"ఔను!"
    
    "నాపేరు రఘురాం.....లోపలికి రావచ్చా?" అనడిగాడు.
    
    "రండి" ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి పిలిచాను.
    
    "థాంక్స్" అతను వచ్చి కూర్చుని-
    
    "మీకు అహల్య తెలుసా?" అడిగాడు.
    
    "ఓసారి చూశాను" మొహంలో ఆశ్చర్యాన్ని దాచుకోకుండా చూస్తూ అన్నాను.
    
    అతను ఓసారి మొహం తుడుచుకున్నాడు.
    
    "మా అమ్మాయి పునీత.... మీ సెంటర్ లోనే కోచింగ్ తీసుకుంటోంది" అన్నాడు.
    
    "తెలుసు" అన్నాను.
    
    రఘురాం కాస్త ఇబ్బందిగా ముఖంపెట్టి నెమ్మదైన స్వరంతో - "అహల్యతో మీకు పరిచయం వుందేమోనని వచ్చాను. అనసూయగారు ఊళ్ళో లేరుట" అన్నాడు.
    
    "అహల్యగారికి ఏమైందీ?" ఆతృతగా అడిగాను.
    
    ఆయన లేచి నిలబడుతూ చెప్పాడు. "ఏమీకాలేదు. ఆవిడ కనబడడంలేదు."
    
    వెయ్యివోల్టుల షాక్ కొట్టినట్లుగా ఫీలయ్యాను.
    
    "మరి....మరి....పోలీస్....రిపోర్టు."
    
    నా మాట పూర్తికాకుండానే.
    
    "పునీత పెళ్ళి వచ్చే సోమవారం. ఈ సమయంలో పోలీసులూ.... అదీ.....భావ్యంకాదు. మీరు ఈ విషయం సాధ్యమయినంతగా గోప్యంగానే వుంచండి. ప్లీజ్" అన్నాడు.
    
    "అలాగే! కానీ ఆవిడకేమైందో....ఎవరైనా డబ్బుకోసం ఆవిడ్ని కిడ్నాప్ చేశారేమో" నాకు నిజంగా ఆందోళనగా అనిపించింది.
    
    "అలాంటిదేమైనా జరిగుంటే ఈపాటికి నాకు ఫోన్ చేసి తమ డిమాండ్స్ చెప్పి వుండేవారుగా..." అన్నాడు.
    
    నాకు నిజమేననిపించింది.
    
    "ఏదైనా ఇన్ ఫర్ మేషన్ తెలిస్తే నా సెల్ కి ఫోన్ చేసి చెప్పండి" అంటూ ఆయన తన కార్డు యిచ్చాడు.
    
    దిగాలుపడి వెళ్ళిపోతున్న ఆ కోటీశ్వరుడ్ని జాలిగా చూశాను.
    
    ఇంట్లోకి వచ్చి అహల్య రూపాన్ని గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించాను. అందాన్ని మించిన హుందాతనం, తల ఎగురవేసి మాట్లాడుతున్నప్పుడు గ్రేస్! ఆ కళ్ళల్లో వుట్టిపడే ఆత్మాభిమానం....చెప్పు నుండి కొప్పుదాకా ఆమె మెయిన్ టైన్ చేసిన స్టయిల్ నా కళ్ళల్లో ఆడుతోంది. బిజినెస్ పీపుల్ కి చాలామంది శత్రువులుంటారు. రఘురాంని వ్యాపారంలో దెబ్బతియ్యలేని శత్రువులెవరైనా ఈ పనిచేసి వుండవచ్చు! పాపం.....ఎండ కన్నెరుగని ఇల్లాలు. కూతురి పెళ్ళి పనుల్లో ఉత్సాహంగా తిరగాల్సిన సమయంలో ఏ దుర్మార్గుల చేతిలో చిక్కి ఇక్కట్లు పడుతుందో అనుకున్నాను.
    
    రఘురాంగారు ఎంత బాధపడుతున్నారో ఆయన కళ్ళల్లో తెలిసిపోతోంది. కానీ నాకు ఒక్క విషయం మాత్రం నచ్చలేదు. పరువుకోసం చూసుకుని ఆయన పోలీస్ రిపోర్టు యివ్వకపోవడం.
    
                                                                  * * *
    
    రాత్రి ఇంటికి ఆనంద్ వచ్చాడు.
    
    నేను కావాలనే నిద్ర నటించాను.
    
    అతను వంట మనిషి వడ్డిస్తే భోజనం చేశాడు.
    
    సిగరెట్ వెలిగించి గదిలోకి వచ్చాడు. హఠాత్తుగా నా కళ్ళమీద ట్యూబ్ లైట్ వెలుతురు పడేసరికి గభాల్న కళ్ళు తెరిచాను అరచెయ్యి అడ్డం పెట్టుకుంటూ.
    
    అతను విలాసంగా నా పక్కన పడుకుంటూ - "మాధవి బాగుందా?" అనడిగాడు.
    
    నా తలమీద బాంబ్ పడ్డట్లు అదిరిపడి చూశాను.
    
    ఆనంద్ నా మొహంమీదకి పొగ వదుల్తూ -
    
    "నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి వెళుతున్నావో నేను పట్టించుకోను అనుకుంటున్నావా?" అన్నాడు.
    
    "నీకు నేను వున్నానని జ్ఞాపకం వుంటుంది కూడానా?" హేళనగా అడిగాను.
    
    "ఇంటికి ఎవరొస్తున్నారో.....నువ్వెక్కడ తిరుగుతున్నావో పట్టించుకుంటాను. లేకపోతే రఘురాంలా చేతులు కాలాకా ఆకులు పట్టుకోవాల్సి వస్తుంది" అన్నాడు.
    
    "రఘురాం లాగాన?" అన్నాను.
    
    "ఔను! సాయంత్రం వచ్చాడుగా, ఏం చెప్పలేదా?" అన్నాడు.
    
    ఈ విషయం కూడా తెలుసా అన్నట్లుగా చూసాను.
    
    "ఏమన్నాడు?" రెట్టించాడు.
    
    "అహల్యగారు కనిపించడంలేదుట" అన్నాను.
    
    ఆనంద్ పెద్దగా నవ్వాడు.
    
    నేను ఆశ్చర్యంగా చూశాను. అందులో అంత నవ్వేందుకు ఏముందీ?"
    
    "అంతే చెప్పాడా....? నా పెళ్ళాం లేచిపోయిందని చెప్పలేదా?" అన్నాడు.
    
    "ఆనంద్..." అంత కోపంగా అరిచి చాలా రోజులయింది నేను.
    
    "ఏం మధ్యన నీకెందుకు ఆ వులుకు?" అన్నాడు.
    
    "నీది నీచమైన స్వభావం అందుకే నీకు లోకం అంతా అలాగే కనిపిస్తోంది." అన్నాను.
    
    "ఒసేయ్ మీ జాతి సంగతి నాకు తెలుసే! మొదట తినడానికి తిండి దొరికితే చాలనుకుని డబ్బున్నవాడిని కట్టుకుంటారు. రెండు పూటలా తిండి తిన్నాకా ఒళ్ళు చిమచిమలాడి అడ్డదారులు తొక్కుతారు. అందుకే మొదట నుండీ మిమ్మల్ని హద్దుల్లో పెట్టాలి. అవసరమైతే కాళ్ళూ చేతులూ విరగ్గొట్టాలి" కసిగా చెప్పాడు.
    
    "అలా వెళ్ళిపోవాలన్న కోరిక కలిగేటట్లుగా మీరెందుకు ప్రవర్తిస్తారు మరీ!" సూటిగా చూస్తూ అడిగాను.
    
    ఆనంద్ నేను ఎదురు మాట్లాడేసరికి ఇరిటేట్ అయిపోయాడు.
    
    "షటప్!" బెడ్ ల్యాంప్ తీసి నా మీదకి విసిరికొట్టాడు.
    
    నేను పక్కకి తప్పుకునేసరికే అది కాస్తా విరిగి ముక్కలైపోయింది.
    
    "ఏదైనా ముక్కలు చెయ్యడం నిమిషం పని అతకడం మాత్రం మీకు జన్మలో సాధ్యపడదు!" అన్నాను.
    
    "ఏవిటీ? నగ్న సత్యాలు చెప్తున్నావా?" ఆనంద్ నా దగ్గరకొచ్చి తన ఎడమచేతిని నావీపు వెనగ్గా పోనిచ్చి చేతులు కదలకుండా బంధించి పెట్టాడు. నేనెంత గింజుకున్నా అతని వుడుముపట్టు నుండి తప్పించుకోలేకపోయాను.
    
    "ఏమిటీ తిరుగుబాటు చేస్తున్నావు? తిండి ఎక్కువైందా?" అతను సిగరెట్ పీక నా గెడ్డం క్రిందగా తీసుకొస్తూ అన్నాడు.
    
    నేను ఎర్రగా మండుతున్న దాన్ని చూశాను. అప్రయత్నంగా గెడ్డం పైకెత్తాను. ఏ నిమిషాన్నైనా అది నా గెడ్డం క్రింద చుర్రుమంటూ కాలుస్తుందని నాకు తెలుసు. కానీ గెడ్డం క్రింద కాలలేదు. గుండెలమీద....అతి సున్నితమైన ప్రదేశంలో ....'అ...మ్మా..." అన్న కేక కూడా పూర్తిగా నా నోటి నుండి రాలేదు. ఇంకోవైపు....ఆ బాధ భరించలేక నేను పెదవిని గట్టిగా పళ్ళతో కొరికేసుకున్నాను.
    
    ఆనంద్ ముఖంలో పైశాచికత్వం తారట్లాడ్తోంది. నా జుట్టు పట్టుకుని వెనక్కి వంచి "ఏడవ్వేమే?" అన్నాడు.