ఉపగ్రహాలు కూడా మా పిల్లలే – నందిని హరినాథ్

 

 

ప్రపంచ అంతరిక్ష రంగంలో ఇస్రో ఓ సంచలనం సృష్టించింది. 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపి సెంచురీ కొట్టింది. ఆ సమయంలో ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు శేఖర్ కపూర్ ఓ ట్వీట్ చేశారు. తాను కేవలం ఇస్రో విషయంలోనే గర్వపడటం లేదనీ, ఈ కీలక విజయంలో ముఖ్యపాత్ర వహించిన మహిళా శాస్త్రవేత్తల విషయంలో కూడా గర్విస్తున్నాననీ సందేశం ఉంచారు.

 

నిజానికి ఇస్రోలో మహిళా శాస్త్రవేత్తల పాత్ర అంతా ఇంతా కాదు. క్షిపణి రంగంలో మన దేశాన్ని తలెత్తుకునేలా చేసిన టెస్సీ థామస్, మంగళయాన్ ప్రాజెక్టు విజయవంతం కావడంలో ముఖ్యపాత్ర వహించిన ‘రితు కరిధాల్’, ఇస్రోలో జియోశాట్ కార్యక్రమాలను సమీక్షించే అనురాధ... ఇలా ఇస్రోలో తమ సత్తా చాటుతున్న స్త్రీ శాస్త్రవేత్తల జాబితా చాలా పెద్దగానే ఉంది. అందులో నందిని హరినాథ్ ఒకరు. ఆమె విజయరహస్యాలు ఇవిగో...

 

గమ్యం ముందుగానే నిర్ణయమైతే

 

భౌతిక శాస్త్రంలో నిపుణురాలైన నందిని అంతరిక్షపరిశోధనా రంగంలోకి వచ్చేందుకు పెద్దగా కష్టపడలేదు. కారణం! తను ఏం చేయాలనుకున్నారో ముందుగానే నిర్ణయించుకున్నారు. నందిని ఇంట్లో ఎప్పుడు విజ్ఞానం పట్ల అభిరుచి కలిగే వాతావరణం ఉండేదట. తల్లి లెక్కల టీచరు. తండ్రి ఇంజనీరు... దానికి తోడుగా భౌతిక శాస్త్రం అంటే విపరీతమైన అభిమానం ఉన్న మనిషి. దాంతో నందినీకి సహజంగానే ఆ రంగం మీద మక్కువ ఏర్పడింది. చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి చూసిన ‘Star Trek’ అనే సీరియల్, ఎలాగైనా సరే తను అంతరిక్షరంగంలోకి ప్రవేశించాలనే పట్టుదలని రగిలించిందని చెబుతారు నందిని.

 

 

నాయకత్వం వహించే లక్షణం ఉంటే

 

ఓ రెండు దశాబ్దాల క్రితం ఇస్రోలో చేరిన నందిని అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రాజెక్టు డైరక్టరు స్థాయికి చేరుకున్నారు. దానికి కారణం తన శ్రమే అంటారు నందిని! కెరీర్లో పైకి ఎదగడం ఆడవారి విషయంలో మరింత కష్టమనీ, ఆ కష్టానికి సిద్ధపడితేనే ఎదుగుదల సాధ్యమనీ చెబుతారు. ఆడవారు తమ కుటుంబం ఎక్కడ చేజారిపోతుందో అని కీలక బాధ్యతలని చేపట్టేందుకు జంకుతూ ఉంటారనీ... నిజానికి అటు కుటుంబాన్నీ, ఇటు కెరీర్నీ గమనించుకోవడం సాధ్యమేనని చెప్పుకొస్తారు.

 

శ్రమించే తత్వమే కీలకం

 

ఇస్రో అంటేనే యంత్రాల సమాహారం. అందులోనూ ఏదన్నా ప్రాజెక్టు మొదలైందంటే ఇక హడావుడి అంతా ఇంతా ఉండదు. ప్రతి ఒక్క యంత్రమూ, ప్రతి ఒక్క ప్రణాళిక, ప్రతి ఒక్క క్షణమూ అక్కడ కీలకంగా మారిపోతాయి. ఇక లాంచింగ్ తేదీ దగ్గరపడినప్పటి నుంచీ..... నరాలు తెగిపోయే ఉత్కంఠత నెలకొంటుంది. రోజుకి 14 గంటలు పనిచేసినా ఇంకా తరగనంత పని ఉంటుంది. ఆ కొద్ది వారాలూ తన జీవితం ఎలా గడిచిపోతోందో కూడా తెలియదంటారు నందిని. కుటుంబ సభ్యుల తోడ్పాటు ఎంతగా ఉన్నా కూడా, రోజుకి నాలుగుగంటలకు మించి నిద్రపోయే అవకాశం దక్కదు. అయినా శ్రమకి వెరువక ప్రయోగం మీద దృష్టి పెడితేనే విజయం సొంతమవుతుంది.

 

 

ఓర్పే సాధనం

 

నిరంతరం శ్రమించాలన్నా, అనుకున్నది సాధ్యం కాకపోతే తిరిగి అదే పనిని అంతే శ్రద్ధతో చేయాలన్నా ఓర్పే కీలకం అంటున్నారు నందిని. అలాంటి ఓరిమి ఉంటేనే అటు కుటుంబమూ, ఇటు ఉద్యోగమూ ఫలప్రదంగా నిలుస్తాయని సూచిస్తున్నారు. మనిషిలో సహనం కనుక ఉంటే సగం లక్ష్యం చేతికి చిక్కినట్లే అని ఆమె నమ్మకమట. అందుకే అంతే సహనంతో ఆమె యంత్రాలని కూడా రూపొందిస్తారు. ఆ యంత్రాలని కూడా తన బిడ్డలులాగే భావిస్తారు.

 

ఆడవారు ఇంకా అడుగుపెట్టాలి

 

 

మునుపటితో పోలిస్తే అంతరిక్షరంగంలో స్త్రీల సంఖ్య కాస్త పెరిగింది. తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెలు ఈ రంగంలోకి ప్రవేశించాలనుకుంటే ప్రోత్సహిస్తున్నారు. కానీ ఈ మార్పు సరిపోదంటున్నారు నందిని. ఇప్పటికీ ఇస్రో వంటి సంస్థలలో నాలుగోవంతు కంటే తక్కువ స్త్రీలు ఉన్నారనీ, వారిలో ఉన్నత స్థానాలలో ఉన్నవారి సంఖ్య ఇంకా తక్కువనీ చెప్పుకొస్తున్నారు. మరి నందినివంటి మహిళా శాస్త్రవేత్తల స్ఫూర్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టేవారి సంఖ్య పెరుగుతుందని ఆశిద్దాం. స్త్రీ అంటే ఈ భూమి మీదే కాదు, అంతరిక్షంలో కూడా సగభాగం అని నిరూపిద్దాం.

- నిర్జర.