"నేను మీతో వస్తాను , మీవెంట తీసుకువెళ్ళండి" అన్నది వేదిత ఒక రాత్రి రుద్ధకంఠంతో.

 

    "వచ్చి ఏం చేస్తావు?" అన్నది వేదమాత చిరునవ్వుతో.

 

    "మీ శిష్యరికం చేస్తాను. మీతోపాటు దేశ దేశాలూ తిరిగి మీ ఉపదేశ సారాన్ని వింటూ, కొత్త సంగతుల్ని నేర్చుకుంటూ, ప్రజల్ని ఉత్తేజితుల్ని చేస్తూ నా జీవితం గడిపేస్తాను."

 

    "ఇంత చిన్నపిల్లవు, నీకిప్పుడిప్పుడే భగవంతుడ్ని గురించి యింత ఆరాటం దేనికమ్మా! యింకా అనుభవించవల్సిన సుఖాలున్నాయి. గౌతమ బుద్ధుడు ఆరేళ్లు సంసారంచేసి ఓ తనయుడ్ని కన్నాకే ఆ బంధనను విడిపించుకుని బయటపడ్డాడు, తెలుసా?"

 

    వేదిత ఖిన్నురాలై "మీరు నన్ను పరిహసిస్తున్నారా? నేను వితంతువును. ఆ అధ్యాయం ముగిసిపోయింది. ఇప్పుడు మిగిలివుంది ఒకటే దారి, అదే నా ధ్యేయంకూడా" అన్నది గాద్గదికంగా.

 

    వేదమాత ఆమె శిరస్సుని హృదయానికి అదుముకుని "ఇతరుల్ని పరిహసించేటంతటి కఠినాత్మురాలిననుకున్నావా? కాని మిగతా దారులన్నీ మూసివేయటం నువ్వనుకున్నంత సులభంకాదు, ఇది హెచ్చరికమాత్రమే" అని నిట్టూర్పు విడిచింది.

 

    "అందరికీ అన్నీ కావాలా?" అనడిగింది వేదిత కొంచెం ఆగి.

 

    "అంటే?"

 

    "సాంఘిక ధర్మాలు, సంసారిక ధర్మాలు నిర్వర్తించకుండా ఏ లక్షల మందిలో ఒకరు ఆశయ సిద్ధికోసం మిగిలిపోతే యేం? వేళా మంది లక్షలమంది, కోట్లమంది పెళ్ళిళ్లు చేసుకుని పిల్లల్ని కంటున్నారు. అక్కడక్కడా చెదురుగా ఒకరు యీ వ్యామోహానికి ఎదురు తిరిగి తమ జీవితాన్ని లోకకళ్యాణంకోసం, అతీతపు సాధనలకోసం అంకితంచేస్తే అది ప్రకృతి విరుద్ధమవుతుందా?"    

 

    "అవదు, అలాంటివారు అప్పుడప్పుడూ, అక్కడక్కడ అవతరిస్తూ ఉండాలి. లేకపోతే ప్రపంచం తన స్తబ్దతను తనే భరించలేక కృంగిపోతుంది. ఈ అంకుశపు పోట్లులేక ఎల్లెడలా సోమరితనం, భోగలాలసత్వం విస్తరించి విశృంఖలత్వం దాపురిస్తుంది.

 

    "నేను ఈ ప్రపంచానికి దూరంగా వుందామనుకుంటున్నాను."

 

    "ప్రజలనుండి దూరంగా పారిపోయి. నువ్వు సాధించేదేమీ లేదు. అందరి మధ్యా ఉంటూ, పదిమందికి వెలుగురేఖగా జీవించి, ఆదర్శప్రాయంగా మసలి సార్థకత సాధించు. తీవ్రమైన ఆశయం ఉంటే ఆచరణ కష్టం కాదు. ఎందుకు పడిందో, చిన్న వయసులోనే ఓ మలుపు పడింది, దృఢత్వం అలవర్చుకుని ఆ మలుపును ఉత్తేజకరంగా తీర్చిదిద్దుకో. నీ ఉండే వాతావరణమె మనోహరమైనది. ఈ వాతావరణానికి అనుగుణ్యంగా నీ మనస్సుని మలుచుకో!"  

 

    ఈ బోధన వేదిత లేత మనస్సుమీద పటిష్టంగా పనిచేసింది. తన జీవన పధాన్ని ఆమె ఆనాడే నిర్ణయించుకుంది. తన ఉనికితో కొన్నాళ్ళపాటు ఆ ఊరినీ అక్కడి ప్రజల్నీ పునీతుల్ని చేసిన వేదమాత అక్కడినుంచి వెళ్లిపోయే రోజు వచ్చింది. వేదిత ఆమెను కౌగలించుకుని కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆమె కంటి వెంట జల జల మని నీటిబిందువులు రాలాయి. తమ తమ ఆత్మబంధువుని పోగొట్టుకున్నట్లు యిరువురూ అనుభూతి పొందారు.

 

    అంతే! వేదిత మౌనిలా తయారయింది. ఆమె అణువణువునా  వెల్లివిరిసే స్వచ్ఛతనూ, నిర్మల హృదయాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆమెను ప్రేమించారు. చివరకు తమ చిట్టితల్లిగా, దేవతగా చూసుకోసాగారు. ఉదయాన్నే ఆమె ఏటికి వెళ్ళి నీళ్ళ బిందెతో తిరిగి వస్తూంటే యువకులు దూరంగా తప్పుకుపోయేవారు. ఆమెలో మహాత్మ్యం, దేవతా శక్తి ఉందని అంతా నమ్మారు. సాయంత్రాలు దేవాలయ ప్రాంగణంలో కూర్చుని తంబూరా మీటుతూ ఆమె భజనగీతాలు పాడుకుంటూంటే గుడికి వచ్చిన స్త్రీలూ, పురుషులూ, పిల్లలూ, చుట్టూ కూర్చుని ముగ్ధులై వింటూ ఉండేవారు.

 

    రాను రానూ ఆమెలో ఆత్మశుద్ధి, తన్మయతా అధికమై ఓ జ్యోతిలా ప్రకాశించసాగింది.

 

                                             * * *

 

    ఉదయం పదిగంటల వేళ యింట్లో ఒక్కతే కూర్చుని తంబూరా కృతి చేసుకుని పాడుకుంటోంది. శీతాకాలం కావటంచేత బయట కొద్దిగా నీరెండగా ఉన్నా, శీతల వాయువులు వీస్తూ కిటికీలోంచి లోపలకు ప్రవేశించి ఆమె మేనిని సోకుతూ ఆహ్లాదపరుస్తున్నాయి. చలికాలపు ఉదయాలు, మధ్యాహ్నాలూ, ఎంత మనోహరంగా వుంటాయి! చలికాలపు మధ్యాహ్నాలూ, వేసవికాలపు సాయంత్రాలూ, వర్షాకాలపు రాత్రులూ వేదితకు ఇష్టం.

 

    వచ్చి ఎంతసేపయిందో, ఎంత సేపటినుంచి ఆలకిస్తున్నాడోగాని పాట ముగించాక ఆమె ఎందుకో తల ఎత్తి చూసేసరికి గుమ్మంలో శేషశాయి నిలబడి ఉన్నాడు. తంబూరా క్రిందపెట్టి, కలిగిన తొట్రుపాటును అణుచుకుంటూ "మీరా శేషుబాబు! ఎంత సేపయింది వచ్చి?" అనడిగింది కంపిత స్వరంతో.

 

    "తక్కువ సేపేం కాలేదు. ఇంట్లో ఏమీ తోచక అటు కొండలవైపు షికారు బయల్దేరాను. ఈ సమీపానికి వచ్చేసరికి మధుర మంజులమైన నీ గానం చిరుగాలితో ప్రయాణం చేసివచ్చి నా చెవుల్ని సోకింది. "ఆహా! మా వేదిత పాడుతోందని వింటానికి లోపలికి వచ్చి మీ ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాను" అన్నాడు శేషశాయి ప్రత్యుత్తరంగా.

 

    "మరి పిలవలేదేం?" అన్నదామె లేచి నిలబడుతూ.

 

    "నీ గానం వినటానికి వచ్చినవాడ్ని - నీకు అంతరాయం ఎందుకు కలిగిస్తాను వేదితా! ఇంతటి కళానైపుణ్యాన్ని నీలో దాచుకున్నావని ఇన్నాళ్ళూ తెలియదు సుమా!"

 

    "విదేశాలు తిరిగి వచ్చిన ఘనులు. మా పాటలు మీకేం నచ్చుతాయి శేషుబాబూ!"

 

    "ఇలాంటి కంఠ మాధుర్యానికి ఆ దేశంలో కరువాచిపోయానంటే నమ్ముతావా వేదితా?"