.... మీకు తెలీదుసార్... నా పెళ్ళికి పెళ్ళిపెద్ద ఎవరో తెలుసా... ఆయనే... మీరడగండిసార్... ముందు...." క్రింద చెత్తగా పడిన జుత్తును పక్కకు తోస్తూ అన్నాడు రబ్ జానీ.
    
    "ఆయన ఏదైనా.... సెన్సేషనల్ న్యూస్ గురించి నీతో ఎప్పుడైనా మాట్లాడారా!" అడిగాడు సూర్యవంశీ.
    
    "అవున్సార్... ఆయన రిటైరవడానికి మూడురోజుల ముందు సెలూన్ కి వచ్చారు సార్-టాప్ లేచిపోతుంది రబ్ జానీ అన్నారు సార్-అదే రోజు నాకు ఏవో కొన్ని కాగితాలు నాకిచ్చారు సార్-మళ్ళీ రెండు గంటల తర్వాత తీసుకుంటానన్నారు సార్...కరెక్టుగా రెండు గంటల తర్వాత వచ్చారు సార్...ఆ కాగితాలు తీసుకుని వెళ్ళిపోయారు సార్..."
    
    "ఎక్కడకు వెళ్తున్నారో చెప్పారా ఆయన..." అడిగాడు సూర్యవంశీ.
    
    "లేదు సార్... కానీ ఆ తర్వాత ఆయన నాకు కన్పించలేదు సార్...." రబ్ జానీ కళ్ళల్లో చిన్న తడి.
    
    మరో పది నిమిషాల సేపు అక్కడ గడిపాడు సూర్యవంశీ. వచ్చేసేముందు అడిగాడు రబ్ జానీ.
    
    "సార్... మీరు నాకో చిన్న హెల్ప్ చేసి పెట్టాలి సార్...."
    
    "ఏంటా హెల్ప్..." అడిగాడు సూర్యవంశీ.
    
    "చచ్చిపోయిన మా గురువుగారికి కూడా చెప్పాను సార్... నాకు ఖైరతాబాద్ ఏరియాలోని వెంకట్రమణ కాలనీలో ఓ నూటయాభై గజాల స్థలం ఉండేది సార్... రోజులు బాగుంటే, చిన్నదో పెద్దదో ఇల్లు కట్టుకోవాలని నా కోరిక సార్.. కానీ... ఓ అపార్ట్ మెంట్స్ వాడు కబ్జా చేసేసి వాడి ప్లేస్ లో కలిపేసుకున్నాడు సార్... వాడి వెనక ఉన్నది మన హోం మినిస్టర్ జనార్ధన్ ఠాగూర్ సార్ - ఈ విషయం మన గురువుగారికి చాలాసార్లు చెప్పాను సార్....చెప్తాను అనేవాడు సార్.....పనిమాత్రం జరగలేదు సార్... సార్... వెంట్రుక వెంట్రుకను అమ్ముకొని కూడబెట్టిన డబ్బుసార్....మీరైనా ఆ విషయంలో హెల్ప్ చెయ్యండి సార్..."