వాళ్లకు తెలుసు అలా జరిగిన మరుక్షణం ఆ షెడ్ నుంచి నిర్ధాక్షిణ్యంగా తొలగింపబడతారని.

 

    ఉదయం తొమ్మిది గంటల సమయం...

 

    షెడ్ అంతా బిజీగా వుంది.

 

    హిబ్రూదాదా ఇంకా రాలేదు - అప్పుడే రాడుకూడా. ఉదయమే లేచి హనుమాన్ వ్యాయామశాలకు వెళ్ళి అక్కడ ఒళ్ళంతా చెమటలు కక్కేవరకు వ్యాయామం చేసి, మరీ సరదాగా వుంటే ఒకళ్ళిద్దరితో కుస్తీ పట్టులు పట్టి, అప్పుడు ఇంటికివెళ్ళి స్నానం చేసి, భారీగా భోంచేసి పదకొండు గంటలకు షెడ్ కొస్తాడు.

 

    అతనికి సంపాదించాలని, దాచుకోవాలని ఎప్పుడూ అనిపించలేదు.

 

    తనకింద పనిచేసేవాళ్ళందర్నీ తన సొంతవాళ్ళలా చూసుకోవడం, వాళ్ళకే అవసరం వచ్చినా ఆదుకోవడం అతనికెంతో ఆనందాన్నిచ్చే చర్య.

 

    అప్పుడే సామంత్ వచ్చాడు.

 

    సామంత్ ఇష్టమయినప్పుడు కొద్దిసేపు అక్కడ పనిలేస్తాడు. లేదనుకుంటే ఎవరి తప్పునన్నా మీదేసుకొని జైలు కెళతాడు.

 

    అతనంటే దాదాకి ప్రత్యేకమైన అభిమానం.

 

    ఆ షెడ్ లో పనిచేవాళ్ళకు కూడా సామంత్ అంటే అభిమానం.

 

    సాధారణంగా అతని చేయపడితే ఎలాంటి వెహికల్ అయినా గంటల్లోనే సెట్ రైట్ అయిపోతుంది.

 

    "సామంత్ భాయ్... ఆ ఎ.ఇ.వై. 7281 చూడు. ఊరికే హీటెక్కి పోతుంది..." అన్నాడో సీనియర్ మెకానిక్ అప్పుడే వస్తున్న సామంత్ ని చూసి.

 

    అంతలో ఆ షెడ్ లోనే పనిచేసే ఓ చిన్న కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి "నీకోసం ఓ వ్యక్తి ఇప్పటికి మూడుసార్లు వచ్చి వెళ్లాడు" అన్నాడు ఆయాసపడుతూ.

 

    ఎవరయివుంటారా అని ఆలోచిస్తూనే కారు బాయ్ నెట్ ఎత్తాడు.

 

    సరీగ్గా అప్పుడే పీటర్ పంపిన వ్యక్తి అక్కడికి నాలుగోసారి వచ్చాడు.

 

    వస్తూనే సామంత్ ని గుర్తించాడు.

 

    సామంత్ బాయ్ నెట్ ఎత్తి రేడియేటర్ రబ్బర్ ట్యూబ్ ని చెక్ చెయ్యడం మొదలెట్టాడు.

 

    అంతలో ఆ వ్యక్తి సామంత్ ని వెతుక్కుంటూ వచ్చాడు.

 

    "ఏరా సామంత్... ఏమైపోయావ్?" వొంగుని రిపేర్ చేస్తున్న సామంత్ వీపు చరుస్తూ అన్నాడా వ్యక్తి.

 

    సామంత్ చటుక్కున లేచి ఓసారి ఆ వ్యక్తికేసి సీరియస్ గా చూసి "ఏమిటి మర్యాద తగ్గిపోయింది? మీరు చెప్పిన వెధవ పనికి ఒప్పుకున్నాననా" అని ప్రశ్నించాడు.

 

    ఆ వ్యక్తి ఒకింత కలవరపడి, తిరిగి అంతలోనే సర్దుకుంటూ "అబ్బే అదేం లేదు. ఇప్పటికి నీకోసం మూడుసార్లు వచ్చాను. ఇది నాలుగోసారి" అన్నాడు ఒకింత మర్యాద ప్రదర్శిస్తూ.

 

    'వీడు నిజంగా మంచి కుటుంబంలోపుట్టి, విద్యా బుద్ధులు అబ్బి వుంటే దొరబాబులా వుండి వుండేవాడు!' అనుకున్నాడతను ఓ క్షణం.

 

    తెల్లగా, మెలితిరిగిన కండలతో చూడగానే స్ఫురద్రూపి అనిపించేలా వుంటాడు సామంత్.

 

    సామంత్ నోట్లో అప్పుడు చార్మినార్ సిగరెట్ వుంది.

 

    వచ్చిన వ్యక్తిది కనీసం రెడ్ విల్స్ కాల్చే స్థాయి.

 

    అతను అసహనంగా సామంత్ కేసి చూస్తూ, "ఈరోజు నుంచి మరో నెల వరకు నువ్వా సిగరెట్స్ తాగడానికి వీలులేదు. అయ్యగారు మార్ల్ బోరో, రోత్ మెన్స్, త్రిబుల్ ఫైవ్ పంపించారు నీకోసం. ఆ కార్టన్స్ నా దగ్గరే వున్నాయి. తాగడంలో కూడా స్టెయిల్ కనబర్చాలి. చొప్పకట్ట కాల్చినట్టు ఆ దిక్కుమాలిన పద్ధతేమిటి? ముందు బయలుదేరు..." అన్నాడతను హడావిడి పడిపోతూ.

 

    "నువ్వు లక్కీ టీ స్టాల్ దగ్గర ఎదురుచూస్తుండు. అరగంటలో వచ్చేస్తాను..." సిగరెట్ ని అవతలకి విసిరేస్తూ అన్నాడు సామంత్.

 

    అతను వెళ్ళిపోయాడు.

 

    అతని పేరు కత్తెర కనకరావు. గతంలో కత్తెర్ల వ్యాపారం చేస్తుండేవాడు. రెండు, మూడు పెద్ద దొంగతనాలలో పోలీసుల కన్ను తన మీద పడడంతో ఇక లాభం లేదనుకుని, ఆ వ్యాపారం మానేసి పీటర్ కి చిన్న చిన్న లోపాయికారీ పనులు చేసి పెట్టేందుకు కుదిరాడు.

 

    మనిషి సన్నగా, పీలగా వుంటాడు.

 

    తెల్లటి పంచె, తెల్లటి లాల్చీ, కాళ్ళకు కాన్పూర్ చెప్పులు ఇదీ అతని వేషధారణ.

 

    వీటన్నిటి వెనుక అతి ప్రమాదకరమైన క్రిమినల్ బ్రెయిన్ వుందని మొదటి చూపులో కాదుగదా - పదిసార్లు పరిశీలనగా చూసినా గుర్తించలేరెవరూ!

 

    అతనికా ప్రాంతంలోని వ్యక్తులు, వాళ్ళ జీవిత చరిత్రలు క్షుణ్ణంగా తెలుసు.

 

    అందుకే అతన్ని చేరదీశాడు పీటర్.

 

    అర్జునరావు వేసిన పథకంలోని మొదటి అంకం ఓ పనికిమాలిన వ్యక్తిని ఎన్నుకోవడం.

 

    ఆ పనిని అర్జునరావు పీటర్ కి అప్పగిస్తే, పీటర్ కత్తెర్ల కనకారావుకి అప్పగించాడు.

 

    కనకారావు తిరిగి తిరిగి గొప్ప పనికిమాలిన వ్యక్తి దొరకక కళ్ళు తేలేసే టైమ్ లో సామంత్ కనిపించాడు. చూడ్డానికి దొరబాబులా వుండాలి. ఖరీదైన బట్టలేస్తే హైక్లాస్ సొసైటీ నుంచి వచ్చిన వాడిలా ఆనాలి. మంచి పర్సనాలిటీ వుండాలి. తిరగేస్తే పరమ చెత్త అలవాట్లున్న దుష్టుడు కావాలి.

 

    అన్నీ కాకపోయినా కొన్ని వున్న సామంత్ ని ఎన్నిక చేసుకున్నాడు కనకారావు.

 

    అతనికి డబ్బు ఆశ వుంది. అవసరం వుంది. అందుకు ఏ ప్రమాదకరమైన పని చెయ్యమన్నా సిద్ధపడే తెగువ వుంది. అన్నిటికీ మించి ఇలా చెబితే అలా అందుకుపోగల తెలివితేటలున్నాయి. అందుకే సామంత్ ని ఎన్నిక చేసుకుని, యాభై వేలకు బేరం కుదుర్చుకుని పీటర్ కి కబురు చేశాడు. పీటర్ కూడా ఓసారి వచ్చి సామంత్ ని చూసి వెళ్లాడు.

 

    కనకరావు టీ బంక్ ముందు నించుని రెడ్ విల్స్ తీసి వెలిగించుకుని అక్కడే వున్న బెంచ్ మీద కూర్చున్నాడు.

 

    సరిగ్గా ఇరవై రోజులలో తను సామంత్ ని ఓ అద్భుతమైన వ్యక్తిగా కనిపించేలా తయారుచెయ్యాలి. అందుకు తనకు ముట్టే ప్రతిఫలం లక్ష.

 

    వెయ్యిరూపాయిల ఖరీదు చేసే ఉంగరం కోసం వేలినే నిర్ధాక్షిణ్యంగా కత్తిరించిన కనకరావుకి అది మాత్రం కష్టమైన పనిగానే తోచింది. మెడలోని బంగారపు గొలుసుకోసం వెళ్ళి మెడ ఏమవుతుందోనని ఆలోచించే రకం కాదు కనకరావు అయినా ఇది మాత్రం జటిలమైన వ్యవహారంలా కనిపించిందతనికి.

 

    రోట్లో తలపెట్టి రోకటి పోటుకు వెరచి ఏం లాభమని సిద్ధపడ్డాడు. పైగా పిరికితనం అతనిలో ఏ కోశానాలేదు.

 

    సరిగ్గా అరగంటకు ఓ పాత గజెల్ కారులో వచ్చి ఆ టీ బంక్ ముందాగాడు సామంత్.

 

    కారులోంచి దిగుతున్న సామంత్ ని చూసి - "ఇదెక్కడ కొట్టుకొచ్చావ్...?" అడిగాడు వేళాకోళంగా కనకారావు.