ఎందుకంటే...
    
    మిమ్మల్ని మీరు పోగొట్టుకోకుండా వుండటం ఎంత ముఖ్యమో, మీ భార్యను పోగొట్టుకోకుండా వుండటమూ అంతే ముఖ్యం.
    
    రోజూ ఎన్నోసార్లు అద్దంలో మీ ముఖాన్ని చూసుకుంటూ వుంటారు.

    మీ ముక్కు పళ్ళు, క్రాఫింగ్....మీరాశించిన స్థాయిలో లేకపోయినా వాటిని అందంగా చిత్రించుకునేందుకు (మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకుంటూ) ప్రయత్నిస్తున్నారు కదూ!
    
    You have to live with it. There is no other go.
    
    ఈ సత్యాన్ని ఆకళింపు చేసుకున్నారు కదా!
    
    You have to live with all Your disabilities.
    
    like that You have to live with Your life partner, Once You have accepted her as better half.
    
    ఇప్పుడు...
    
    ఇద్దరినీ నా కళ్ళ ఎదురుగా పక్కపక్కన నిల్చోపెట్టి వీక్షించగలుగుతున్నాను.
    
    నాకాశ్చర్యంగా వుంది.
    
    పెళ్ళిచేసుకుంది దేనికి?
    
    ఓ శాశ్వతమైన తోడుకోసం.
    
    ఆ తోడు బయటెక్కడా లభించదని ఎన్నో సందర్భాలలో తెలుసుకున్నారు.
    
    అందమైన జీవితం!
    
    ఓ అందమైన జీవితం మీకు కావాలి.
    
    సంతోషం కావాలి.
    
    ఏవో కుంటిసాకులు, అర్ధంలేని ఆరోపణలు, మితిమీరిన వ్యక్తిత్వాలు, దోషదర్శి ప్రవర్తనలు, కాల్చుకు తినే వ్యతిరేక భావాలు. చిన్న సమస్యల్ని భూతద్దంలోంచి చూడటాలు, ఒకరికొకరు ఉపయోగపడడం కూడా కూలీకింద భావించటాలు, మితిమీరిన సొంత ఆకర్షణలు, ఆలోచనరహితంగా లొంగిపోయే బలహీనతలు, తప్పుపట్టటానికి అలవాటు పడటాలు, గిల్లికజ్జాలు, నిరంతర కలహాలు..... ఇదేనా జీవితం...?
    
    సిగ్గనిపించటం లేదా?
    
    బాధనిపించటం లేదా?
    
    ఈ నిరంతర యాతన కోసమేనా పెళ్ళి చేసుకున్నది?
    
    పెళ్ళికిముందు మీ జీవితంలో పాతికేళ్ళు బాల్యం, విద్యాభ్యాసంలోని సాధనలతో గడచిపోయాయి.
    
    ఓ పాతికేళ్ళు పోయాక, షుగర్లూ, బీపీలూ, ఇంకా ఎన్నోరకాల రుగ్మతలూ, వృద్దావస్థలోని శారీరక బలహీనతలూ... పథ్యాలూ, మందులూ, పళ్ళు ఊడిపోవటాలూ, కళ్ళు కనబడకపోవటాలూ, మంచాన పడటాలూ, మందులమీద, డాక్టర్ల మీదా, ఇతరులమీదా ఆధారపడి బ్రతికే బతుకులు.
    
    ఈ పాతికేళ్ళలో విరుచుకుపడే ఇతర సమస్యలు ఎలాగూ వుంటాయి. పిల్లల చదువులు, ఆర్ధికమైన ఒత్తిడులు, ఉద్యోగాల వృత్తుల, వ్యాపారపరమైన టెన్షన్ లూ, ఇంకా మనకు తెలియకుండా అప్పటికప్పుడు నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడే సమస్యలు.
    
    ఈ తప్పుకోలేని విషవలయాల మధ్య రక్షణగా నిలబడేది ఒక్కటే భార్యాభర్తల అనుబంధం.
    
    మిమ్మల్ని ఆ భయంకరమైన వ్యాకులపాటులనుంచి కాపాడేది ఒక్కటే. భార్యాభర్తల అనుబంధం!!

    
    మీకు, ఆ నిరంతర సంఘర్షణల ఉలికిపాట్లలో ఊరట కలిగించేది ఒక్కటే భార్యాభర్తల అనుబంధం.
    
    ఆదమరచి, ఆ బలమైన అందాన్ని హేయంగా విస్మరించి నిరంతరమూ అశాంతుల్ని ఆహ్వానించటం మిమ్మల్ని లజ్జితుల్ని చేయటంలేదా?
    
    ఏది ఉండాలో అవి వదులుకోవటం అజ్ఞానమనిపించటం లేదా?
    
    ఒక్క మహాసత్యం గమనించండి. ప్రపంచచరిత్రలు తిరగేయండి. విప్లవభావాలున్న మేధావుల జీవితకథలు చదవండి.
    
    ఎన్ని సంజాయిషీలు చెప్పుకుని ఎక్కడెక్కడో, ఏమేమిటో అన్వేషణలు సాగించినా...ఇంతకన్నా అశాంతులే, దుఃఖాలే ఎదురయ్యాయిగాని ఈ మాత్రంలో కొంతైనా ఎక్కడా పొందలేకపోయారు.
    
    జీవితంలో అతి ముఖ్యమైన, విలువైన అంశం కాబట్టి ఈ అధ్యాయాలు ఎంతో వివరంగా మథించి మథించి రాయాల్సి వచ్చింది. ప్రతి అక్షరం పదిలంగా పొదువు కుంటూ, ఆ భావాలకు ప్రాణశక్తినిచ్చే ప్రయత్నంలో, మిమ్మల్ని కన్విన్స్ చేసే తపనలో నిజంగా అలసిపోయాను.
    
ఇహ డబ్బుగురించి...
    
    డబ్బు!
    
    ఈ పదం ఎంత ఆకర్షణీయమైనది!
    
    డబ్బు ఎంత అవసరం!
    
    ఇంట్లోంచి కాలు బయటపెడితే, కాలు బయటపెట్టనక్కరలేదు.... కాలు కదపకుండా ఇంట్లో కూర్చున్నాసరే... అనుక్షణం తరిమి తరిమి వేధించేది... డబ్బు.
    
    మనిషి జీవితం డబ్బుతో ఎంత ముడిపడి వుంది!
    
    ఆకలి తీరాలంటే, దాహం తీరాలంటే, కర్తవ్య నిర్వహణకోసం డ్యూటీకి వెళ్ళాలంటే, వొంటిమీద దుస్తులు ధరించాలంటే, శరీరానికి వచ్చిన వ్యాధులు తగ్గించు కోవాలంటే, వొంటికి కొంచెం గాలి తగలాలంటే, కాస్తంత వెలుతురులో మసలాలంటే, మనం విద్యావంతులం కావాలంటే, ఎప్పటికప్పుడు విజ్ఞానం పెంచుకోవాలంటే, పిల్లల్ని చక్కగా చదివించుకుంటూ ఆరోగ్యంగా చూసుకోవాలంటే, అలసిపోయిన శరీరం ఒకింత సేదతీరాలంటే, విసిగిపోయిన మనసు కొంచెం... రిలీఫ్ పొందాలంటే జిహ్వచాపల్యం కొద్దీ ఏమన్నా తినాలనిపిస్తే... ఇంకా ఇలాంటి జాబితా ఎంతో వుంది.
    
    వీటికోసం...
    
    ప్రతిక్షణం డబ్బు...
    
    ప్రస్తుతం నేను లగ్జరీల గురించి మాట్లాడటంలేదు.
    
    ఓ సామాన్య మానవుడుగా కనీసావసరాల గురించి మాట్లాడుతున్నాను.
    
    ఒక్కరోజు...కనీసం....నెలకు ఒక్కరోజు మనశ్శాంతీగా వుండనివ్వదు.
    
    ఇంట్లో పనివారికి (సినిమాల్లోలాగా) అదేదో యూనిఫారంలో నౌకర్లూ, చాకర్లూ, కిచెన్ లో కుక్ లూ కాదు అంట్లు తోమి, ఇల్లు ఊడ్చే పనిమనిషి.
    
    బట్టలు ఉతికే మనిషి.
    
    జీతాలు...
    
    అవి అయిపోగానే పేపర్ బిల్...
    
    'హమ్మయ్య' అనుకుంటుండగా కేబుల్ టీవీ అమ్మాయో, అబ్బాయో నెలవారీ బిల్.
    
    నరాల్ని పిండేసే కరెంట్ బిల్.
    
    అది పూర్తయ్యే లోపల 'బాబోయ్!' అనిపించే ఫోన్ బిల్.